Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఏది తప్పు? ఏది ఒప్పు? కొత్త ‘హైడ్రా’లజీలో భయసందేహాలే అధికం..!!

September 12, 2024 by M S R

 

చట్టం- న్యాయం- ధర్మం ఒకటి కావు. వేరు వేరు అంశాలు. అకడమిక్ గా వీటిమీద యుగయుగాలపాటు చర్చోపచర్చలు చేసుకోవచ్చు. ప్రాక్టికల్ గా అయితే సంఘాన్ని సక్రమమార్గంలో నడిపడానికే ఈ మూడు. నాగరికత ప్రయాణించేకొద్దీ, వికసించేకొద్దీ చట్టాలను గౌరవించడం, న్యాయంగా జీవించడం, ధర్మమార్గంలో నడవడం ఒక ఆదర్శమవుతుంది. అభ్యుదయమవుతుంది. సంస్కారమవుతుంది. స్వభావమవుతుంది. ఆచారమవుతుంది. చివరికి ఒక విలువగా పాటించితీరాల్సిన కొలమానమవుతుంది.

బాధ్యతగా అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే రోడ్లమీద పోలీసులు, నిఘా కెమెరాల అవసరమే ఉండదు. తొంభై శాతం మంది బాధ్యతగా అన్ని నియమాలను పాటిస్తున్నా…మిగతా పది శాతం పాటించనివారితోనే వస్తుంది లోకానికి ఉపద్రవం.

Ads

డొంకతిరుగుడు మాని…నేరుగా విషయంలోకి వెళదాం. “నీరు పల్లమెరుగు- నిజం దేవుడెరుగు” అన్నది పాత సామెత. పల్లానికి నీరు వెళ్లకుండా నిజం దేవుడిక్కూడా తెలియకుండా హైదరాబాద్ లో చెరువులను, సహజ ప్రవాహపు కాలువలను, మురికి కాలువలను చెరబట్టారు. ఆకాశహర్మ్యాలు కట్టారు. విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు కట్టారు. సుసంపన్న నయనాందకర సుందర జలదృశ్య శోభిత ఫార్మ్ హౌస్ లు కట్టారు. గెస్ట్ హౌస్ లు కట్టి వీకెండ్ విధిగా చేసుకోవాల్సిన గానాబజానా మందు విందులకు అద్దెలకిచ్చారు.

చివరికి హైదరాబాద్ లో బఫర్ జోన్లలో, ఫుల్ ట్యాంక్ లెవెల్లో మనకొక విల్లా లేకపోతే మనం బతికి వేస్ట్ అన్నట్లు నవీన జీవన ప్రమాణాన్ని స్థిరపరిచారు. ఏదైనా అతి చేస్తే గతి చెడాల్సిందే. చివరికి “హైడ్రా” పుట్టింది. హైడ్రాకు చట్టబద్ధత ఎంత? పట్టణ ప్రణాళికా విభాగం ఉండగా మళ్లీ హైడ్రా ఎందుకు? లాంటి ప్రశ్నలను కాసేపు పక్కన పెడదాం.

క్షుద్రశక్తుల తాంత్రిక విద్యల్లో ఒక భూతాన్ని ఆవాహన చేశాక అది శత్రువును మింగవచ్చు. ఒక్కోసారి దారి తప్పి ఆహ్వానించినవాడినే మింగేయవచ్చు. అలా హైడ్రా మింగుడు చివరికి ఎలా పరిణమిస్తుందో ప్రస్తుతానికి ఎవరికీ మింగుడుపడడం లేదు. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న హైదరాబాద్ రియలెస్టేట్ మార్కెట్ కు హైడ్రా పెద్ద కుదుపు.

హైడ్రా దెబ్బకు లేక్ వ్యూ విల్లా జలదృశ్యాలు ఇప్పుడు నిర్జల నీరవ దృశ్యాలయ్యాయి. అపార్ట్ మెంట్ వందో అంతస్థు బాల్కనీలో కూర్చుని చూడాల్సిన చెరువు దృశ్యం గుండె చెరువయ్యింది. అలల చల్లగాలులు కిటికీలోనుండి పలకరించాల్సిన లేక్ సైడ్ లు సైడ్ కు వెళ్లిపోయాయి. చెరువు పక్కన విల్లాలు చెప్పుకోలేక ఏడుస్తున్నాయి. చెరువులో విల్లాలు ఏడ్చి ఏడ్చి ఆ చెరువు నీళ్లతోనే మొహం కడుక్కుంటున్నాయి.

నిన్నటివరకు లేక్ వ్యూ, లేక్ సైడ్, లేక్ ఫ్రంట్, లేక్ బ్యాక్, లేక్ బ్రీజ్, లేక్ స్ట్రీట్, లేక్ వాక్ హాట్ కేకులు. ఇప్పుడు లేక్ అంటే నిలువెల్లా వణుకు. భయం. అలజడి. ఆందోళన. లేక్ సైడ్ ఉన్నవారికి హైడ్రా బాహుబలి కూల్చివేత డ్రిల్లర్ పగలే కలలోకి వస్తోంది.

పెద్దల, గద్దల, రాబందుల అక్రమ సౌధాలను కూల్చినంతవరకు హైడ్రాకు పూలవర్షం కురిసింది. సామాన్యుల రేకుల షెడ్లు కూల్చి…హైడ్రా కొరివితో తలగోక్కుంది. ఇప్పుడు విమర్శల రాళ్ల వర్షం మెదలయ్యింది. నిరుపేదల మీద హైడ్రా ప్రతాపం కొంపముంచే ప్రమాదముందని గ్రహించిన ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా నివాసముంటున్న ఇళ్ళజోలికి రామని, విద్యా సంవత్సరం మధ్యలో రాబోమని హైడ్రా చేత “అశ్వత్థామ హతః కుంజరః” అని చెప్పించారు.

