.
పూర్తి ఫాంటసీ, కల్పనాత్మక కథలయితేనే బోలెడన్ని వివాదాలు చుట్టుముడుతున్న రోజులివి… అలాంటిది ఎవరైనా జాతీయ నాయకుడి పాత్రతో మిళితమైన, చరిత్రను కూడా జోడించినట్టు ప్రచారమవుతున్న కథ అయితే..? వివాదం రాకపోతేనే ఆశ్చర్యపోవాలి…!
ప్రభాస్ నటించే ఫౌజి సినిమా తాజా ఉదాహరణ… తన గ్లింప్స్, పోస్టర్ విడుదల చేశారు కదా మేకర్స్… అవి ఏం కథను సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాయో ఊహిస్తూ బోలెడు కథనాలు కనిపిస్తున్నాయి మీడియాలో… నేతాజీ కుటుంబానికి చెందిన ఒకాయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాడు… వెంటనే గ్లింప్స్ వాపస్ తీసుకోవాలని అంటున్నాడు…
Ads
‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనుంది ఈ సినిమా… ప్రభాస్ సినిమా అంటే తప్పకుండా పాన్ ఇండియా సినిమాయే కదా… మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమా మీద బాగా ఆసక్తిని రేకెత్తించింది… ప్రస్తుతం ఇండియన్ సినిమా ట్రెండ్ గూఢచారులు, దేశభక్తి కదా… ఫౌజి కూడా ఆ కోవలోని కథే అనిపిస్తోంది…

ఈ పోస్టర్‌లో ప్రభాస్ ముఖచిత్రం ఒక పురాతన బంగారు నాణెంపై ముద్రించినట్టుగా కనిపిస్తోంది… చుట్టూ మంటలు, వెనుక బ్రిటిష్ జెండా… నాణెంపై హిందీలో ‘అజ్ఞాతపర్వ్’ (Agyataparva) అనే పదం… దాని అర్థం ‘తెలియని అధ్యాయం’ లేదా ‘రహస్యంగా మిగిలిన అధ్యాయం’ అని చెప్పుకోవచ్చు… కింద ‘Most Wanted Since 1932’ అనే వాక్యం ఉంది…
అంటే 1932 నుంచే బ్రిటిష్ పాలకులకు కొరకరాని కొయ్యగా మారిన, వారి నిఘా వ్యవస్థకు చిక్కని ఒక వ్యక్తి కథను ఈ సినిమా చెబుతుందా..? అతడి ఉనికి ఒక రహస్య అధ్యాయమా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి… అయితే పోస్టర్‌లోని 1932ను సినిమా కథలోని ఏ నిర్దిష్ట సంఘటనకు అన్వయించాలో మేకర్స్ పూర్తి వివరణ ఇవ్వలేదు… కాబట్టి దాని ఆధారంగా కథను ఖరారు చేయలేం… ఓ సస్పెన్స్ ద్వారా హైప్ క్రియేషన్ ఇది… పర్లేదు, మంచి మార్కెటింగే…
గ్లింప్స్ మొదట్లోనే రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బెర్లిన్ వాతావరణాన్ని చూపిస్తారు… 1942 మే 29న నేతాజీ సుభాష్ చంద్రబోస్ హిట్లర్‌ను కలిసిన చారిత్రక ఘటనను నేపథ్యంగా తీసుకున్నారు… అక్కడే ప్రభాస్ పోషిస్తున్న కల్పిత పాత్ర గురించి నేతాజీ ప్రస్తావిస్తాడు…
బ్రిటిష్ నిఘా వ్యవస్థను ముప్పుతిప్పలు పెట్టిన భారతీయ గూఢచారి, సైనికుడు, వ్యూహకర్తగా ప్రభాస్ పాత్రను పరిచయం చేస్తారు… భగవద్గీత ఆధారంగా అతడు రూపొందించిన రహస్య సంకేత భాషను ఛేదించడం జర్మనీకి చెందిన ఎనిగ్మా కోడ్‌ను ఛేదించడం కంటే కష్టమనే స్థాయిలో అతడి ప్రతిభను వివరిస్తారు… చివర్లో రక్తసిక్తమైన దుస్తుల్లో, నోట్లో సిగరెట్‌తో భారీ తుపాకీని పేలుస్తున్న ప్రభాస్ కనిపిస్తారు…
దీన్నిబట్టి ‘ఫౌజీ’ కేవలం బ్రిటిష్ సైన్యంతో పోరాడే యాక్షన్ సినిమా కాదని, స్వాతంత్య్ర పోరాట కాలంలో శత్రువుల మధ్య పనిచేసే భారతీయ గూఢచారి కథగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది… అయితే ప్రభాస్ పాత్రకు సంబంధించిన వివరాలు, అసలు చరిత్రతో దాని సంబంధం ఎంతవరకు ఉంటుందన్నది సినిమా విడుదలయ్యే వరకు స్పష్టంగా తెలియదు… గ్లింప్స్ మాత్రం అదిరిపోయింది…
