Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బాడీ షేమింగ్..! ఫిలిమ్ జర్నలిస్టులు ఎక్కడైనా అదే తిక్క ధోరణి..!!

November 10, 2025 by M S R

.

ఫిలిమ్ పర్సనాలిటీలే కాదు, ఫిలిమ్ జర్నలిస్టులు అంతకన్నా ఎక్కువ… పిచ్చి కూతలకు వాళ్లు, పిచ్చి ప్రశ్నలకు వీళ్లు… తెలుగే కాదు, ఏ భాష ఇండస్ట్రీ అయినా అంతే… ఎవరూ తక్కువ కాదు…

ఈమధ్య తెలుగు ఫిలిమ్ జర్నలిస్టుల రోత ప్రశ్నల గురించి చెప్పుకుంటున్నాం కదా… తమిళంలో ఇలాంటిదే ఓ ఉదాహరణ… తాజాది… గౌరీ జి కిషన్ అని నటి… జాను సినిమాలో చైల్డ్ ఆర్టిస్టు… ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది…

Ads

‘అదర్స్’ అనే ఆమె తాజా సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ప్రెస్ మీట్… ఓ యూట్యూబర్ అడిగాడు ఆమెను… ‘మీ బరువెంత?’… మరొక రిపోర్ట్ ప్రకారం… అతను ఆమె సహనటుడు (హీరో)ని ఉద్దేశించి, “మీరు గౌరీ కిషన్‌ను ఎత్తారు కదా, ఆమె ఎంత బరువు ఉంటారు?” అని అడిగాడు…

ఈ సినిమాలో ‘ఓరు పార్వై పర్వతానే’ అనే ఒక సాంగ్ ఉంటుంది… ఆ సాంగ్ లో హీరో హీరోయిన్ ని ఎత్తుకుంటాడు… అదీ నేపథ్యం… వ్యంగ్యం, వెటకారం… ఆమె బరువును ఉద్దేశించి ఒకరకంగా బాడీ షేమింగ్… అవహేళన…

ఆ ప్రెస్ మీట్‌లో వేరే మహిళలే లేరు… ఆమె ఒక్కతే… తన స్టాఫ్ లేడీస్ కూడా అక్కడ లేరు… ఆ మేల్ వాతావరణంలో కూడా ఆమె ధైర్యంగా… ఆ ప్రశ్నకు తీవ్రంగా స్పందిస్తూ, ఘాటుగా బదులిచ్చింది…

gouri

  • “నా బరువు తెలుసుకుని మీరు ఏం చేస్తారు? దాని వల్ల మీకు ఏంటి ఇబ్బంది?”
  • “ప్రతి మహిళకు భిన్నమైన శరీరాకృతి ఉంటుంది. నా ప్రతిభ గురించి మాట్లాడండి. నేను ఇప్పటివరకూ చేసిన సినిమాలు, రోల్స్ గురించి అడగండి చెబుతాను.”
  • “ఇలాంటి ప్రశ్నలు అడిగి మీ వృత్తిని అవమానించొద్దు. ఇది తెలివితక్కువ ప్రశ్న (Stupid Question)…”
  • ‘‘నన్ను ఆ పాత్రకు తీసుకున్న డైరెక్టర్‌కు లేని సమస్య మీకేం వచ్చింది?’’

గతంలో కూడా ప్రముఖ నటీమణులు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పారని, అందుకే తాను అడిగానని, బదులు చెప్పాలని జర్నలిస్ట్ తన ప్రశ్నను ఓ మూర్ఖంగా సమర్థించుకోవడానికి ప్రయత్నించాడు… “మీరు ఇదే ప్రశ్న హీరోలను అడుగుతారా?” అని కూడా ప్రశ్నించింది ఆమె తనను…

ఈ ఘటన తర్వాత, గౌరీ కిషన్ తన సోషల్ మీడియా వేదికగా ఒక స్టేట్‌మెంట్ (పోస్టు) విడుదల చేసింది… ఆ పోస్టులోని ముఖ్యాంశాలు…:

  • బాడీ షేమింగ్‌ను సరదాగా భావించి దాన్ని సాధారణీకరణ చేయడం (Normalising) కరెక్ట్ కాదు… 
  • “ప్రజా జీవితంలో ఉన్నందున, పరిశీలన (Scrutiny) వృత్తిలో భాగమని నేను అర్థం చేసుకున్నాను. అయితే, ఒక వ్యక్తి శరీరాన్ని లేదా రూపాన్ని లక్ష్యంగా చేసుకునే వ్యాఖ్యలు లేదా ప్రశ్నలు ఏ సందర్భంలోనూ తగదు…”
  • “నా సినిమాల గురించి, నా పని గురించి ప్రశ్నలు అడిగి ఉంటే బాగుండేది…”
  • “నేను ఒక్క మహిళను కావడం వలన నన్ను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టారు… 
  • ఈ వివాదం కారణంగా జర్నలిస్ట్‌ను ఎవరూ వేధించవద్దు.,.