హైడ్రా భవిష్యత్ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో పెరుమాళ్ళకెరుక. ప్రస్తుత కూల్చివేతలవరకు కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే ఉండిపోతున్నాయి. సదుద్దేశంతోనో, దురుద్దేశంతోనో, తెలిసో, తెలియకో, డబ్బుకు కక్కుర్తి పడో ఒక బిల్డర్ చెరువును చెరబట్టి ఒక లే అవుటో, విల్లా ప్రాజెక్టో, అపార్ట్ మెంటో కట్టాడు. దానికి హెచ్ ఎం డి ఏ లే అవుట్ అనుమతి ఉంది. ఎం సి హెచ్ టౌన్ ప్లానింగ్ అనుమతి ఉంది. బ్యాంక్ లోన్లు ఇచ్చారు. జనం కొన్నారు. నిర్మాణం మొదలయినవి కొన్ని. దాదాపు అయిపోయి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉన్నవి కొన్ని. ఇప్పుడు అవి కొత్తగా పుట్టిన హైడ్రా కంటికి అక్రమ నిర్మాణాలు. తక్షణం లేదా కోర్టులు లేని వారాంతపు శని, ఆదివారపు సూర్యోదయ ముహూర్తాల్లో అవి కూల్చదగ్గవి అయ్యాయి.

మునిసిపాలిటీ అనుమతి ఉండి, బ్యాంక్ లోను ఇస్తే సామాన్యుల దృష్టిలో అది వివాదం లేని ఆస్తి. అలాంటి ఆస్తులన్నీ ఇప్పుడు నీటిమీద రాతలైతే…అప్పు తీసుకున్నవారు తిరిగి కట్టకపోతే…బ్యాంక్ ఏ ఆస్తిని జప్తు చేయాలి? బ్యాంక్ లాకర్లో ఉన్న ఆస్తి పత్రం నాలుక గీచుకోవడానికి కూడా పనికిరాదు. కుదువ పెట్టుకున్న నిర్మాణాన్ని హైడ్రా కూల్చేసింది కాబట్టి…మిగిలిన బూడిదను కుండలో వేసి పైన బట్ట కట్టి…బ్యాంక్ సొంత ఖర్చులతో కాశీకి తీసుకెళ్లి గంగలో కలవాల్సిందే.

ప్రకృతి ధర్మంగా, నైతికంగా ఆలోచిస్తే హైడ్రా చేసింది తప్పు కాకపోవచ్చు. కావాలనుకుంటే చట్టాలను సవరిస్తారు కాబట్టి చట్టప్రకారం కూడా తప్పు కాకపోవచ్చు. సవరించిన చట్టాల ప్రకారం న్యాయపరంగా కూడా తప్పు కాకపోవచ్చు. కానీ…అక్రమమైనా ఇప్పటికే నివాసం ఉన్న ఆస్తులు ఉండదగ్గవి అయి…నివాసం లేనివి మాత్రమే కూల్చదగ్గవి కావడంలో ఏదో తడబాటు కనిపిస్తోంది. బఫర్ జోన్లో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇంటి బాల్కనీలో నివాసముంటున్నవారు టీ తాగుతూ హైడ్రా కూల్చే ఇళ్ల గురించి నైతికంగా విచారించే విచిత్రమైన పరిస్థితి!

“దేవుడే ఇచ్చాడు కాలువొకటి!
ఇక ఊరేల? సొంత ఇల్లేల? ఓ హైడ్రా!
ఏల ఈ కాలువ? ఏది మూసీ కాలువ?

నిన్నడిగి బ్యాంక్ లోన్లు ఇచ్చారా?
మా ఇళ్లు నిన్నడిగి కట్టారా?
పాపం పుణ్యం నాది కాదే పోవే హైడ్రమ్మా!
నీరు పోతే ఇళ్లు తేలే సౌఖ్యం ఉందమ్మా!
ఏది మూసి? ఏది తెరిచి?
ఈ బఫర్లు ఉత్త వాదాలే ఓ హైడ్రా!
ఏల కూల్చుడు? ఏది నాన్చుడు?”

అని అంతులేని కథలో పాటకు పేరడీగా అంతులేని తీరాల్లో బఫర్ పాటలు ఫుల్ ట్యాంక్ లెవెల్లో పాడుకోవాలేమో! ఏమో!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!
  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సిపీలీహై’… మందు కొట్టించేశాడు…
  • బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట…
  • సంపద, సర్కిల్, పేరు, చదువు… ఆ ఒక్క దుర్బల క్షణంలో పనిచేయవు..!!
  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…
  • వంశీ, శ్రీలక్ష్మి, ఆంజనేయులు… వాళ్ల అనుభవాలు చెప్పే పాఠమేంటనగా…
  • రవితేజ సినిమా అయితేనేం… సూపర్ ఫ్లాప్, చివరకు టీవీల్లో కూడా…
  • రియల్ కల్‌ప్రిట్ పాకిస్థాన్ కాదు… దాని వెనుక అమెరికా ట్రంపు…
  • ఆ మంత్రి చిల్లర వ్యాఖ్యలపై పార్టీ మౌనం ఏం సంకేతాలు ఇస్తున్నట్టు..!?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions