.
మనిషి బతికుండగానే చంపేయడం… ‘ఘటశ్రాద్ధం’
… 2023లో నిజామాబాద్‌లోని ఖలీల్‌వాడీలో ఓ తండ్రి తన కూతురికి దశదినకర్మ చేసి పిండం పెట్టాడు. తల్లిదండ్రులు చేసిన పెళ్లిని కాదని, తనకు నచ్చిన వాడితో వెళ్లిపోయినందుకు శిక్షగా తండ్రి ఆమెకు ఈ శిక్ష వేశాడు.
Ads
అలాగే మధ్య ప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్ జిల్లాకు చెందిన అనామిక దూబె తమకు నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు ఆమె బతికుండగానే ఫొటోకు దండ వేసి పిండం పెట్టేశారు. బతికున్న వ్యక్తులకు ఇలా శ్రాద్ధకర్మలు చేయొచ్చా? అలా చేయడాన్ని ఏమంటారు? అలా చేసే అవసరం ఏమిటి?
హిందూ మతం ప్రకారం, మరణించిన వారిని గుర్తుచేసుకుంటూ, పైలోకాలలో ఉన్నవారి ఆకలిని తీర్చి, వారికి కృతజ్ఞతగా చేసే పనే ‘శ్రాద్ధం’. శ్రద్ధగా చేయాల్సిన పని కాబట్టి దీనికి ‘శ్రాద్ధం/శ్రాద్ధ’ అనే పేరు వచ్చిందని అంటారు. ‘శ్రాద్ధం’ పురుషులే చేయడం రివాజు.
పురుషులెవరూ అందుబాటులో లేనప్పుడు చనిపోయిన వ్యక్తి కుమార్తె, భార్య, తల్లి, కోడళ్లలో ఎవరైనా శ్రాద్ధం పెట్టవచ్చని కూడా అంటారు. అయితే అసలు వేదాల్లో ఎక్కడా ‘శ్రాద్ధ కర్మల’ ప్రస్తావన లేదని, శ్రాద్ధం అనేది ధర్మవిరుద్ధమని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలు తెలిసినవారే చెప్పాలి.
నాలాంటి కొందరికి శ్రాద్ధ కర్మల పట్ల నమ్మకం ఉండకపోవచ్చు. దాని బదులు ఎవరికైనా సాయం చేస్తే మేలని అనిపిస్తూ ఉండొచ్చు. దీనికొక వెబ్‌సైట్ చాలా విచిత్రమైన వివరణ ఇచ్చింది.
‘రోగికి జ్వరం వస్తే మందు ఇస్తాం. పరిస్థితి మించితే, చికిత్స చేయిస్తాం. కానీ దానం చేయమని చెప్పం. శ్రాద్ధం కూడా అలాంటిదే. పితృదేవతలకు ఇదొక అవసరమైన చర్య. అది వదిలేసి, దానం మాత్రమే చేయమనడం సరికాదు. శ్రాద్ధంతోపాటు దానం చేస్తే మేలు కలుగుతుంది’ అని చెప్పింది.
సరే, బతికున్న వ్యక్తికి ఇలా శ్రాద్ధకర్మలు చేయొచ్చా అనే ప్రశ్న దగ్గరికి వద్దాం. శ్రాద్ధ కర్మలు మొత్తం 10. ఏకోద్దిష్ట, నిత్యం, దర్శ, మహాలయ, సపిండి, తీర్థ, నాందీ, హిరణ్య, ఆమ, ఘట… ఇందులో చివరిదైన ‘ఘట’ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి.
ఒక వ్యక్తి వేదానికి, కులానికి, పెద్దల మాటకు విరుద్ధంగా నడుచుకుంటే, అలా చేసినందుకు పశ్చాత్తాప పడకపోతే అతనికి/ఆమెకు బతికుండగానే అపరకర్మలు చేస్తారు. దాన్నే ‘ఘటశ్రాద్ధం’ అంటారు.
‘కన్యాశుల్కం’ నాటకంలో బుచ్చమ్మ గిరీశంతో వెళ్లిపోయిన తర్వాత, తన మీద కోపంతో ఆమె తండ్రి అగ్నిహోత్రావధాన్లు ‘రేపు ఇంటికి వెళుతూనే దానికి ఘటశ్రాద్ధం పెట్టేస్తాను’ అంటాడు. ఈ కర్మలో భాగంగా ఒక కుండను నీటితో నింపి, ఇంటి పనివాళ్లతో దాన్ని తన్నించి, ఆ నీటిని ఒలకపోయిస్తారు.
తద్వారా ఆ వ్యక్తికి ఇంక తమ కుటుంబంతో సంబంధం లేదని తేల్చేస్తారు… తెగదెంపులు… కన్నడ రచయిత యు.ఆర్.అనంతమూర్తి ‘ఘటశ్రాద్ధ’ పేరుతో ఓ నవలిక రాయగా, ప్రముఖ దర్శకుడు గిరీశ్ కాసరవెల్లి దాన్ని సినిమాగా తీశారు.
దర్శకుడిగా ఆయనకదే మొదటి సినిమా. ఓ బ్రాహ్మణ వితంతువు మరో వ్యక్తి వల్ల గర్భవతి కావడం, ఆమెను తండ్రి ఇంటి నుంచి వెలేసి, ఆమెకు ఘటశ్రాద్ధం పెట్టడం అందులోని కథాంశం. 1977లో విడుదలైన ఆ సినిమా ‘జాతీయ ఉత్తమ చిత్రం’ పురస్కారం అందుకుంది. దేశంలో తీసిన 10 ఉత్తమ సినిమాల్లో ఒకటిగా పేరు పొందింది.
‘ఘటశ్రాద్ధం’ ప్రస్తావన కొన్ని గ్రంథాల్లో కూడా ఉంది. భాసుడు సంస్కృతంలో రాసిన ‘ప్రతిమ’ నాటకాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి తెలుగులోకి అనువదించినప్పుడు ఒకచోట ‘కొడుకు దుష్టుఁడేని ఘటశ్రాద్ధము చేసి వాని కపుత్త్రిత్వ..’ అని రాశారు. వడ్డెర చండీదాస్ రాసిన ‘అనుక్షణికం’ నవలలో కూడా ‘ఘటశ్రాద్ధం’ ప్రస్తావన ఉంటుంది.
దీంతోపాటు బతికున్నవారు తమకు తామే పిండం పెట్టుకుని, శ్రాద్ధ కర్మలు చేసుకోవచ్చు. హిందూ మతం ఆ అవకాశం కూడా ఇచ్చింది. దాన్ని జీవశ్రాద్ధం, స్వపిండం, ఆత్మపిండం అంటారు… (కొడుకులు తమ మరణానంతరం పితృకర్మలు సరిగ్గా చేయరనే సందేహాలున్నవాళ్లు ఆత్మపిండం పెట్టించుకుంటారు… (ఆత్మపిండం అనంతరం దాదాపు సన్యాస జీవితం గడపాలని కొన్ని నిబంధనలూ ఉన్నట్టున్నాయి…)
కొడుకులు లేనివారే కాకుండా, కొడుకులు ఉన్నవారు కూడా తమకు తాము పిండం పెట్టుకోవచ్చని ‘హేమాద్రి’ అనే గ్రంథంలో ఉందంటారు. లింగ, ఆది, ఆదిత్య పురాణాల్లో కూడా జీవశ్రాద్ధం, స్వపిండం గురించి రాశారని పండితుల మాట…. – విశీ (వి.సాయివంశీ)
Share this Article