Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

లడఖ్ మంచు కొండలకు జెన్ జీ మంట అంటుకుంది… ఎందుకు..?!

September 25, 2025 by M S R

.

( రమణ కొంటికర్ల ) …. పాలనా వ్యవస్థ దెబ్బ తింటే.. రాజ్యం ఎలా తిరుగుబాటుకు గురవుతుందో ఈమధ్యే నేపాల్ ఉదంతంతో మరోసారి చూశాం. ఇప్పుడా పరిస్థితులే లడాఖ్ కు పాకాయి. ఏ రాజ్యంలోనైనా పెరుగుతున్న, విద్యావంతులవుతున్న యువతకు వారి అర్హతలకు తగ్గ ఉపాధి కల్పన తప్పనిసరి. అది దూరమైతే ఎలా ఉంటుందో ఇప్పుడు లడాఖ్ లో చెలరేగుతున్న అల్లర్లు కళ్లకు కడుతున్నాయి.

అయితే, లడాఖ్ ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు ప్రముఖ పర్యావరణ వేత్త, ఇంజనీర్, సామాజిక ఉద్యమకారుడైన సోనమ్ వాంగ్ చుక్ ఇప్పటికే తన శాంతియుత ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో నేపాల్ తరహాలోనే జెన్ జీ విప్లవం లడాఖ్ లో చెలరేగడంతో ఇప్పుడక్కడి ఉద్రిక్తతలు.. అక్కడి సమాజంతో పాటు.. ముఖ్యంగా వాంగ్ చుక్ లోనూ ఆందోళనకు కారణమవుతోంది.

Ads

సెప్టెంబర్ 24వ తేదీ, బుధవారం రోజున లడాఖ్ లో నిరసనకారులు, భద్రతా సిబ్బందికి మధ్య జరిగిన ఘర్షణల్లో కనీసం నల్గురు మరణించడం. డజన్ల కొద్దీ యువత గాయాలపాలవ్వడంతో.. ఇప్పుడక్కడ హింస మరింత ప్రజ్వరిల్లబోతోందనేందుకు ఓ సంకేతమైంది.

ప్రత్యేక రాష్ట్ర హోదాతో పాటు.. సిక్స్త్ షెడ్యూల్ లో తమను కొనసాగించాలని ఇప్పటికే దశాబ్దాలుగా లడాఖ్ లో పోరాటం జరుగుతుండగా.. అదే పిలుపుతో మరోసారి ఉపాధి కొరవడిన యువతనుంచి ఉద్యమం మొదలైంది. అది తీవ్రరూపం దాల్చి హింస, ఘర్షణకు దారితీసింది.

ఒక్కమాటలో చెప్పాలంటే నేపాల్ తరహాలో జెన్ జీ ఉద్యమమే పురుడుపోసుకుంది. ఈ క్రమంలో అక్కడి అపెక్స్ బాడీ రాజధాని లేహ్ లో పూర్తిగా కర్ఫ్యూ విధించింది. దాంతో అక్కడ ఇప్పుడు ఒక బంద్ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఉద్యమాన్ని సామాజికవేత్త వాంగ్ చుక్ కూడా జెన్ జెడ్ ఉద్యమంగా అభివర్ణిస్తున్నాడు. ప్రజాస్వామ్య హక్కులు, నిరుద్యోగిత పెరిగిపోవడం వంటివి ఇందుకు కారణాలనే విషయం అందరికీ తెలిసిందే.

అయితే, ఇప్పుడు జరుగుతున్న ఉద్యమం హింసాత్మక రూపం దాల్చడంపై వాంగ్ చుక్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇంతకాలం తాను శాంతియుతంగా తీసుకొచ్చిన ఉద్యమం, తన సందేశం విఫలమైందనే భావన, బాధలో ఆయన ఉన్నారు. ఇలాంటి హింసాత్మక పనులు ఆపేయాలని అక్కడి యువతను కోరుతున్నాడు.

హింసతో ఏం సాధించలేమని.. తమ లక్ష్యాన్ని అది నీరుగారుస్తుందని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం లేహ్ లో నెలకొన్న భయానక, గందరగోళ వాతావరణం దృష్ట్యా ఆయన X ఖాతాతో పాటు, ఇన్ స్టా, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో వీడియో సందేశాలను పోస్ట్ చేస్తున్నారు.

leh

జెన్ జీ విప్లవ మంటల్లో లేహ్!

నిరసనల్లో భాగంగా పలు కార్యాలయాలు, పోలీస్ వాహనాలకు యువత లేహ్ లో నిప్పు పెట్టారు. సెప్టెంబర్ 23, మంగళవారం రోజున గత 35 రోజులుగా తమ ఉద్యమంలో భాగంగా నిరశన దీక్ష చేస్తున్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీంతో అక్కడి యువత మరింత ఆగ్రహించింది. దీంతో లేహ్ లో ఏకంగా అక్కడి అపెక్స్ కౌన్సిలే బంద్ ప్రకటించింది.

వేలాది మంది ఇప్పుడు లేహ్ రోడ్లపైకొచ్చేశారు. ఏం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్తతల్లో ఆ మంచుకొండలు వణికిపోతున్నాయి. గత ఐదేళ్లుగా యువత నిరుద్యోగితతో బాధపడుతున్నారు. అలాగే, చాలామంది మారుతున్న పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఉద్యోగాలు కోల్పోతున్నారు.

అది అక్కడ సామాజిక అశాంతికి దారి తీసింది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లడాఖ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది. వాంగ్ చుక్ కూడా మరోసారి 15 రోజుల నిరహారదీక్ష చేసి ముగించాడు. అయితే, లేహ్ లో కొనసాగుతున్న ఘర్షణాత్మక వైఖరి అక్కడివారి లక్ష్యాలను దెబ్బతీసేలా సాగుతుండటమే వాంగ్ చుక్ వంటివారిని ఇప్పుడు కలవరపరుస్తోంది.

