Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఉక్రెయిన్ సంక్షోభం వెనుక అసలు శక్తి ఎవరో, కారణాలు ఏమిటో తెలుసా..?

March 9, 2022 by M S R

ఉక్రెయిన్ సంక్షోభం ఎవరి తప్పు..? రష్యాదేనా..? నాటో తొత్తుగా మారిన ఉక్రెయిన్ అధ్యక్షుడిదా..? లేక అమెరికా, నాటో దేశాలదా..? అసలు తెరవెనుక శక్తులేవి..? ఉక్రెయిన్ ఎందుకు పావుగా మారింది..? ఆ దేశం మళ్లీ ఇప్పట్లో కోలుకుంటుందా..? ఇవన్నీ వదిలేసి, మీడియా చిల్లర చర్చలు పెడుతోంది… మార్క్సిస్ట్ ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు ప్రభాత్ పట్నాయక్ రాసిన ఓ వ్యాసం ఆలోచనాత్మకంగా ఉంది… ఐఎంఎఫ్ ఆడుతున్న అసలు ఆట ఏమిటో చెబుతున్నాడు… మన దృష్టికోణాన్ని ఇంకాస్త లోతుల్లోకి మరలుస్తున్నాడు… అలాగని పుతిన్‌ను ఏమీ వెనకేసుకురావడం లేదు… (ప్రజాశక్తిలో తెలుగులోకి అనువదించారు…) అందులో కొన్ని ముఖ్యాంశాలు తీసుకుందాం…

ఉక్రెయిన్‌ నాటో కూటమిలో చేరితే తమ దేశానికి భద్రతా సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనతో రష్యా ఉన్న సంగతి మీడియాలో బాగానే చర్చకు వచ్చింది. ఐతే దానితోబాటు సమాంతరంగా సాగుతున్న మరో పరిణామం ఐఎంఎఫ్‌ తో ఉక్రెయిన్‌ పెట్టుకున్న లింకు. దీనిగురించి మీడియా ఏ మాత్రమూ పట్టించుకోలేదు.

ఏ దేశంలోకి సంపన్న పశ్చిమ దేశాల పెట్టుబడి చొరబడాలనుకుంటుందో ఆ దేశాన్ని ”పెట్టుబడులకు అనుకూలంగా మార్చడం” ఐఎంఎఫ్‌ పని. ఆ దేశానికి చెందిన సహజ వనరులను ఆ దేశాలు చేజిక్కించుకోవడం ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. దానికి దోహదం చేసే ”షరతులను” ఐఎంఎఫ్‌ విధించి అమలు జరిగేట్టు చూస్తుంది. అందుకోసం ఆయా దేశాలకు ముందుగా రుణాలిస్తుంది. ఆ రుణాలతోబాటు షరతులు అమలౌతాయి. ఇది సాధారణంగా ఐఎంఎఫ్‌ అనుసరించే వ్యూహం. దీనితోబాటు ఐఎంఎఫ్‌ ఒక్కోసారి ప్రత్యేకమైన పాత్రను కూడా పోషిస్తుంది. అమెరికా ప్రచ్ఛన్న యుద్ధపు లక్ష్యాలను సాధించడానికి ఐఎంఎఫ్‌ తోడ్పడుతుంది.

Ads

2014కు ముందు ఉక్రెయిన్‌ అధ్యక్షుడుగా విక్టర్‌ యనుకోవిచ్‌ ఉన్నాడు. అప్పటి నుండి యూరోపియన్‌ యూనియన్‌ తో ఉక్రెయిన్‌ వాణిజ్యపరంగా కలిసిపోడానికి ఐఎంఎఫ్‌ తో చర్చలు జరుగుతూ వచ్చాయి. వేతనాలను తగ్గించడం మొదలు వైద్యం, విద్య కోసం ఉక్రెయిన్‌ ప్రభుత్వం చేసే ఖర్చును కూడా బాగా తగ్గించుకోవాలని, ప్రజలకిచ్చే గ్యాస్‌ సబ్సిడీని సగానికి సగం తగ్గించాలని ఐఎంఎఫ్‌ ఫరతులు పెట్ఠింది. దీంతో యనుకోవిచ్‌ ఐఎంఎఫ్‌ తో చర్చలు నిలిపివేసి, దానికి బదులు రష్యాతో చర్చలు ప్రారంభించాడు.

ఇది క్షమించరాని నేరం అయిపోయింది సామ్రాజ్యవాదుల దృష్టిలో. ఐఎంఎఫ్‌ తో చర్చలు తెగ్గొట్టుకోవడం అంటే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి పెత్తనానికి లొంగడానికి నిరాకరించడమే కాక, పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల ఆధిపత్యాన్ని కూడా ధిక్కరించడమే ఔతుంది. ముఖ్యంగా నాటో, అమెరికాలను సవాలు చేయడం ఔతుంది. నాటో, అమెరికా వేరు, ఐఎంఎఫ్‌ వేరు అని భావిస్తే పొరపాటు. ఇవన్నీ ఒకే లక్ష్యం కోసం పని చేస్తాయి. యనుకోవిచ్‌ వైఖరికి కినుక చెందిన అమెరికా మరింత ” నష్టం” జరగకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్‌లో ఉన్న నియో నాజీలను రంగంలోకి దింపి యునుకోవిచ్‌ ను కుట్ర ద్వారా కూలదోసింది. ఈ కుట్రలో పాలు పంచుకున్నవారంతా ప్రస్తుతం ఉక్రెయిన్‌ సైన్యంలో భాగంగా మారిపోయారు.

కుట్ర అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం తిరిగి ఐఎంఎఫ్‌ తో చర్చలు ప్రారంభించింది. యూరోపియన్‌ యూనియన్‌ తో కలిసి వాణిజ్య భాగస్వామ్యం పొందడానికి ఐఎంఎఫ్‌ ఉక్రెయిన్‌ కు 2,700 కోట్ల డాలర్ల రుణాన్ని ఇచ్చింది. అందుకోసం ఉక్రెయిన్‌ ప్రభుత్వం తన ప్రజలకిచ్చే గ్యాస్‌ సబ్సిడీలో సగానికి కోత పెట్టింది. సాధారణంగా ఈ స్థాయి దేశాలకి ఐఎంఎఫ్‌ ఇచ్చే రుణానికి 6 రెట్లు ఉక్రెయిన్‌ కు ఇచ్చింది. అది కూడా ఒక అంతర్యుద్ధంలో మునిగివున్న దేశానికి (అప్పుడు) ఇచ్చింది. మామూలుగా అటువంటి అస్థిరత ఉన్న దేశాలకు ఐఎంఎఫ్‌ అప్పు ఇవ్వదు. కానీ, ఉక్రెయిన్‌ కి మాత్రం ఇచ్చింది. ముందు నుంచే ఈ అప్పు తిరిగి చెల్లించేది కాదని ఐఎంఎఫ్‌ కి బాగా తెలుసు. ఐనా ఇచ్చింది. ఎందుకంటే అప్పు కింద ఉక్రెయిన్‌ దేశపు భూభాగాలను సంపన్న పశ్చిమ దేశాలకు కట్టబెట్టవచ్చు.

ఉక్రెయిన్‌ భూముల్లో ఉన్న విలువైన ఖనిజాలను ఆ దేశాలు స్వంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉక్రెయిన్‌ భూముల కింద అపారంగా సహజవాయువు నిక్షేపాలు ఉన్నాయి. యునుకోవిచ్‌ అంగీకరించి వుంటే 2014లోనే ఉక్రెయిన్‌ వనరులు సంపన్న పశ్చిమ దేశాల పరం అయిపోయి వుండేవి. కాని అందుకోసం ఐఎంఎఫ్‌ ఇప్పుడు ఒక అసాధారణమైన మోతాదులో రుణాన్ని ఇవ్వవలసి వస్తోంది. ఉక్రెయిన్‌లో ఉన్న కొద్దిపాటి పాలకవర్గ కుటుంబాలు తమ సంపదనంతటినీ యూరోల్లోకి, డాలర్లలోకి మార్చి ఇతర దేశాలకు తరలించుకుపోడానికి అవసరమైన సహకారాన్ని కూడా ఐఎంఎఫ్‌ అందిస్తోంది.

