నేములోనేముంది…? అంటూ విలియమ్ షేక్ స్పియర్ నుంచి మన అచ్చ తెలుగు సినారె వరకు.. ప్రశ్నించినా..? నేములోనే… నేముందని.. ప్రశ్నలోనే ఇమిడున్న జవాబుతో సమాధానపర్చినా… పేరు ముచ్చట కాస్తా అటూఇటుగా తారుమారైతే అంతే సంగతులు..! అసలే అదును దొరికిందంటే ట్రోలింగ్ చేయకుండా వదలని సోషల్ మీడియా రోజుల్లో.. ఇక ఆ పరాకాష్ఠకంతుంటుందా…? విదేశీ వ్యవహారాల మాజీ మంత్రివర్యుల ఓ ట్వీట్.. ఇదిగో ఇప్పుడలాంటి ఉల్లాసాల నవ్వుల ట్వీటైన కథే ఇది! ఒక్క సల్మాన్ దెబ్బకు.. ముగ్గురు సల్మాన్‌లను చర్చలోకి లాగిన హిల్లేరియస్ కామెడీ స్టోరీ ఇది!! ఈరోజుల్లో మన భావాలు.. మన టార్గెట్స్ కు రీచ్ కావాలంటే.. ట్యాగింగనేదోటి ఉంటుందనేది సోషల్ వారియర్స్ అందరికీ బహుశా తెలిసిన కథే! ఐతే ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పేరు ముందులోనో, చివరలోనో.. ఒకే తరహా పేరును కల్గి ఉన్నప్పుడు.. ఆ ట్యాగింగ్ సరిగ్గా సరిచూసుకోకపోతే… ఒకరి బదులు ఇంకొకరికి మనమివ్వాల్సిన కౌంటర్ వెళ్లితే…? అదిగో అలా పుట్టిన ట్విట్టర్ నవ్వుల కథే ఇది!
The once and future king of democracy అంటూ సల్మాన్ ఖుర్షీద్ అనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ విదేశీ వ్యవహారాల శాఖా మంత్రివర్యులు మొన్న రాజీవ్ వర్ధంతిని పురస్కరించుకుని తన స్వామి భక్తినీ, అంతకుమించిన రాజభక్తిని, రాజీవభక్తిని చాటుకుంటూ ఒకటి ట్వీటాడు. రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహూల్ గాంధీ, కాంగ్రెస్ అభిమానులంతా ఆ ట్వీట్ కు విపరీతంగా లైకులు కొట్టడం, రీట్వీట్లు చేయడం కూడా అంతే సర్వసాధారణంగానే జరిగిపోయింది. కానీ… అది ఓ విమర్శక ట్విట్టర్ యూజర్ దృష్టిని ఆకర్షించింది. ఇంకేం విమర్శలకు ఎక్కుపెడుతూ… కేవలం చెంచాలు మాత్రమే… ప్రజాస్వామ్యానికి.. రాజుల పాలన కోరుకుంటారన్న అర్థాన్ని స్ఫురిస్తూ ఒకటి రీట్వీటడంతో పాటే… దాన్ని సల్మాన్ ఖుర్షీద్ కు బదులు.. భారతీయ మూలాలున్న బ్రిటీష్ నవలా రచయితైన సల్మాన్ రష్దీకి ట్యాగ్ చేశారు…
Ads
సల్మాన్ రష్దీకి ట్యాగ్ చేసిన ట్వీట్ కాస్తా నెటిజనం కంటపడటంతో ఇక బీభత్సమైన ట్రోలింగ్ మొదలైంది. అయితే ఆ ట్రోలింగ్ తో ఆగిపోతే కూడా ఇంతగా ఈ వార్త హైలైట్ కాకపోవునేమో..? ఇక సల్మాన్ రష్దీ కూడా రంగంలోకి దిగారు. సల్మాన్ ఖుర్షీద్ ను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ కు కౌంటర్ ట్వీట్ ఇచ్చే యత్నంలో.. తనకు ట్యాగ్ చేసిన సదరు ట్విట్టర్ యూజర్ కు సల్మాన్ రష్దీ ఇచ్చిన కౌంటర్ అటాక్ మరింత హాస్యాన్ని పంచింది. I think you have the wrong Salman. I’m @BeingSalmanKhan. అంటూ రష్దీ… బాలీవుడ్ కండల హీరో సల్మాన్ ఖాన్ ను కూడా ట్విట్టర్ ట్రోలింగ్ రంగంలోకి దించేశారు. ఇంకేముంది.. ఆ ట్వీట్ వైరలవ్వడంతో పాటు… ట్విట్టర్ యూజర్లకు ట్రోలింగ్ పంట పండించింది. అయితే అప్పటికే సదరు కాటు సత్య అనే ట్విట్టర్ యూజర్.. ముందు సల్మానన్న పేరున్నందుకు.. ఖుర్షీద్ కు బదులు రష్దీకి ట్యాగ్ చేయడం… ఆ తర్వాత రష్దీ.. సల్మాన్ నూ రంగంలోకి దించేలా ట్వీటడంతో నాలుక్కర్చుకున్నారనుకోండి! కానీ ఏం లాభమంటారా..? అప్పటికే పండించాల్సినంత హాస్యమంతా పండించేసినందుకు… ముగ్గురు సల్మాన్‌లను మించి.. ఇకముందూ తన ట్వీట్లకు అదే స్థాయి క్రేజ్ సంపాయించేసుకున్నారుగా కాటూ సత్య..?!…………… By… Ramana Kontikarla
Share this Article