సాధారణంగా మలయాళ సినిమా రేంజును బట్టి 20, 30 కోట్ల వసూళ్లు ఉంటే సేఫ్… పాస్… 50 దాటితే హిట్… 80 వరకూ వస్తే సూపర్ హిట్… 100 దాటితే బంపర్ హిట్… 150 వస్తే బ్లాక్ బస్టర్… ఈ సంవత్సరం ఇప్పటికే మాలీవుడ్ వసూళ్లలో దూసుకుపోతోంది… మిగతా భాషలతో పోలిస్తే మలయాళ సినిమా సూపర్ హిట్ ఇప్పుడు…
మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, భ్రమయుగం తదితర సినిమాలతో చెలరేగిపోతున్న మాలీవుడ్‌లో మరో సంచలనం ఆవేశం సినిమా… ఈ కథనం రాసే సమయానికి దాని వసూళ్లు 137 కోట్లు… అదీ జస్ట్, మలయాళంలో మాత్రమే… అంత బంపర్ హిట్ సినిమాను ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లోకి డబ్ చేసి అర్జెంటుగా మరింత పంట కోసుకోవాలి కదా… కాదట, ఈ భాషల్లో కూడా నేరుగా ఓటీటీకి వచ్చేస్తోందట…
అదేమిటి..? మూడు భాషలూ కలిపితే మరో 50 కోట్ల దాకా రాకపోవు కదా, పాన్ ఇండియా ట్రెండ్ వదిలి నేరుగా ఓటీటీలోకి వచ్చేయడం దేనికి అంటారా..? ఏమో, బహుశా అమెజాన్ ప్రైమ్‌తో ముందస్తు ఒప్పందం అదేనేమో…! ఇక తప్పదు కదా… ఈ రేంజ్ హిట్ దక్కుతుందని నిర్మాతలు కూడా అనుకుని ఉండరు, అందుకే ప్రైమ్ అడగ్గానే ఒప్పందాలపై సంతకాలు గీకేసి ఉంటారు… తీరా చూస్తే ఇదేమో బ్లాక్ బస్టర్ అయి కూర్చుంది…
Ads
సినిమాలో ఫహాద్ ఫాజిల్ ఒక్కడే మనకు తెలుసు… మలయాళం సినిమాల్ని కూడా ఓటీటీలో చూసే ప్రేక్షకులకు చాన్నాళ్లుగా తెలుసు అతను… కానీ పుష్ప సినిమాలో కాసేపు విలనీ చేసి, సెకండ్ పార్ట్‌లో ఇక చూడండి నా తడాఖా అన్నాడు కదా ఈయన… అలా చాలామందికి తెలిసిపోయాడు… (ఈయన భార్య నజిరియా, తెలుగులో ఒకటీరెండు సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసినట్టుంది…)
సినిమాలో ఫహాద్ తప్ప వేరే మొహాలు పెద్దగా తెలియకపోయినా సరే, ఇతర భాషల్లోకి గనుక డబ్ చేసి రిలీజ్ చేస్తే బాగానే ఉండేది… కానీ ఓటీటీయే అంటున్నాయి మాలీవుడ్ వర్గాలు… (బహుశా 9 నుంచి స్ట్రీమింగ్ ఉండవచ్చునట)… అవునూ, ఇంతకీ ఏముంది ఈ సినిమాలో… అంత ఆవేశపడి మలయాళ ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు..?
సింపుల్ కథే… ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు… సహజంగానే రాగింగ్ బాధితులు… టూమచ్ రాగింగ్ జరుగుతుంది వీరిపై… వీళ్లు తమ సీనియర్స్ మీద కోపంతో రగిలిపోతూ ఓ లోకల్ గ్యాంగ్‌స్టర్‌ను ఆశ్రయించి, తమ సీనియర్లను కొట్టిస్తారు… అక్కడితో కోపం చల్లారిపోవాలి… కానీ కథ అక్కడే మొదలవుతుంది… ఆ గ్యాంగ్ స్టర్ రంగా పాత్రే ఫహాద్ పోషించింది…
ఎప్పుడైతే సీనియర్స్ రంగాతో దెబ్బలు తింటారో, దాంతో ఈ ముగ్గురు విద్యార్థులకు రంగా మనుషులుగా ముద్రపడుతుంది… వాళ్ల హవా మొదలవుతుంది కాలేజీలో, దాంతో చదువు చంక నాకిపోతుంది… ఓ దశ వచ్చాక వాళ్లే రంగాను చంపాల్సిన సిట్యుయేషన్ వస్తే..? అదే కథ… కథనంలో ఇరగ్గొట్టేశాడు దర్శకుడు జీతూ మాధవన్… కేవలం ఒక ఇంట్లో రోమాంచమ్ తీసి వంద కోట్లు వసూళ్లు కొట్టిన దర్శకుడు ఈయన…
అందుకే తెలుగు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై ఆసక్తి ఉంది… ఇంకేం, తెలుగులోనే సినిమా ఓటీటీలో వస్తే ఇంకేముంది..? ఆవేశమే…!!
Share this Article