సంజయ్ రౌట్… శివసేన పార్టీకి మౌత్ పీస్… ఉద్దవ్ ఠాక్రేకు ఆంతరంగికుడు, సామ్నా పత్రికకు చీఫ్.., బీజేపీ నుంచి దూరం జరిగి, ఎన్సీపీతో పొత్తు పెట్టుకుని, కాంగ్రెస్‌ను కలుపుకుని ఓ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ‘‘సంధాన పాత్ర’’ పోషించినవాడు… బీజేపీ మీద రోజూ కారాలు మిరియాలు నూరి నూరి ఎగజిమ్ముతుంటాడు… అలాంటి రౌట్ నోట ‘‘మోడీ టాప్ లీడర్’’ వంటి ప్రశంసావ్యాఖ్యలు వెలువడుతున్నయ్… ఠాక్రే ఆంతరంగికంగా ప్రధాని మోడీతో భేటీ వేశాడు… దీంతో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా, కూలిపోతుందా అనే సందేహాలు, వార్తలు, ప్రచారాలు స్టార్టయ్యాయి… నిజానికి ఇప్పటికిప్పుడు ఎన్సీపీతో, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకోవాల్సినంత చిక్కులు, విభేదాలు ఏమీ ఆ పార్టీల నడుమ రాలేదు… సాఫీగా సాగిపోతున్నది రథం… ఠాక్రే మెడ మీద కత్తిపెట్టడానికి మోడీకి పెద్ద చాన్సేమీ లేదు… కావాలంటే పవార్ బోలెడు ఇష్యూల్లో చిక్కుతాడేమో గానీ ఠాక్రేను వేటాడటానికి ఏమీలేదు… ఐనాసరే, ఎందుకిలా ముఖచిత్రం మారిపోతున్నట్టు కనిపిస్తోంది..?
శివసేన అడుగుల్లో, మాటల్లో, స్వరాల్లో తేడా ఎందుకొస్తోంది..? అబ్బే, ఏమీలేదు, మరాఠా రిజర్వేషన్ల మీద మాట్లాడటానికి ఠాక్రే ప్రధానిని కలిశాడు అని శివసేన అంటున్నా దాన్నెవడూ నమ్మడు… పోలవరం కోసం జగన్ అమిత్ షాను కలిశాడు అని చెప్పినట్టే ఉంటుంది ఇది కూడా… ఠాక్రే కూడా… చాలా లైటర్ వీన్లో ‘‘నేనేమైనా నవాజ్ షరీఫ్‌ను కలిశానా..? ఈ దేశప్రధానినే కదా’’ అని కొట్టిపారేశాడు… అయితే ఏ కారణంతో ఠాక్రే తిరిగి బీజేపీ పట్ల సానుకూల వైఖరిలో వెళ్తున్నాడు, బీజేపీ ఎందుకు ఠాక్రేను దువ్వుతోంది అనేది ఇప్పుడప్పుడే క్లారిటీ రాదు… ఇష్యూ నేరుగా ప్రధానితో చర్చ దాకా వెళ్లిందంటే ఏదో కీలకాంశమే… బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ కూడా ‘‘మోడీ తలుచుకుంటే మళ్లీ శివసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయి’’ వంటి సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నాడు… పవార్ కూడా తమ సంకీర్ణ ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనే సందేహంలో పడ్డాడు… అందుకే ‘‘ఇచ్చిన మాట విలువ’’ ఏమిటో ఠాక్రేకు గుర్తు చేస్తున్నాడు… అయిదేళ్లూ తప్పకుండా కలిసి ఉందాం అని ఠాక్రే ముందుగా మాట ఇచ్చాడు, ఆ తరువాతే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు…
Ads
‘‘ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ మీద బాగా వ్యతిరేకత ఉండేది… ఇందిరా గాంధీ మీద కూడా… అప్పుడు బాల్ ఠాక్రే ఇందిరకు ఓ మాట ఇచ్చాడు, ఎప్పుడూ కాంగ్రెస్ మీద పోటీచేయను అనేది ఆ హామీ… ఆ మాట మీదే నిలబడ్డాడు… సో, సంకీర్ణం విషయంలో కూడా శివసేన తన మాటను నిలుపుకుంటుంది, అందుకే ఐదేళ్లూ సంకీర్ణమే ఉంటుంది… అంతేకాదు, ఐదేళ్ల తరువాత కూడా మాతోనే శివసేన ఉంటుంది…’’ అని పవార్ ఏదో చెప్పుకొచ్చాడు… కానీ అబద్ధం… ఎందుకంటే..? ఎమర్జెన్సీ సమయంలో ఠాక్రేను వేటాడటానికి, శివసేన చాప్టర్ క్లోజ్ చేయడానికి ఇందిర రెడీ అయ్యింది… ఈ పవారే మధ్యవర్థిత్వం కావచ్చు బహుశా… ఇందిర ఎదుట ఠాక్రే మోకరిల్లాడు, చెప్పినట్టు వింటాను అన్నాడు… కానీ ఆరోజులు వేరు… ఠాక్రే లేడు, ఇందిర లేదు… అసలు ఆ కాంగ్రెసే కాదిప్పుడు… పైగా రాజకీయాల్లో ఇప్పుడు ఏమిటనేదే ముఖ్యం, గంట తరువాత ఏమిటనేది ఎవరూ చెప్పలేరు… బీజేపీతో కలిసి వోట్లడిగి, ఫలితాలు రాగానే, ప్లేటు మార్చి, ఎవరి మీదనైతే పోటీలు పడ్డారో, ఆ పవార్‌ను, ఆ కాంగ్రెస్‌ను కలుపుకుని సర్కారు ఏర్పాటు చేయలేదా..? అందుకని రాజకీయాల్లో ‘‘ఇచ్చిన మాటలు’’ అనే నిరర్థక పదానికి విలువ లేదు…
సంజయ్ రౌట్ ఏమంటున్నాడో తెలుసా..? పవార్ చెప్పినట్టుగా… ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తాం అనడం లేదు… ‘‘స్నేహం చేయాలీ అనుకోగానే పులితో ఎవరూ స్నేహం చేయలేరు… ఎవరితో స్నేహం చేయాలో తేల్చుకునేది పులి మాత్రమే…’’ (పులి అంటే శివసేన)… నిజమే గానీ భయ్యా… పులితో స్నేహం అనేదే పెద్ద ప్రమాదకరమైన ఫీట్ కదా… బీజేపీకి మొన్నటికిమొన్న ఎలాగూ పులితో దోస్తీ ఏమిటో అర్థమైంది… వాచిపోయింది… రేప్పొద్దున ఎన్సీపికి, కాంగ్రెస్‌కు కూడా సమజ్ అవుతుంది, అంతే కదా రౌట్ భయ్యా…!!
Share this Article