చంద్రకుమార్ బోస్… నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబానికి చెందిన వ్యక్తి ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో నేతాజీని చూపించిన తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు… చరిత్రను కల్పనతో కలిపి జాతీయ నాయకుల ప్రతిష్ఠను దెబ్బతీయకూడదన్నది ఆయన ప్రధాన వాదన…
బోస్ అక్టోబర్ 26న ఎక్స్‌లో స్పందిస్తూ, “చరిత్రను కల్పనతో కలపడం నేరం” అనే భావంతో వ్యాఖ్యానించాడు… దర్శకుడు హను రాఘవపూడి, చిత్ర బృందం గ్లింప్స్‌ను తొలగించి, చరిత్ర వక్రీకరణకు తావులేని కొత్త గ్లింప్స్‌ను విడుదల చేయాలని కోరాడు… అంతేకాదు, దర్శకుడు భారత ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశాడు… (చంద్రకుమార్ బోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అన్న కొడుకు మనవడు… అంటే నేతాజీకి మునిమనవడు (grandnephew) అవుతాడు…)

ఆయన అభ్యంతరంలో ప్రధానంగా మూడు అంశాలున్నాయి…
– నేతాజీని హీరోకు ఎలివేషన్ ఇచ్చే పాత్రగా చూపించడం..: నిజ జీవితంలో దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతాజీ, సినిమాలో కల్పితమైన ప్రభాస్ పాత్ర గొప్పతనాన్ని హిట్లర్‌కు వివరిస్తున్నట్టుగా కనిపించడం ఆయనకు అభ్యంతరకరం…
– చరిత్రలో జరిగిన సమావేశానికి కల్పిత సంభాషణలు జోడించడం…: నేతాజీ హిట్లర్‌ను కలిసిన విషయం చారిత్రక వాస్తవమే… కానీ ఆ సమావేశంలో ప్రభాస్ పాత్ర గురించి చర్చించినట్లు చూపించడం కల్పన…
– నేతాజీ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రమాదం…: నేతాజీ హిట్లర్‌ను సమాన స్థాయిలో కలిశారని, భారత స్వాతంత్య్ర పోరాటానికి జర్మనీ సహాయం పొందాలనే వ్యూహాత్మక ఉద్దేశంతో వ్యవహరించారని చంద్రకుమార్ బోస్ గుర్తుచేశాడు… నేతాజీ ఫాసిజాన్ని సమర్థించిన వ్యక్తి కాదని కూడా ఆయన స్పష్టం చేశాడు…
నిజానికి ఈయన ఆందోళనలో, డిమాండ్‌లో అర్థం లేదనిపిస్తోంది… నేతాజీ ఓ హీరో పాత్రకు ఎలివేషన్ ఇస్తున్నట్టు కనిపించినా సరే… నేతాజీ ప్రతిష్ఠకు ఇందులో వీసమెత్తు డ్యామేజ్ ఏమీ లేదు… తనను భారత స్వాతంత్ర్యం కోసం పోరాడే నాయకుడిగానే, ఆ దిశలోనే హిట్లర్‌ను కలిసినట్టుగానే చూపించారు…
చరిత్రను, కల్పనను జోడిస్తే తప్పా..? కాదు… అది ఆయా జాతీయ నాయకుల ప్రతిష్ఠకు భంగకరంగా ఉంటే, చరిత్ర వక్రీకరణ అయితే తప్పు… కానీ ఇందులో ఆ ప్రయత్నం ఏమీ కనిపించడం లేదు… చారిత్రక నేపథ్యంతో సినిమా తీస్తున్నప్పుడు కూడా కల్పిత పాత్రలను సృష్టించుకోవచ్చు… నిజమైన ఘటనల చుట్టూ కల్పిత కథను అల్లుకోవచ్చు… అలాంటి స్వేచ్ఛ సినిమా దర్శకులకు ఉంటుంది… క్రియేటివ్ ఫ్రీడమ్, క్రియేటివ్ స్పేస్…
దర్శకుడు చరిత్రను గౌరవిస్తూనే కల్పిత కథను చెప్పగలిగాడా? లేక హీరోను గొప్పగా చూపించాలనే ప్రయత్నంలో చరిత్రలోని మహానాయకుడి పాత్రను తగ్గించాడా? గ్లింప్స్ ఆధారంగా వచ్చిన ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానం సినిమా చూసినప్పుడే లభిస్తుంది… అప్పటివరకు చరిత్ర, కల్పన మధ్య గీత ఎక్కడ గీయాలన్న చర్చ మాత్రం కొనసాగుతుంది…
Share this Article