………. BY………. Enugurthi Sathyam……………. ఉత్త ముచ్చట్లు……… తెలంగాణలో ఏం జరుగుతోంది…? రాజకీయ ముఖచిత్రం క్రమంగా మారుతోంది. అవును… స్వీయ తప్పిదాల వల్ల టీఆర్ఎస్ బలహీనపడుతోంది. బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగానే ఉంది. ఎందుకంటే… ఆ పార్టీ నిర్మాణం పెద్దది. సంప్రదాయ ఓటు బ్యాంకు పదిలం. కానీ ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడు ప్రదర్శించడం లేదు. ప్రస్తుతానికి ఆ పార్టీకి ఫుల్‌టైమ్ రాష్ట్ర నేత లేరు. ప్రస్తుతం ఉన్నది… రాజీనామా చేసిన ఆపద్ధర్మ పీసీసీ అధ్యక్షుడు. ఎవరినైనా ఫుల్‌టైమ్ పీసీసీ నేతను నియమిస్తే బలపడొచ్చని ఆలోచించాల్సిన ఆ పార్టీ నాయకత్వం… తొందరపడి ఎవరిని నియమిస్తే.. ఏం నష్టం జరుగుతుందో అనే ఆత్మన్యూనతలో ఉంది. ఇప్పుడే పీసీసీ నేతను నియమించవద్దని… నాగార్జునసాగర్ ఉపఎన్నిక పూర్తయిన తర్వాత నియమిస్తే బెటర్ అని…. ఆ పార్టీలోని ఓ పెద్దాయన అధిష్ఠానానికి లేఖ రాసినట్టు వార్తలొచ్చాయి.
(బొమ్మ :: సుభానీ)
ఇక… బీజేపీ జాతీయ నాయకత్వం దిశానిర్దేశంతో.. రాష్ట్ర నాయకత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రెస్మీట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ఆందోళనలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పార్టీ పడుతున్న కష్టానికి… ప్రజలు కూడా ఫలితం ఇస్తున్నారు. ఇటీవల ఏ ఎన్నిక జరిగినా వరుస విజయాలు కట్టబెడుతున్నారు. బీజేపీ దూకుడు ఏ స్థాయిలో ఉందంటే… హుజూర్నగర్ నియోజకవర్గంలో గిరిజనుల భూములు ఆక్రమణకు గురయితే… హైదరాబాద్ నుంచి నేతలంతా వందల వాహనాల్లో వెళ్లి…. ఆక్రమణల్ని తొలగించేందుకు ప్రయత్నించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా బీజేపీ.. టీఆర్ఎస్, కాంగ్రెస్‌ను కలిపి ఉతికి ఆరేసింది. టీఆర్ఎస్ నేతలు గిరిజనుల భూములు ఆక్రమిస్తే… కాంగ్రెస్ చూస్తూ ఉండిపోయిందని… పట్టించుకోలేదని బీజేపీ విమర్శలు గుప్పించింది. “లేదు లేదు.. మేం కూడా టీఆర్ఎస్ నేతల ఆక్రమణలపై ఎప్పుడో మాట్లాడాం” అని… స్వయంగా ఆపద్ధర్మ పీసీసీ అధ్యక్షుడు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాల్సి వచ్చింది. మేం కూడా అనడంలోనే విషయం అర్థమవుతోంది… బీజేపీ కంటే వాళ్లు వెనుకబడి ఉన్నారని. మేం వెనుకబడి లేమని చెప్పుకోవడం వేరు… మేమే ముందున్నాం అని నిరూపించుకోవడం వేరు.
Ads
ఇక… బీజేపీ బలోపేతంతో.. అనూహ్యమైన పరిణామంతో… టీఆర్ఎస్ అంతర్మథనంలో పడింది. ఏం చేసినా పెద్దగా గొంతెత్తని భోళా “పెద్దలు” కలిగిన కాంగ్రెస్ పార్టీని… ఇంకా బలహీన పర్చాలని టీఆర్ఎస్ భావించింది. మహా ఘోరం కదా…! తన ఎదురుగా.. కాస్తో కూస్తో బలంగా నిలిచిన.. ఎప్పటికైనా బలపడే శక్తి, శ్రేణులు కలిగిన కాంగ్రెస్‌ను అసలే లేకుండా చేయాలని.. ఆకర్షణ మంత్రంతో కొంత దెబ్బతీసింది. కొందరు ముఖ్యనేతల్ని లాక్కుని… పదవులు కట్టబెట్టింది. “హా… బీజేపీదేముంది… ఆ పార్టీ ఎక్కడుంది..?” అని బీరాలు పలికింది. కానీ… బీజేపీ క్రమంగా.. అనూహ్యంగా… కాంగ్రెస్ స్థానాన్ని దాదాపు ఆక్రమించిందనే చెప్పొచ్చు. దాదాపేంటి… చాలావరకే అక్రమించిందనీ చెప్పొచ్చు. కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో ప్రస్తుతం అంతగా బలం లేదు. కానీ… కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీని కోరికోరి రాష్ట్రంలో కొరివిలా మార్చుకుంది..
టీఆర్ఎస్ కాంగ్రెస్‌ను దెబ్బతీసినందుకు ఒక రకంగా పశ్చాత్తాప పడుతోంది కావొచ్చు… టీఆర్ఎస్ నాయకత్వం. ఎందుకంటే…. కాంగ్రెస్ కనీసం ప్రతిపక్షంగా ఉంటే… కాంగ్రెస్ గత వైఫల్యాల్ని చూపించి… ప్రజల్లో తమ ప్రాభవం చాటుకునే అవకాశం ఉండేది. కానీ… కాంగ్రెస్‌నే లేకుండా చేయాలని చూసింది… టీఆర్ఎస్ నాయకత్వం. ఇప్పుడు…. బీజేపీ “ఒక్క ఛాన్స్” అంటోంది. అవకాశం ఇస్తే… ప్రజాస్వామిక తెలంగాణ నిర్మించి చూపుతామని చెబుతోంది. ఇందుకు టీఆర్ఎస్ నాయకత్వం ఏకపక్ష ధోరణిని ప్రజల్లో ఎండగడుతోంది. జనం కూడా… కరెక్టే కదా అని… కనెక్ట్ అవుతున్నారు. వరుస విజయాలే ఇందుకు నిదర్శనం.
ఇప్పుడు… నాగార్జున సాగర్ ఉపఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక, వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు టీఆర్ఎస్కు పెను సవాలుగా మారాయి. దుబ్బాకకు కనీసం కేటీఆర్, కవిత వెళ్లి ప్రచారం చేయలేదు. కానీ… ఇప్పుడు నాగార్జున సాగర్ ఉపఎన్నికను పురస్కరించుకుని… ఏకంగా కేసీఆర్ సభ పెట్టాల్సి వచ్చింది. అంతేకాదు.. పట్టభద్రుల్లో తీవ్ర అసంతృప్తిని టీఆర్ఎస్ గుర్తించింది. ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి హామీలు గుప్పించడమే ఇందుకు నిదర్శనం. ఇప్పుడైనా నిజంగానే గుర్తించిందో… ఇది కూడా ఏదైనా ఉత్త హామీనో తెలియదు. అయినా… ఈ పనులేవో మొదటిసారి గెలిచినప్పుడే విస్తృత పర్చినా.. రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసేందుకు ప్రయత్నించినా… కాస్త ఫలితం ఉండేదేమో. నిరుద్యోగులేమీ… తామందరికీ ఉద్యోగాలు ఇవ్వమని అడగడం లేదు. “ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టండి… మా ప్రయత్నమేదో మేం చేసుకుంటాం” అంటున్నారు. తప్పేముంది…? “అడిగినవే కాదు… అడగనివీ.. చెప్పనివీ చేస్తున్నాం” అనే టీఆర్ఎస్… ఈ ముచ్చట ఎందుకు మర్చిందో మరి…!
గతమెప్పుడూ మనకు కొన్ని హెచ్చరికలు చేసే ఉంటుంది. వాటిని గుర్తించపోవడం వల్లే పాత తప్పులు మళ్లీ చేస్తుంటాం. ఒకసారి వెనక్కి వెళ్లి చూద్దాం…. 2018 డిసెంబర్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో.. టీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రధానంగా రైతులకు పెట్టబడి సాయం, ఆసరా ఫించన్లు లాభించాయి. మధ్యతరగతి ప్రజలు, పాత అభిమానుల ఆదరణ కొనసాగింది. కాంగ్రెస్, టీడీపీ పొత్తు… టీఆర్ఎస్కు కలిసొచ్చింది. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో.. టీఆర్ఎస్కు మరో అకాశం ఇవ్వడం తప్ప… గత్యంతరం లేని పరిస్థితుల్లో… కేసీఆరే బెటర్ ఆప్షన్ అని నమ్మి…. జనం రెండోసారి అధికారం కట్టబెట్టారు.
కానీ… 2019లో ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలు ఝలక్ ఇచ్చారు. అనంతరం… 2019 మే లో జరిగిన…. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. ఆ ఎన్నికలో కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. కనీసం అప్పుడైనా టీఆర్ఎస్ మేల్కోవాల్సింది. పట్టభద్రులు ఎందుకు అసంతృప్తితో ఉన్నారో ఆలోచించాల్సింది. ఆ నాలుగు జిల్లాల్లోని విద్యావంతులైన యువత… ఎప్పుడూ టీఆర్ఎస్కు వెన్నంటి ఉన్నవాళ్లే. అలాంటి వాళ్లు… ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారో అంతర్మథనం చేసుకోవాల్సింది. కానీ మేల్కోలేదు.. ఆలోచించలేదు… అంతర్మథనం చేసుకోలేదు. పాత పంథానే అనుసరించింది. “ఉద్యోగాల్లేవు… ఎక్కడున్నాయి… ఇవ్వలేం” అంటూ… స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సాక్షిగా తేల్చి చెప్పారు. అంతేకాదు…. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు ఓటర్లు. అందులో టీఆర్ఎస్ వాళ్లే ఎక్కువ ఉన్నారు. సహజంగానే అక్కడ టీఆర్ఎస్ ఎవరిని నిలబెట్టినా గెలుస్తారు. ఆ ఎన్నికల్లో కవిత గెలుపు కూడా గొప్ప విజయమని టీఆర్ఎస్ సంబరాలు చేసుకుంది.
అయితే… రెండోసారి అధికారంలోకి రాగానే… ప్రజలకు చేయాల్సిన పనులు మానుకుని.. టీఆర్ఎస్ ఆకర్షణ మంత్రంతో కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. ఇప్పుడు బీజేపీ ఏకు మేకై కూర్చుంది. ఇప్పుడు.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నిక జరగబోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడింది. ఆలస్యంగా మేల్కొని… హామీలు గుప్పిస్తోంది. తమ భుజాల మీదుగా టీఆర్ఎస్ను అందలం ఎక్కించిన విద్యావంతులు… ఆ భుజాలపై నుంచి దింపుకుని… చేతులు దులుపుకోవడం పెద్ద పనా…? కానే కాదు. ఎన్నికలు వచ్చినప్పుడు మేల్కోవడం కాకుండా.. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సక్రమంగా వాడుకుంటూ హామీలు నెరవేర్చి ఉంటే… టీఆర్ఎస్ ఇప్పుడు ఉరుగులు పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండేది కాదేమో….!
ఓ వైపు… ప్రజలు నేర్పుతున్న పాఠాలు నేర్వకపోగా… ప్రజల మద్దతు ఉందని గొప్పలు చెప్పుకోవడం… టీఆర్ఎస్కు మైనస్ అయింది. “ఏదో మీరే కాస్త బెటర్ అని ఓటేస్తే… అంత బిల్డప్ ఎందుకు…? మీరు లేకపోతే మాకు ఆల్టర్నేట్ లేరనుకుంటున్నారా…?” అని ప్రజలు ఆలోచనలో పడ్డారు. “సరే… సారు మంచోడే కానీ… మన కష్టాలు చెప్పేటోళ్లు లేకుంట అయిన్రు. అంతా భజన బ్యాచ్ మోపయింది. సారుకు చిన్న సురుకు వెడుదాం” అని జనం అనుకునుడు షురువైంది. “సురుకులు సాలు… మీ బాధ అర్థమైంది” అంటడో… లేదంటే… కథ ఏడి దాక తీస్కవోతడో…. ! అంతా సారు చేతిలోనే ఉంది. ప్రతిపక్షాల చేతిలో ఏమీ లేదు. మించిపోయిందేమీ లేదు.. సారు మేలుకుంటే….. కోలుకుంటడు…. ఎళ్లకాలం ఏలుకుంటడు… లేదంటే మూలకుంటడు. ఏం చేద్దామంటవ్ మరి…!
Share this Article