Amarnath Vasireddy…. తెలుగాయన … అమెరికాలో సెటిలైన కొడుకు పంపించిన వైట్ మనీతో కోకాపేటలో అయిదు కోట్లకు ఒక ఫ్లాట్ కొన్నాడు . ధూంధాంగా గృహ ప్రవేశం చేసాడు . ఇంత డబ్బు పెట్టి కొన్న ఫ్లాట్ లో ఈ ఏజ్ లో ఏముంటాములే… మంచి రెంట్ వస్తే అద్దెకు ఇవ్వాలనుకుని ఏజెంట్ కు చెప్పాడు .
ఏజెంట్ ఒక మార్వాడీ పార్టీని తెచ్చాడు . నెలకు రెండు లక్షలు రెంట్ . తెలుగాయన భార్యతో “వామ్మో! నెలకు రెండు లక్షలు అద్దె ! మంచి గిరాకీ దొరికినట్టే . ఈ మార్వాడీలకు డబ్బే డబ్బు . రెండు లక్షలు పెట్టి అద్దె ఇంట్లో కాపురం ఉండడానికి రెడీ అవుతున్నారు . ఎణ్నాలున్నా అద్దె కొంపే కదా ? మార్వాడీలకు తెలివంటారు . ఇదేమి తెలివో…
మార్వాడితో.. ఆయన పన్నెండేళ్ల కొడుకు … ” బాపు .. మనకు వంద కోట్ల ఆస్థి ఉంది కదా . అయినా అద్దె ఇంట్లో ఉండాల్సిన ఖర్మ ఏంటి ? సొంతిల్లు కొనుకోవచ్చుగా ”
Ads
” ఖర్మ కాదు బేటా. తెలివి . ఇప్పుడా ఫ్లాట్ మనం కొనుక్కొంటే అయిదు కోట్లు కాపిటల్ లాక్ అయిపోతుంది . దాన్ని మనం బిజినెస్ లో పెడితే అంతకు అంతవుతుంది . రెండు మూడేళ్లలో అయిదు కోట్లు, కాస్తా పది కోట్లు అవుతుంది . అయినా లాస్ మనది కాదు బేటా . తెలుగాయనది . అయిదు కోట్లు పెట్టుబడి పెట్టాడు . అదీ వైట్ మనీ . నెలకు నూటికి రూపాయి ధర్మ వడ్డీ లెక్క వేస్తే నెలకు అయిదు లక్షలు . పోనీ బ్యాంకు రికరింగ్ డిపాజిట్ లెక్క వేసినా మూడు లక్షలు . మనం ఆయనకు ఇచ్చే అద్దె, రెండు లక్షలు . అంటే ఆయన ఉత్తి పుణ్యానికి మనకు నెలకు మూడు లక్షలు రెంట్ పే చేస్తున్నాడు . అర్థం అయ్యింది కదా . సొమ్ము ఆయనది . ఎంజాయ్మెంట్ మనది . బోర్ కొడితే రెండేళ్లకు దాన్ని ఖాళీ చేసి ఇంకో మంచి చోట ఇంకో ఫ్లాట్ లేదా విల్లా అద్దెకు తీసుకొంటాము ”
” కానీ బాపూ .. ఫ్లాట్ కొంటే దాని ధర పెరుగుతుంది కదా ? మనకు ఆ విధంగా నష్టం వచ్చినట్టేగా ?”
” ఫ్లాట్ ధరలు చాల నెమ్మదిగా పెరుగుతాయి బేటా ! పదేళ్లకు రెండు రెట్లు అవుతాయి . పోస్ట్ ఆఫీస్ లో స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేసినా ఇంకా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి . చెప్పా కదా . ఈ అయిదు కోట్లు పెట్టి నేను మరో మూడేళ్ళలో మరో అయిదు కోట్లు కమాయిస్తా”.
” అదెట్లా బాపూ ? అదే పని , మనకు రెంట్ కిచ్చిన ఆ తెలుగాయన ఎందుకు చేయడు”
” అరే ! బేటా ! అందుకు తెలివుండాలె . డబ్బు సైన్స్ తెలుసుండాలె. అది మన బ్లడ్ లో ఉంది బేటా . షేర్స్ కొనుడు … ప్రీ లాంచ్ ఆఫర్ లో ఫ్లాట్స్ బుక్ చేసి నిర్మాణం పూర్తయ్యాక దాన్ని డబల్ రేట్ కు అమ్ముడు .. నాలుగు రూపాయిల వడ్డీకి డబ్బును తిప్పుడు… హవాలా …. ఎన్నో మార్గాలు వున్నాయి బేటా . హవాలా, అధిక వడ్డీ చట్ట వ్యతిరేకం . నేను చెయ్యను . కొంత మంది నా ఫ్రెండ్స్ చేస్తారు ”
” షేర్స్ వ్యాపారం , జూదంతో సమానం అని అంటారు కదా బాపూ ”
” ఫండమెంటల్స్ తెలియకుండా ఎవడో కొన్నాడని లేదా మీడియాలో వచ్చే కంపెనీల బిల్డ్ అప్ వార్తలు చూసి షేర్ లు కొని.. అమ్మితే … అది జూదమే అవుతుంది బేటా . మనది ఫండమెంటల్స్ తెలుసుకొని చేసే బిజినెస్ . ఏ కంపెనీ ఎలా నడుస్తోంది? .. మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది? .. ఇవన్నీ లోతుగా తెలుసుకోవాలె . నువ్వు చిన్నాడివి . అన్ని చెబుతాలే ”
” అవును డాడీ . మా స్కూల్ లో చదివిన స్టూడెంట్ ఒకాయన , పదేళ్లలో షేర్ మార్కెట్ ద్వారా 250 కోట్లు సంపాదించాడట . మా కరెస్పాండెట్ సర్ చెప్పాడు . “ఫైనాన్సియల్ నిర్వాణ” అనే బుక్ కూడా రాసాడట . ఎకనమిక్స్ అందరూ తెలుసుకోవలసిన సబ్జెక్టు అని మా సర్ చెప్పాడు . ఏ పని చేసినా ప్రొఫషనల్ గా చేయాలి అని కూడా చెప్పాడు . అంటే ఏంటి బాపు ?”
” చూడు బేటా . తెలుగోళ్లలో తక్కువ మందే డబ్బు సైన్స్ సూత్రాలు తెలుసుకొని ప్రొఫషనల్ గా వ్యవహరిస్తారు . మనకు ఫ్లాట్ కు అద్దెకిచ్చిన తెలుగాయనకు పాపం డబ్బు సైన్స్ రాదు . తాను ఫ్లాట్ కొని నష్టపోతున్నాడని ఆయనకు అర్థం కాదు . అర్థం అయినా డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చెయ్యాలో తెలియదు . మనిషి డబ్బు సంపాదిస్తే ఎంతొస్తుంది బేటా ? ఒక స్టేజి దాటాక డబ్బు డబ్బును సంపాదించాలి . చెప్పిన కదా . అది ప్రొఫషనల్ గా సాగాలి .
ఒక ప్రీ లాంచ్ ఆఫర్ అనుకొందాము . ఎవడో తెలిసిన వాడు ఫ్లాట్ కడుతున్నాడు , ప్రారంభంలో తక్కువ రేట్ కు వస్తుంది అంటే తన ఆస్థి మొత్తం తెగనమ్మి, అవసరం అయితే నాలుగు రూపాయిల వడ్డీకి తీసుకొని అలాంటోళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు . ఆ నిర్మాణం పూర్తి కాకపొతే ఆత్మ హత్యే గతి . మన దారి అలా కాదు బేటా . మొహమాటాలు వుండవు . డబ్బు దగ్గర నిక్కచ్చిగా ఉండాలి .
ప్రీ లాంచ్ ఆఫర్ ఇస్తున్న బిల్డర్ ఫండమెంటల్స్ స్టడీ చేస్తాము . వాడు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాడు అని నిర్ధారణకు వచ్చాకే ఇన్వెస్ట్మెంట్ . అదీ ఎలాగంటే .. మన దగ్గర వంద కోట్లు ఉంటే అయిదు కోట్లు పెడతాము . తెలుగోళ్ల మాటల్లో చెప్పాలంటే కొండకు వెంట్రుక కట్టాము . లాగితే కొండ వస్తుంది . పొతే వెంట్రుకే . వంద కోట్లలో అయిదు కోట్లు పోయినా ఏమీ కాదు . చేతిలో అయిదు కోట్లు ఉంటే వెయ్యి కోట్ల హై రిస్క్ బిజినెస్ చేసే వాడే తెలుగోడు .
చూసినవు కదా బేటా . ఒక జనరేషన్ లో మంచి గ్రోత్ ఉన్నా రెండో తరం… మూడో తరం వచ్చేటప్పటికి ఎలా దివాళా తీస్తున్నారో . మనది అలా కాదు బేటా . తరతరాలుగా వ్యాపారం చేస్తున్నాము . బిజినెస్ అన్నాక నష్టాలు కష్టాలు ఉంటాయి బేటా . కానీ బిజినెస్ లో దివాళా తీసి ఆత్మహత్య చేసుకొన్న మార్వాడీలు బాగా తక్కువ . కారణం మనం డబ్బు సైన్స్ అదే ఎకనామిక్స్ నేర్చుకొంటాము . నేను ఇప్పుడు నీకు నేర్పిస్తోంది అదే . మా నాన్న నాకు నేర్పాడు . మా కాలంలో అయితే బడిలో కూడా ఇలాంటి పాఠాలు చెప్పేవారు . ఇప్పుడేమో ఐఐటీ ఫౌండేషన్ . మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ తప్పించి ఏమీ చెప్పరు.. ఇంగిత జ్ఞానం కొరవడుతుందంటే కాదా మరి ?
దీపావళి కి మనం, ఈ సంవత్సరం కూడా రాజస్థాన్ వెళుతున్నామా డాడీ ?’
” అవును బేటా . సంవత్సరమంతా బిజినెస్ . దీపావళి సందర్భంగా పది రోజులు రిలాక్స్ . ఎంజాయ్ . మనకి కేవలం జాయింట్ ఫ్యామిలీ కాదు బేటా . ఇంకా ఎంతో మంది బంధువులు ఉన్నారు . అందరితో కలిసి వారం పది రోజులు . మనకి రేపు కష్టం వస్తే వారు అండదండగా వుంటారు బేటా ! డబ్బు తెలుగోళ్లను విడదీసింది . మనల్ని కలిపి ఉంచుతోంది . అదే డబ్బు సోషల్ సైన్స్ బేటా ”
“బాపూ . తెలుగుళ్ళందరూ డబ్బు మానేజ్మెంట్ విషయంలో ఇంతేనా ?”
లేదు బేటా . తెలుగోళ్ళల్లో వాణిజ్య కులాలు మినహాయిపు బేటా . మిగతా వారిలో కూడా అక్కడక్కడా మినహాయింపులు వున్నాయి . వారిలో తక్కువ మందికి డబ్బు సైన్స్ తెలుసు . మనకు అది బ్లడ్ లో ఉంది .. చెప్పాగా బేటా.
బాపూ .. పది అయిపోయాక ఎంపీసీ గ్రూప్ తీసుకొని నేను ఇంజనీరింగ్ చేస్తా ”
“అమెరికాకు వెళ్లి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవుతావా బేటా ?
“లేదు బాపూ .. అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా మన దేశంలోనే వున్నా .. స్టార్ట్ అప్ తో వెయ్యి మందికి జాబ్స్ ఇస్తా . జాబ్స్ కోసం లైన్ లో నిలబడడం కాదు . నేనే జాబ్ ఇస్తా . ఉద్యోగంలో చేరితే అది 60 ఏళ్లకు మనది కాకుండా పోతుంది . అదే సొంత బిజినెస్ అయితే చివరి దాకా మనదే కదా బాపూ “…. “శెభాష్ బేటా . బాగ్ కా పెట్ మెయిఁ బాగ్ హి పైదా హోగా ”
Share this Article