ఇప్పుడు రష్యా దాడి చేసిన తర్వాత ఉక్రెయిన్‌ ఐఎంఎఫ్‌ను మళ్ళీ సహాయం కోరింది. ఐఎంఎఫ్‌ ప్రస్తుత డైరక్టర్‌ క్రిస్టాలినా జార్జీవా సహాయం అందించాలని ఐఎంఎఫ్‌ బోర్డుకు సిఫార్సు చేశాడు. ఎంత మొత్తం సహాయం అందించబోతున్నారన్నది ఇంకా స్పష్టం కాలేదు కాని ఒక విషయం మాత్రం స్పష్టం. ఈ యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్‌ యూరప్‌ లో మరో గ్రీస్‌ దేశం మాదిరిగా తయారౌతుంది. గ్రీస్‌ కు కూడా గతంలో ఐఎంఎఫ్‌ ఇదే మాదిరిగా స్తోమతకు మించి భారీ రుణాన్ని ఇచ్చింది. ఆ రుణాన్ని తీర్చలేక గ్రీస్‌ శాశ్వత రుణ చట్రంలో ఇరుక్కుపోయింది.

నయా ఉదారవాద శకంలో ఐఎంఎఫ్‌ తానిచ్చే అప్పులకు వ్యవస్థీకృత సర్దుబాటు అనే షరతును ముందుకు తెచ్చింది. ఈ వ్యవస్థీకృత సర్దుబాటు ఆచరణలో ప్రభుత్వ నియంత్రణను, ఆధిక్యతను బలహీనపరుస్తుంది. వాణిజ్యపరంగా కాని, పెట్టుబడుల ప్రవాహాల విషయంలో కాని ఎటువంటి నియంత్రణా లేకుండా పోతుంది. సంపన్న పశ్చిమ దేశాల పెట్టుబడులు స్వేచ్ఛగా రాకపోకలు సాగించగలుగుతాయి. ఆయా దేశాల ప్రభుత్వాలు తమ తమ ఆర్ధిక వ్యవస్థలను నియంత్రించడంలో సహకరించే పాత్ర ఒకప్పుడు పోషించిన ఐఎంఎఫ్‌ ఇప్పుడు ఆ ప్రభుత్వాల నియంత్రణనే ధ్వంసం చేసే సాధనంగా మారిపోయింది.

పుతిన్‌ అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యానికేమీ వ్యతిరేకి కాడు. తన పొరుగు దేశం మీద ఆధిపత్యం చెలాయించరాదనే సోషలిస్టూ కాడు. అతడు కేవలం రష్యా ప్రయోజనాల కోసం మాత్రమే ఉన్నాడు. రష్యాను నాటో నలువైపులా కమ్ముకుని ఇబ్బంది కలుగజేయడానికి ప్రయత్నిస్తోంది కనుక పుతిన్‌ ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నాడు. అందుకే గతంలో యనుకోవిచ్‌కి సహాయం చేయడానికి సిద్ధపడ్డాడు. ఐఎంఎఫ్‌ అమెరికా రాజకీయ ప్రయోజనాలకోసం పని చేయడాన్ని మాత్రమే పుతిన్‌ వ్యతిరేకిస్తున్నాడు తప్ప ఐఎంఎఫ్‌ ద్వారా అమలయ్యే నయా ఉదారవాద విధానాలకు పుతిన్‌ వ్యతిరేకి కాడు. నిజానికి నయా ఉదారవాద విధానాలు తెచ్చిపెట్టే తీవ్ర ఆర్ధిక అసమానతలు, పేదరికం ఇప్పటికే పుతిన్‌ రష్యాలో సాధించేశాడు…!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…
  • విశాఖ గ్యాస్ లీక్‌కు ఐదేళ్లు… ఒక్క జర్నలిస్టయినా ఫాలోఅప్ చేశాడా..?!
  • Dekh Thamaashaa Dekh… ఓ కోర్టు కేసు విచారణపై ఫన్నీ ప్రజెంటేషన్…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions