ఆనందమా! నువ్వెక్కడ?
ప్రపంచంలో ఉన్న 195 దేశాల్లో 143 దేశాల 2023 సంవత్సరపు సంతోష సూచీని ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి(సస్టెయినబుల్ డెవెలప్మెంట్ సొల్యూషన్స్ నెట్ వర్క్) విభాగం లెక్కకట్టి…ఈ ఏడు(2024) అంతర్జాతీయ ఆనంద దినోత్సవం-మార్చి 20 సందర్భంగా విడుదల చేసింది.
ఇందులో భారత దేశం 126 వ స్థానంలో ఉంది. అంటే మనకంటే కేవలం 125 దేశాలు మాత్రమే హాయిగా, ఆనందంగా ఉన్నాయని మనం ఆనందించవచ్చు! మన కింద 17 దేశాలు ఎప్పటికి ఆనందిస్తాయో అని మనం నైతికంగా బాధపడవచ్చు!
Ads
ఫిన్లాండ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, నార్వే, ఆస్ట్రేలియా. స్వీడెన్ లాంటి దేశాలు ప్రతి ఏటా ప్రపంచ ఆనంద పద్దులో ముద్దుగా ముందు వరుసలోనే ఎలా ఉంటాయని ఆలోచించే తీరిక, ఓపిక భారతీయులుగా మనకు ఉండవు. ఐ ఐ టి ఎండమావుల వెంట అక్షరాభ్యాసం నాడే పరుగులు తీసే భారతీయ తల్లిదండ్రుల ఆనందాన్ని కొలిచే పరికరాలు, సూచీలు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు. అన్నప్రాసన నాడే అమెరికా గ్రీన్ కార్డ్ రంగుల కలలు కనే భారతీయ సగటు కుటుంబం ఆనందాన్ని బేరీజు వేసే త్రాసులు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు.
సినిమా హీరో కోసం బ్లేడ్లతో కోసుకుని తొలిరోజు స్పెషల్ షోకు నాలుగు రెట్లు టికెట్ రేటు ఎక్కువ పెట్టి రక్తం ధార పోయడంలో ఉన్న సైకో ఫ్యాన్స్ ఉన్మత్త అమితానందాన్ని లెక్కకట్టే ప్రమాణాలు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు. కల్చర్ లెస్ పీపుల్ అని ఎదుటివారిని తిడుతూ అదే నోటితో నడి రోడ్డు మీద కేకరించి ఉమ్మేసే మన ఆనందాన్ని నిర్వచించే సూత్రాలు ఐక్యరాజ్యసమితి దగ్గర ఉండి ఉండకపోవచ్చు. బ్లడీ పీపుల్ కామన్ సెన్స్ ఉండదు అని తిడుతూ ఇంటి ముందు రోడ్డును సొంత ఆస్తిగా షామియానాలు వేసి శుభాశుభ కార్యాలు చేయడంలో, రోడ్డును అడ్డగిస్తూ పార్కింగులు చేయడంలో, రాంగ్ రూట్లో వెళుతూ ఎదుటివారిని తిట్టడంలో ఉన్న భారతీయుల ఆనందాన్ని ఐక్యరాజ్యసమితి పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు.
లేకపోతేనా!
భారతదేశం దరి దాపుల్లోకి రాగల దేశం ఈ భూమండలంలో ఒక్కటైనా ఉంటుందా? 143 స్థానాల్లో మనమే మొదటి వంద స్థానాలు నారాయణ, చైతన్య ర్యాంకుల్లా ఏటేటా ఆక్రమించి…మిగతా 43 స్థానాలను మాత్రమే ప్రపంచానికి ముష్టి వేసేవాళ్ళం!
కొసమెరుపు:-
దేశాల ఆనందాన్ని తక్కెడలో పెట్టి కొలిచి…మిల్లీగ్రాములతో పాటు లెక్కలు తేల్చడానికి ఐక్యరాజ్యసమితి దగ్గర సున్నితపు త్రాసులేమీ ఉండవు. స్థూలంగా వాళ్ల లెక్కలేవో వాళ్లకుంటాయి. భారత్, చైనా లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఎన్ని మౌలిక వసతులు పెరిగినా, ఎంతగా సాంకేతికత అంది వచ్చినా, ప్రభుత్వాలు ఎంత చేసినా…పూటగడవనివారు కోట్లలో ఉంటారు. నిలువ నీడలేనివారు కోట్లలో ఉంటారు. రోగమొస్తే ఆసుపత్రికి మైళ్లు నడవల్సినవారు కోకొల్లలుగా ఉంటారు.
రెండు, మూడు తరాల కిందటితో పోల్చుకుంటే భారత్ ఇప్పటి ప్రాభవం చిన్నదేమీ కాదు. ఎంత చెట్టుకంత గాలి. ఎవరి ఆనందం వారిది. మన దేశంలో ఒక జిల్లా అంత కూడా లేని ఇంకేదో దేశపు ఆనందంతో పోల్చి చూసుకోవడం వల్ల మనకు మిగిలేది నిరాశ, నిస్పృహలే.
భారత్ ఆత్మనిర్భర్ దాటి…2047 నాటికి సంపూర్ణ వికసిత్ భారత్ అంటున్నారు కదా! తథాస్తు. -పమిడికాల్వ మధుసూదన్ 9989090018
Share this Article