.
భారత్ లో ఒక కొత్త వెయ్యి రూపాయల నాణాన్ని ఈ మధ్య మన ప్రధాని మోడీ విడుదల చేశారు. ఆ నాణంపై ముద్రించేందుకు ఓ ఐకానిక్ పిక్చర్ ఎంపిక చేశారు. ఏంటా హిస్టారికల్ పిక్చర్… దాని కథ..?
2025, జూలై 27వ తేదీన ప్రధాని మోడీ తమిళనాడులోని గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా గంగైకొండ చోళపురం స్థాపకుడైన మొదటి రాజేంద్ర చోళుడి స్మారకార్థం కొత్త వెయ్యి రూపాయల నాణాన్ని ఆయన అదే రోజు విడుదల చేశారు. దాని వెనుక ఓ హిస్టారికల్ స్టోరీ ఉంది.
Ads
గంగైకొండ చోళపురం మొదటి చక్రవర్తి రాజేంద్ర చోళుడి చారిత్రక నావికా దండయాత్ర చేసి వెయ్యేళ్లు కావడం… గంగానదిని జయించి ఉత్తర భారతంపై విజయంతో గంగైకొండ చోళపురాన్ని నిర్మించడమే ఆ చరిత్ర. దాంతో ఆ నాణంపై ముద్రించిన గంగైకొండ చోళపురం ఆలయానికి సంబంధించిన పిక్చర్ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తించింది.
చోళుల కాలంలో నిర్మితమైన ఆలయాలు, కోటల శిల్పశైలి ఆకట్టుకునేది, అబ్బురపర్చేది. అదే సమయంలో వారి దండయాత్రలు చేసినప్పుడు వారు సముద్రమార్గంలో సాధించిన విజయాలు కూడా చరిత్రలో వారికి ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టాయి. ఇప్పటికే వారి నిర్మాణ కౌశల్యాన్ని అంతెత్తున చూపించే తంజావూర్ బృహదీశ్వరాయలం ఓ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతున్నది.
అయితే, ఇంచుమించు అదే తరహా నిర్మాణ శైలిని కల్గి ఉండే.. గంగైకొండ చోళపురంలోని బృహదీశ్వరాలయం బొమ్మను వెయ్యి రూపాయల కాయిన్ పై ముద్రించాక.. ఆ ఆలయ చరిత్ర, దాని సాంస్కృతిక వైభవం మరోసారి ప్రస్తావనలోకొచ్చింది.
అసలేంటి గంగైకొండ చోళపురం ప్రత్యేకత..?
11వ శతాబ్దంలో చక్రవర్తైన ఒకటో రాజేంద్ర చోళుడు… తన తండ్రి ఒకటో రాజ రాజ చోళుడు నిర్మించిన తంజావూర్ లోని బృహదీశ్వరాలయానికి దీటుగా గంగైకొండ చోళపురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఇది యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది. చోళుల వాస్తుశిల్పం, ఇక్కడి హైడ్రాలిక్ డిజైనింగ్స్, పట్టణ ప్రణాళిక, వారి రాజ్యనైపుణ్యానికి ప్రతీకలుగా కనిపించే ప్రదర్శనకు ఓ ప్రతిరూపం గంగైకొండ చోళపురం.
ఇక్కడి ఆలయంలో బృహదీశ్వరుడు, దుర్గ, పార్వతీ, మురుగన్ వంటి దేవతలు కొలువై ఉన్నారు. ఇక్కడ 63 మంది తమిళ శైవ సాధు కవులైన నయన్మార్లు అమరత్వం చెందారు.
తంజావూర్ అంత భారీ ప్రతిరూపంలా ఈ ఆలయ నిర్మాణం ఉండదుగానీ.. గంగైకొండలో శిల్పం ఆకట్టుకునేది. ఇక్కడి చెక్కిన సంక్లిష్టమైన శిల్పాలను అర్థం చేసుకోవడమూ ఆ సవాలే. మనోహరంగా కట్టిపడేస్తూనే ఆలోచింపజేసే శిల్పకళ ఈ గంగైకొండలో కనిపిస్తుంది. పైగా ఆధ్యాత్మికంగా ఒక ప్రశాంతమైన శివాలయమిది. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద శివలింగానికి కేరాఫ్ గా కూడా ఈ గంగైకొండ చోళపురం ఆలయాన్ని చెప్పుకుంటారు.
ఇంతకీ వెయ్యి రూపాయల నాణంపై ఏం ముద్రించారు..?
తమిళనాడు నుంచి ఆగ్నేయాసియా వరకూ చేరుకున్న రాజేంద్ర చోళుడి నావికా దండయాత్రను గుర్తు చేసేలా బొమ్మను కొత్త వెయ్యి రూపాయల నాణంపై ముద్రించారు. ఆ సమయంలో భారతీయ పాలకులు సాధించిన అరుదైన ఫీట్ ఇది. రాజేంద్ర చోళుడి దండయాత్రలతో చోళుల ప్రభావం.. ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, కాంబోడియా వరకూ విస్తరించింది. శతాబ్దాల కాలం నుంచి ఆ దేశాలతో వాణిజ్యం, దౌత్య సంబంధాలకు గట్టి పునాదులు వేసింది.
ఆది తిరువతిరై ఉత్సవం రోజునే నాణం విడుదల!
ప్రతీ ఏటా ఆది తిరువతిరై ఉత్సవాన్ని ఒకటో రాజేంద్ర చోళుడి జయంతిని పురస్కరించుకుని జరుపుతుంటారు. ఈసారి 2025 జూలై 23 నుంచి 27 వరకు ఈ ఉత్సవాన్ని ఆయన వెయ్యో జన్మదినం సందర్భంగా మరింత వైభవంగా నిర్వహించగా.. ఈ కార్యక్రమం చివరి రోజునే ప్రధాని నరేంద్రమోడీ ఈ ఆలయాన్ని సందర్శించి వెయ్యి రూపాయల నాణాన్ని విడుదల చేశారు.
గంగైకొండ చోళపురం ఆలయం ఎక్కడ ఉంది?
తమిళనాడు అరియలూర్ జిల్లాలో గంగైకొండ చోళపురం ఆలయముంది. చెన్నై నుంచి సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి.. తిరుచ్చి, కుంభకోణం వంటి క్షేత్రాల నుంచి రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. గంగైకొండ చోళపురం అనే పేరు వెనుక కూడా ఓ కథ చెబుతుంటారు.
గంగా నదిని జయించి.. ఆ నీటిని తీసుకొచ్చి.. చోళుల కొత్త రాజధానిగా రాజేంద్ర చోళుడు నిర్మించాడు కాబట్టే ఈ నగరానికి గంగైకొండ అనే పేరు వచ్చిందంటారు. అందుకే, ప్రధాని మోడీ కూడా గంగాజలం తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేయించారు. (దీనికి స్పిరిట్యుయల్ ప్రాధాన్యతకన్నా చోళుల యుద్ధవిజయాలకు సంకేతలే ప్రధానం) ఉత్తర భారతదేశంపై రాజేంద్ర చోళుడు సాధించిన ప్రతీకాత్మక విజయాన్ని ఈ గంగైకొండ చోళపురం సూచిస్తుంది.
వెయ్యి రూపాయల నాణంపై గంగైకొండ చోళుడి నావికా దండయాత్ర బొమ్మను ముద్రించడమనేది.. తమిళనాడు రాష్ట చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేది. దాని విశేషాల్ని మరింతగా ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేది. ఇప్పుడు చాలామంది సాంస్కృతిక, ఆధ్యాత్మిక పర్యటనలు చేయాలనుకునేవారి చూపును కూడా ఈ క్షేత్రం తన వైపు మళ్లిస్తోంది. భారతదేశ సముద్ర దండయాత్రల్లో భారతదేశంలోనే చోళుల యుగం ఓ స్వర్ణయుగంగా కూడా చెబుతుంటారు.
గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన ఎలా మరి..?
అక్టోబర్ నుంచి మార్చ్ వరకు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణముంటుంది. సందర్శకులెవ్వరైనా ఉచిత దర్శనానికి అవకాశముంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకూ కూడా ఈ ఆలయం తెరిచే ఉంటుంది. దీని సమీపంలోనే బృహదీశ్వరాలయం, ఐరావతేశ్వరాలయం, స్వామిమలై వంటి ప్రముఖ ఆలయాలు ఆకట్టుకునేవి…… ( రమణ కొంటికర్ల )
Share this Article