ఆంధ్రజ్యోతిలో ఓ వార్త… ఉద్యమకారులకు కేసీయార్ ఈసారి మొండిచేయి చూపించబోతున్నాడు… కనీసం పది మందికి టికెట్లు నిరాకరించబోతున్నాడు అని…! అదేదో పెద్ద తప్పయినట్టు, కేసీయార్ తెలంగాణకు ఏదో ద్రోహం చేస్తున్నంత ఫీల్ ఉంది ఆ వార్తలో… సరే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి రూట్ వేరు కదా, కేసీయార్‌తో ఎక్కడో బెడిసి, ఇద్దరూ తూకిత్తా తూకిత్తా అనుకుంటున్నారు కదా… కానీ కొన్ని సందేహాలు…
ఉద్యమకారులనగా ఎవరు..? తెలంగాణ ఏర్పడాలని ఉద్యమించడం వేరు… ఆ స్పూర్తిని, ఆ పోరాటాన్ని అభినందిద్దాం… కానీ రేప్పొద్దున తెలంగాణ చెట్టుకు కాయలు కోసుకుందాం అని కాదు కదా ఉద్యమించింది..? పదవుల కోసం కాదు కదా… డబ్బులు, అక్రమాలు, కబ్జాల కోసం కాదు కదా… నయా జమీందారులై పోవడానికి కాదు కదా… అసలు ప్రభుత్వ పోస్టులకు ఉద్యమభాగస్వామ్యం ఎలా ప్రధాన అర్హత అవుతుంది..? అందరికీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు, నామినేటెడ్ పోస్టులు కావాలంటే… అందరికీ న్యాయం ఎలా..? అసలు ఎవరు గొప్ప ఉద్యమకారుడో తేల్చే ప్రాతిపదిక ఏమిటి..?
ఇదేకాదు, అమరుల ఆశయాలు అంటూ మరొకటి పదే పదే ప్రస్తావిస్తుంటారు… అమరుల ఆశయం భౌగోళిక తెలంగాణ ఏర్పాటు… అది నెరవేరింది… ప్రజాస్వామిక తెలంగాణ అనే పదానికి నిర్వచనం చాలా కష్టం… రాజ్యం ప్రశ్నను సహించదు… కేసీయార్ దానికి అతీతుడేమీ కాదు… అసలు బీఆర్ఎస్ సహా అన్నీ ఫక్తు రాజకీయ పార్టీలే… కేసీయారే స్వయంగా తెలంగాణ వచ్చాక తమది ఇక ఉద్యమపార్టీ కాదని, ఫక్తు రాజకీయ పార్టీ అని తేల్చేశాడుగా… అంటే పోస్టులు, టికెట్ల అర్హతలు రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే ఖరారవుతాయి…
Ads
ఉద్యమకారులు కాబట్టే కొందరికి టికెట్లు ఇచ్చాడు… వాళ్లేం చేశారు..? బంగారు తెలంగాణ అనే స్వార్థపరుల బ్యాచుకు దీటుగా ఫక్తు రాజకీయ నాయకులయ్యారు… రేప్పొద్దున వాళ్లకు టికెట్లు ఇస్తే తన పార్టీ ఆయా చోట్ల గెలవదని కేసీయార్ గనుక భావించిన పక్షంలో టికెట్లు నిరాకరిస్తే తప్పేమిటి..? ఉద్యమాలు చేశారు కాబట్టి వాళ్లు ఏం చేసినా సరే అలాగే నెత్తిన మోయాలా..? పోనీ, కేసీయార్ ఉద్యమకారులకు ద్రోహం చేస్తున్నాడు అనుకుందాం… మిగతా పార్టీలు ఏం చేశాయి..?
ఉద్యమకారులకు అవకాశాలిద్దాం అనే భావనతో బీజేపీ, కాంగ్రెస్ తీసుకున్న చర్యలేమిటి..? ఎన్ని టికెట్లు ఇచ్చాయి..? బీఆర్ఎస్‌కు తప్ప మిగతా పార్టీలకు కూడా ఆ బాధ్యత ఉండాల్సిన పని లేదా..? మొదట్లో కాంగ్రెస్ ఇద్దరు ముగ్గురికి టికెట్లు ఇచ్చినట్టు గుర్తు… అవీ ఓడిపోయింది… అసలు తెలంగాణ ఇచ్చిందే మేం అని కాంగ్రెస్ ఎంత గొంతుచించుకున్నా ప్రజలు పట్టించుకుంటే కదా… సో, రాజకీయాలంటేనే డిఫరెంట్ సబ్జెక్టు… ఉద్యమకారుల కోటాలు, నాన్-ఉద్యమకారుల కోటాలు అంటూ ఉండవు… ఎవరు గెలుస్తారు.? ఏం చేస్తే మళ్లీ మనం అధికారంలోకి వస్తాం… ఇదొక్కటే సమీకరణం..!!
Share this Article