gouri

జర్నలిస్టులతో ఎవరూ గోక్కోవడానికి సిద్ధపడరు ఇండస్ట్రీలో… ఇంకా వేధిస్తారని..! అందుకే సినిమావాళ్లంటే అలుసు… ఈ కుప్రశ్నలకు ప్రధాన కారణం అదే… కాకపోతే అందరూ సుమలాగా వెంటనే క్షమాపణలు చెప్పేయరు… తప్పులేకపోయినా…

ఈమధ్యే కదా ‘నిజజీవితంలో మీరు కూడా వుమెనైజరా’ అనే తలతిక్క ప్రశ్న… ‘మీరు హీరో మెటీరియల్ అనే అనుకుంటున్నారా’ అనే మరో దరిద్రగొట్టు ప్రశ్నల వివాదం చదివాం… మొన్న చూశాం కదా, మంచు లక్ష్మి ప్రతిస్పందన… దెబ్బకు ఆ మూర్తి అట ఎవరో జర్నలిస్టు దిగివచ్చి, తన పిచ్చి ప్రశ్నల పట్ల సారీ సారీ అని వీడియో రిలీజ్ చేశాడు… ఆమె కంచు లక్ష్మి కాబట్టి అలా ప్రతిఘటించింది… అందరికీ ఎలా సాధ్యం అంటారా..?

కానీ మార్పు వస్తోంది… గౌరీ కిషన్ ఉదాహరణ అదే… సదరు జర్నలిస్టు (?) ప్రశ్న, గౌరీ సమాధానం, స్పందన తీరును ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసించి, ఆమెకు అండగా నిలిచారు…  (ఈ బరువు బాపతు ప్రశ్నలు గతంలో అపర్ణ బాలమురళి, నిత్యా మేనన్ వంటి తారలకు కూడా ఎదురయ్యాయి)…

నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar), గాయని చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada), నటి రాధికా శరత్‌కుమార్ (Radhika Sarathkumar), నటీనటుల సంఘం (South Indian Artistes’ Association – నడిగర్ సంగం) అధ్యక్షుడు నాజర్ (Nassar), నటులు విష్ణు విశాల్ (Vishnu Vishal), కవిన్ (Kavin), దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith), బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా (Jwala Gutta) ఆమెకు మద్దతుగా ప్రకటనలు చేశారు…

దాంతో ఆ ఇన్‌సెన్సిటివ్ ప్రశ్న అడిగిన యూట్యూబ్ జర్నలిస్ట్ (ఆర్. ఎస్. కార్తీక్) తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తర్వాత ఒక వీడియో ద్వారా స్పందించాడు… అబ్బే, నేను ఆ ప్రశ్నను సరదాగా అడిగాను, బాడీ షేమింగ్ నా ఉద్దేశం కాదు అని మరో మూర్తిలా వివరణ ఇచ్చాడు… తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారట, క్షమాపణలు అని కూడా చెప్పాడు… కథలో నీతి ఏమిటయ్యా అంటే… జర్నలిస్టుల వెకిలి ప్రశ్నలకు భయపడకుండా, దీటుగా రియాక్ట్ కావడమే ఈ వెగటు ధోరణికి సొల్యూషన్..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బాడీ షేమింగ్..! ఫిలిమ్ జర్నలిస్టులు ఎక్కడైనా అదే తిక్క ధోరణి..!!
  • అందెశ్రీ..! ప్రజా కవి, సహజ కవి, ప్రకృతి కవి… మాయమైపోయాడు..!!
  • శారద పాత్ర ఉంటే చాలు… పరుచూరి బ్రదర్స్ కలాలకు పదును…
  • వయోలినిస్ట్ సుడిగాలి సుధీర్… ఆసక్తికరంగా ఓ టీవీ షో ప్రోమో…
  • రోత కూతలు… చిల్లర వ్యాఖ్యానాలు… వీడెవడ్రా బాబూ..?!
  • రోజూ 2 లక్షల మందికి వండి వడ్డించగల అత్యంతాధునిక వంటశాల
  • బండి సంజయ్ సెలుపుతున్నడు… సునీత, కేటీయార్ గ్రేట్ విలనీ అట..!!
  • మన న్యాయవ్యవస్థలో న్యాయం ఓ ఎండమావి… ఈ నివేదిక చెప్పేదిదే…
  • ఈ నగలు దిగేసుకుంటే చాలు… ‘కళల వధువు’ కావడం ఖాయం..!!
  • చక్ దే ఇండియా..! ఆగిపోయిన ఈ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ మళ్లీ కదిలింది..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions