ముందే చెప్పేస్తున్నా… ఇది క్రాక్ అనే సినిమా రివ్యూ కాదు…! జస్ట్, ఓ క్యూరియాసిటీ… అంతే… సాగరసంగమం సినిమా మాస్ అనాలా..? క్లాస్ అనాలా..? దాన్ని పులిహోర సినిమా అనాలా..? బిర్యానీ అనాలా..? కమర్షియల్ అనాలా..? కళాత్మకం అనాలా..? అసలు మాస్ మసాలా అనగానేమి..? వాణిజ్యచిత్రం అనగానేమి..? అసలు సినిమా ప్రేక్షకుల్లో మాస్, క్లాస్ విడివిడిగా ఉంటారా..? సాగరసంగమం సినిమాను కేవలం క్లాస్ ప్రేక్షకులు చూస్తేనే అంత భారీ హిట్ అయ్యిందా..? అసలు క్లాస్ అంటే ఎవరు..? మాస్ అంటే ఎవరు..?
సినిమా రిలీజ్ కాకముందే క్రాక్ సినిమా రివ్యూలు యూట్యూబ్‌ను ముంచెత్తిన తీరు చూశాం కదా… ఉదయం నుంచీ సైట్లు, ట్యూబ్ చానెళ్లు, టీవీలు గట్రా సినిమా మాస్, ఊరమాస్, కమర్షియల్, యాక్షన్, బిర్యానీ అంటూ రాస్తుంటే ఆశ్చర్యం వేసింది… అదుగో అన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి… మాస్ లేదా యాక్షన్ లేదా బిర్యానీ లేదా కమర్షియల్ గట్రా పదాలు వాడాలంటే… ఏం ఉండాలి..? ఏం ఉండకూడదు..?
Ads
హీరో దమ్మడ దమ్మడ రౌడీలను దంచుతూనే ఉండాలి… వందల మంది అలా ఎగిరెగిరి పడుతూనే ఉండాలి… మడత నలగని హీరో కోరమీసం దువ్వుతూ ఓ పంచ్ డైలాగ్ విసరాలి… ఆకట్టుకునే ట్యూన్లు లేకపోయినా సరే, మంచి ఫార్ములా ప్రకారం పాటలుండాలి.., ఏ కొత్త అప్సరసనో పెట్టి ఐటం సాంగ్ ఉంచాలి… లాజిక్కులు లేని సీన్లు ఉండాలి… రియాలిటీకి దూరంగా కథ ఉండాలి… పంచ్ డైలాగులుండాలి… అంతేనా..? అసలు ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ పరిమితులు తెలుసా వీళ్లకు..?
సరే, కమర్షియల్ విలువలు అంటే ఇవన్నీ పట్టించుకోకపోవడం అనుకుందాం… అసలు క్లాస్ ఏమిటి..? మాస్ ఏమిటి..? ఓపూట ప్యూర్ కర్డ్ రైస్ తిన్నవాడికి రాత్రి దమ్ బిర్యానీ తినాలి అనిపిస్తుంది… దేని టేస్టు దానిదే… రెండూ ఎంజాయ్ చేయగలడు… ఏ జానర్ దానిదే… అందుకని క్రాక్ సినిమాకు ముద్రలు వేయడం వేస్ట్… గతంలో తమకు హిట్టు తెచ్చిపెట్టిన, డబ్బులు సంపాదించి పెట్టిన ఓ రొటీన్ ఫార్ములా కథను మళ్లీ నమ్ముకున్నారు దర్శకుడు, నిర్మాత, హీరో… అంతే… కథనం మీద బాగా దృష్టి పెట్టారు… దాంతో సినిమా మరీ పేలవంగా గాకుండా కాస్త చూడబుల్ ఫార్మాట్లోకి వచ్చింది…
నిజానికి సినిమాలో ఎందుకోగానీ శృతిహాసన్ కన్నా వరలక్ష్మీ ఆకట్టుకుంటుంది… హీరోయిన్ గెంతులకు మాత్రమే ఉద్దేశించబడింది… సముద్రఖని ఆకట్టుకుంటాడు… తన నటనతో… కానీ సోకాల్డ్ కమర్షియల్ సినిమాలో బాగుండాల్సిన కామెడీ పాత్రలు పేలలేదు… పాటలు మెచ్చేలా లేవు… ఐనా సినిమా పర్లేదు అనే రేంజ్‌కు వెళ్లిందంటే కారణం… రవితేజ మార్క్ ఎనర్జీ, ఈజ్, నటనను ఇష్టపడే ప్రేక్షకులు… బిగి సడలకుండా అల్లుకున్న కథనం… కరోనా లాక్ డౌన్ అనంతరం థియేటర్లకు మళ్లీ ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు వస్తుండటం…! కుర్చీలో కూర్చున్నామంటే చాలు… ఓ గబ్బర్‌సింగ్‌లా… ఓ విక్రమార్కుడు… ఎదుటకు వచ్చి రౌడీలను ఇరగదీస్తూనే ఉంటాడు… కొందరు స్క్రీన్ వెనుక వైపు, ఇంకొందరు గేట్లు దాటి… మరికొందరు అయితే ఏకంగా థియేటర్ ఆవరణ దాటి పడుతుంటారు… ట్రెయిలర్లో చూపిన మామిడికాయ, మేకు, కరెన్సీనోటు అంత పెద్దగా కథలో ఇమిడినట్టుగా కూడా అనిపించదు… అయితేనేం… అసలే రవితేజ… ఆపై ఏ లాజిక్కులూ అవసరం లేని పోలీస్ వేషం… కుమ్మేయడమే…!! ‘‘నాకు తిక్కుంది, దానికి కాస్త లెక్కుంది’’… ‘‘నా పేరు శివమణి, నాక్కాస్త మెంటల్’’… అన్నట్టుగా దీంట్లోనూ ఓ డైలాగ్ పెడితే పోయేది… ‘‘నాపేరు పోతరాజు… నేను ఉత్త క్రాక్’’… పంచ్ డైలాగులంటే, ఈలలేయించే డైలాగులంటే ఇవే కదా…!!
Share this Article