నో కాంప్రమైజ్… ఈ తమిళుల ధోరణే అది… హిందీ భాష దగ్గర్నుంచి జల్లికట్టు దాకా పట్టిన పట్టు విడవరు, అసలు హస్తినలోని ఉత్తరాది ఆధిపత్య ధోరణిని ఢీకొట్టి నిలబడాలంటే తమిళుల తరువాతే ఎవరైనా….. ఇలా అనుకుంటాం, మెచ్చుకుంటాం… కానీ కొన్ని విషయాల్లో వాళ్ల ఉద్వేగాలు మనకు ఓపట్టాన అర్థం కావు… ప్రత్యేకించి డీఎంకే ఆలోచన సరళి… నాస్తికవాదం గట్రా ఎప్పుడో డైల్యూట్ చేశారు, ప్యూర్ ఫ్యూడల్ పార్టీలాగా తమను తాము మోల్డ్ చేసుకున్నారు, అది వేరే కథ… కానీ తమిళ టైగర్ల పట్ల, ఈలం పోరాటాల పట్ల తమ సానుభూతిని ఇప్పటికీ సజీవంగా ఉంచుకున్నారు… ఆ టైగర్లు అంతరించిపోయినా, ప్రభాకరన్ మరణంతోనే టైగర్ల పోరాటం ముగిసిపోయినా… ఇంకా ఎల్టీటీఈని డీఎంకే ఆరాధిస్తూనే ఉంది… స్టాలిన్ ప్రభుత్వంలోకి వచ్చి నాలుగు రోజులు కూడా కాలేదు, ఎన్నికల భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ అభ్యంతర పెడుతున్నా సరే… జైలులో యావజ్జీవం అనుభవిస్తున్న ఏడుగురు రాజీవ్ హంతకుల్ని విడిచిపెట్టాలటూ రాష్ట్రపతికి లేఖ రాసింది స్టాలిన్ ప్రభుత్వం… ఇప్పుడు తాజాగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల కాబోతున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సీరీస్ ఆపివేయించాంలంటూ కేంద్రానికి లేఖ రాసింది… సో, టైగర్ల పట్ల తమ ప్రేమలో వీసమెత్తు తేడా కూడా రాలేదు…
ఒక వెబ్ సీరీస్ ఆపివేయించాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా కేంద్రాన్ని కోరిందంటే… అదంత ప్రమాదకరమైన సీరీసా..? అంత ప్రయారిటీ ఇవ్వదగిన అంశమా..? అవన్నీ ఆలోచించరు తమిళులు… తమకు నచ్చకపోతే, చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా పెద్దగానే స్పందిస్తారు… అసలు మొన్నామధ్య ఈ సీరీస్‌కు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచే దీనిపై రచ్చ మొదలైంది… ట్విట్టర్లో, ఫేస్బుక్లో నెటిజనం, ప్రత్యేకించి తమిళ కనెక్షన్లున్నవాళ్లు నెగెటివ్‌గా క్యాంపెయిన్ మొదలుపెట్టారు… అక్కినేని సమంత పోషించిన పాత్ర ఈలం పట్ల తప్పుడు ప్రొజెక్షన్ అనేది విమర్శ… ఈ విమర్శలు బాగా పెరిగేసరికి… నిర్మాతలు నిడిమోరు రాజు, డీకే కృష్ణ (తెలుగువాళ్లే…) ఈ వ్యతిరేకతను తగ్గించడానికి వివరణలు మొదలుపెట్టారు… పలు భాషా పత్రికల్లో వార్తలుగా, ఇంటర్వ్యూలుగా కనిపించే ప్రకటనలను పబ్లిష్ చేయించుకున్నారు…
Ads
పైన కనిపిస్తున్న బిట్ ఆ ఇంటర్వ్యూ ప్రకటనలోనిదే… అందులోనే వివరణ… ‘‘ట్రైలర్‌లోని కొన్ని షాట్స్ చూసి కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, కానీ మాకు తమిళ ప్రజల మనోభావాలు తెలుసు, కల్చర్ తెలుసు, సీరీస్ చూశాక మాట్లాడండి, అప్పుడే ముద్రలు వేయకండి, ఈ సీరీస్‌లో ఎక్కువగా ఉన్నది తమిళులే…’’ ఇలా సాగింది… ఫస్ట్ పార్ట్‌లోనూ వీళ్లు అనేక సున్నితమైన విషయాలను ప్రస్తావించారు… కానీ ఎక్కడా కాంట్రవర్సీ రాలేదు, ఈలం పోరాటాల మీద మాకు అవగాహన ఉందని దర్శకులు చెబుతూనే ఉన్నారు, ఐనా గుడ్డిగా ఆ సీరీస్‌ను వ్యతిరేకించడం దేనికి..? పోనీ, టైగర్లు ఈ దేశానికి ఏమైనా మేలు చేశారా..? సాయం చేసిన చేతుల్నే నరికే బాపతు ప్రభాకరన్… రాజీవ్ గాంధీ హత్య ఆ సంస్థ చేసిన అతి పెద్ద తప్పిదం… దాన్ని దేశం క్షమిస్తుందా..? తన సమాధిని తనే తవ్వుకున్నాడు ప్రభాకరన్… ఇప్పటికీ టైగర్ల ఛాయలు ఇంకా ఏమైనా మిగిలిపోయి కనిపిస్తే పీకిపారేస్తుంది కేంద్ర ప్రభుత్వం… ఒక్క డీఎంకే దాన్ని ప్రేమించినంత మాత్రాన దాన్ని మొత్తం తమిళజాతి మనోభావాలుగా పరిగణించాలా..? ఎల్టీటీఈ కచ్చితంగా తీవ్రవాద సంస్థే… కాదు, ఉగ్రవాద సంస్థ… ఒకవేళ ఆ వెబ్ సీరీస్ అలా ప్రొజెక్ట్ చేసినా అందులో తప్పేముంది..? అబ్బే, అలా ఆలోచిస్తే దాన్ని డీఎంకే అనరు గాక అనరు… పైగా ఇప్పుడు అధికారమొచ్చింది… ప్రత్యర్థి పార్టీ బలహీనంగా ఉంది… మాట్లాడితే తమిళ జాతి ఎమోషన్స్ అంటారు… అదైనా హేతుబద్ధంగా ఉంటుందా, ఉండదు… అరె, బాబూ, మేం మీ టైగర్లను ఏమీ అనడం లేదురా తంబీ అన్నా వినరు..! ఆ ట్రైలర్లోనూ అభ్యంతరకర అంశాల్లేవు, కథ అభ్యంతరకరంగా ఉందని ఆ టీంలోని తమిళులు ఏమైనా డీఎంకే పెద్దలకు లీక్ చేశారా..? మరి ఆ సీరీస్ తమిళ మనోభావాలకు వ్యతిరేకంగా కనిపించింది వాళ్లకు..? పోనీ, తెలుగు నిర్మాతలు, దర్శకులు, హిందీ లీడ్ యాక్టర్ మనోజ్ వాజపేయి గాకుండా ఓసారి తమిళ సమంతతో చెప్పించండి… ఆ పాత్ర పోషిస్తున్నది కూడా ఆమే కదా…!!
Share this Article