  • అందుకే, యువతను హింసాత్మక వైఖరి విడనాడాలని.. తన ఐదేళ్ల ప్రయత్నం మొత్తం నీరుగారిపోతుందని.. చాలా ఏళ్లుగా ఎన్నోసార్లు తాను నిరహారదీక్షలు చేపట్టానని.. శాంతియుతంగా లడక్ అంతా కలియతిరుగుతూ కవాత్ చేస్తున్నాని.. తన శాంతియుత ఉద్యమాన్ని.. హింసాత్మక వైఖరితో వమ్ము చేయొద్దన్నది ఇప్పుడు సోనమ్ వాంగ్ చుక్ యువతను వేడుకుంటున్నాడు.

అయితే, లడాఖ్ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. ఎటువైపు తీసుకెళ్తుందో తెలియని ఒక అనిశ్చితి కనిపిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి 35 రోజులుగా 15 మంది యువత నిరాహారదీక్ష చేస్తుండగా… సెప్టెంబర్ 23న ఇద్దరు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వారిని ఆసుత్రికి తరలించారు. నిరశన దీక్షలు చేస్తున్నా అక్కడి అపెక్స్ బాడీలోగానీ, కేంద్ర ప్రభుత్వంలోగానీ చలనం లేకపోవడంతో.. యువత ఇక చేసేది లేదంటూ హింస వైపు మొగ్గారు. దీంతో ఇప్పుడు మంచుకొండల ప్రాంతం భగ్గుమంటోంది.

కశ్మీర్ నుంచి వేరుపడాలన్న లడాఖ్ వాసుల కలను భారత ప్రభుత్వం 2019లో నెరవేర్చినా.. ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చలేదని 2020 నుంచే లడాఖ్ లో మళ్లీ ఉద్యమం మొదలైంది. యవత వీధుల్లోకి రావడం మొదలెట్టారు.

ముఖ్యంగా బౌద్ధ సమాజం ఎక్కువ కనిపించే లేహ్ ప్రాంతంలోని వారంతా తమకు కేంద్ర పాలిత ప్రాంతం వద్దని.. తమకో చట్టసభతో ఉండే రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర హోదాతో పాటు, ఉద్యోగాలు, తమ భూములు, వనరుల పరిరక్షణ, లేహ్ తో పాటు, కార్గిల్ జిల్లాకు ఒక్కో పార్లమెంట్ స్థానం వంటివెన్నో వారి డిమాండ్లుగా ఉన్నాయి.

ఆర్టికల్ 244 క్లాజ్ 2, షెడ్యుల్ 6లో తమకు ఎక్కువ భద్రత, రక్షణ ఉంటుందని గిరిజనులు ఎక్కువగా ఉండే లడక్ వాసుల నమ్మకం. షెడ్యూల్ 6 వల్ల అటానమస్ డివిజనల్ కౌన్సిల్స్, డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏర్పాటైతే.. తమకు భరోసాగా ఉంటుందన్నది వారి డిమాండ్.

కానీ, కేంద్రం మాత్రం షెడ్యూల్ 6లో చేర్చలేమంటోంది. రాష్ట్ర హోదా ఇవ్వమంటోంది. అదే సమయంలో ఆర్టికల్ 371 ఆఫర్ చేస్తోంది. మరికొన్ని డిమాండ్స్ నూ నెరవేర్చేందుకూ ముందుకొస్తోంది. కానీ, లడాఖ్ ప్రజానీకం మాత్రం ససేమిరా అనడంతో.. ఈ ఉద్యమం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడిక తీవ్రరూపం దాల్చింది….

  • చివరగా.. ఇదే సోనమ్ వాంగ్ చుక్ నేపథ్యంలో ముగ్గురు హీరోల్లో అమీర్ ఖాన్ ప్రధాన హీరోగా.. విద్యావ్యవస్థపై ఒక సెటైర్ గా 3 ఈడియట్స్ సినిమా తెరకెక్కింది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అక్కడ శ్రీచరణికి ఘన సత్కారం… ఇక్కడ అరుంధతిరెడ్డికి ఏది మరి..?!
  • ఏదీ పవన్ కల్యాణ్ ఫోటో..? ఏదీ ఆటల మంత్రి ఫోటో..? ఏం యాడ్స్ ఇవి..?!
  • ది గరల్ ఫ్రెండ్..! ఓ టాక్సిక్ లవ్ స్టోరీ… రష్మికను మరో మెట్టు ఎక్కించింది..!!
  • ఇప్పటి నగర ప్రణాళికలన్నా… త్రేతాయుగపు అయోధ్య ఎంతో నయం…
  • నా డెత్ సర్టిఫికెట్ పోయింది… దొరికినవారు దయచేసి సంప్రదించగలరు…
  • బంగారు బల్లి… వెండి బల్లి… కంచిలో వాటి తాపడాలూ మార్చేసేశారు…
  • స్టార్ల సినిమాలు కాదు… ఇదుగో ఇవి కదా రీరిలీజ్ చేయాల్సింది..!!
  • బండి రాకతో జుబ్లీ హిల్స్ ప్రచార చిత్రంలో హఠాత్ మార్పు… ఎలాగంటే..?
  • జుబ్లీ ఇరకాటంలో కేటీయార్..! మాగంటి తల్లి పేల్చిన కొత్త బాంబులు..!!
  • బ్యాట్లు, లెగ్ గార్డుల షేరింగు అప్పట్లో… మ్యాచుకు జస్ట్ రూ. 1000 ఫీజు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions