పోలింగ్ లోపు పెళ్లిళ్లో, ఇతర శుభకార్యాలో ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం… ఏం..? ముహూర్తాలు బాగా లేవా..? అవును, ఓ భీకరమైన దుర్ముహూర్తం… పోలింగ్ వరకూ ఉంటుంది… పోలీసుల రూపంలో అన్నీ విఘ్నాలు, అవాంతరాలు తప్పవు… అదేమంటే ఎన్నికల నియమావళి, నిబంధనలు అంటారు… తరువాత ఎవరేం మొత్తుకున్నా ప్రయోజనం ఉండదు…
పలుసార్లు చెప్పుకున్నాం కదా… ఇంత సీజ్ చేశాం, అంత ఉద్దరించాం అని పోలీసులు చేసే ప్రకటనలు, గొప్పలు మాట్లాడుకున్నాం కదా… ఎన్ని వందల కోట్లు సీజ్ చేశారో గానీ అందులో ఒక్క రూపాయి కూడా ‘ఎన్నికల ప్రలోభాలకు’ లింక్ ఉండదు… మన సమాజం ఖర్మకాలి, జనం మీద పడి, విచక్షణరహితంగా వేధించడమే… నిన్న టీవీ సెలబ్రిటీ హిమజ ఇంటిపై దాడి చేసి, కేసులు పెట్టడం కూడా అలాంటివాటిల్లో ఒకటి… అందుకనే పోలింగ్ వరకూ కాలం స్థంభించిపోవాల్సిందే… కరోనా లాక్ డౌన్ తరహాలో…
హిమజ విషయానికొస్తే… ఆమె కొత్తగా కట్టుకున్న ఫామ్ హౌజులో రేవ్ పార్టీ జరుగుతోందని సమాచారం వచ్చిందట… తీరా పోలీసులు వెళ్లాక చూస్తే 18 మద్యం సీసాలు, డీజే సౌండ్ బాక్సులు కనిపించాయట… ఇంకేం… కేసులు పెట్టి, వాటిని సీజ్ చేసేశారట… హిమజను అరెస్టు చేసినట్టు కూడా ప్రాథమిక వార్తలు… అంతేకాదు, మరికొందరు సినిమా సెలబ్రిటీలు కూడా ఉన్నట్టు రాసేశారు కొందరు… అబ్బే, అదేమీ లేదని హిమజ ఓ క్లారిటీ వీడియో విడుదల చేసుకోవాల్సి వచ్చింది…
Ads
హిమజ ఎలా బతుకుతుంది, ఆమె వృత్తి ఏమిటనేది కాసేపు పక్కన పెడదాం… పండుగ సందర్భంగా ఆమె తన మిత్రులతో పార్టీ చేసుకుంటే అందులో తప్పేముంది..? దానికీ ఎన్నికల నియమావళికీ లింక్ ఏమిటి..? పలువురు ఒక్కచోట కూడి, పదో ఇరవయ్యో మందు బాటిళ్లు ముందేసుకుంటే అది క్షమించరాని నేరమా..? కేసులా..? అరెస్టులా..? మరి మద్యం దుకాణాల్నే మూసేయొచ్చుగా… అది చేతకాదు… ఆ ఆదాయం లేకపోతే గవర్నమెంటు నడవదు, వీళ్లకు జీతాలు కూడా రావు…
అసలు రేవ్ పార్టీ అనగానే… ఫుల్లుగా డ్రగ్స్ తీసుకుని, వావీవరుసా విచక్షణ లేకుండా ఒకరినొకరు ‘కామంతో హత్తుకుపోయే’ పార్టీగా ముద్రలు దేనికి..? పోనీ, అక్కడేమైనా డ్రగ్స్ దొరికాయా..? కనీసం గంజాయి దొరికిందా..? అందరూ తాగే మద్యమే కదా… పోనీ, అక్కడేమైనా ఎన్నికల ప్రలోభాల మందు పార్టీ నడుస్తోందా..? అదీ లేదు… పోనీ, బహిరంగ స్థలమా..? అదీ కాదు… ఆమె ప్రైవేటు ఆస్తి… క్లోజ్‌డ్ ఎరీనా… జనానికి ఇబ్బంది కలిగిందా..? లేదు… అది సిటీ మధ్యలోనూ లేదు… మరి న్యూసెన్స్ కేసు ఎలాగైంది..? నాన్సెన్స్ కేసు ఎలాగైంది..?
ఎన్నికల వేళ కదా… ప్రభుత్వం ఉండీ లేనట్టే… మరి ఈ పోలీస్ ఓవరాక్షన్‌కు చెక్ ఏమిటి..? నిజానికి ఇప్పుడు పాలన ముఖ్య ఎన్నికల అధికారి చేతుల్లో ఉంది దాదాపుగా… తనకేమీ పట్టదు… అందుకే… కరోనా లాక్ డౌన్ తరహాలో మరో 18 రోజులు, డిసెంబరు 3 దాకా… అందరూ అన్నీ మూసుకుని ఇళ్లకు తాళాలు వేసుకొండి… ఏదో సందర్భం, పది మందిమీ పార్టీ చేసుకుంటాం అంటే కుదరదు, వాచిపోతుంది… తరువాత మీ ఇష్టం..!
అర్సుకునేవాడు, ఆర్చేవాడు, తీర్చేవాడు, ఆదుకునేవాడు ఎవరూ ఉండరు… పోలీసులొచ్చి మీద పడతారు…!! మరి మీడియా ఎందుకు జనం కోణంలో స్పందించదు..? భలేవారే… జనానికి ప్రయోజనం కలిగించే వార్తల్ని ఏనాడో వదిలేశాం కదా…!! ఏమైనా భజన వార్తలు చెప్పండి, కుమ్మేస్తాం…!! ఇంకా నయం… ప్రజెంట్ మీడియా పుల్లలు పెట్టి, పెట్రోల్ పోయకుండా ఉంటే చాలు…
Share this Article