ఈరోజు మలయాళ పండుగ ఓనం… ఆంధ్రులకు సంక్రాంతి, తెలంగాణలో దసరా పండుగల్లాగే కేరళ వాళ్లకు ఓనం ప్రధానమైన పండుగ… ఎవరి స్థోమతను బట్టి వాళ్లు పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు… ఒకప్పటితో పోలిస్తే ఈ పండుగ కూడా తన ప్రాభవాన్ని వేగంగా కోల్పోతోంది… ఆ కారణాల చర్చలోకి వెళ్లడం లేదు గానీ… ఓనం సాధ్యా అనేది ఆసక్తికరమైన పండుగ విశేషం… సాధ్యా అంటే ఓనం పండుగ భోజనం… నేల మీద కూర్చుని, కుటుంబసభ్యులంతా, అరటి ఆకుల్లో 24 నుంచి 26 రకాల వంటకాల్ని ఆరగించడమే సాధ్యా… అదే తిరువోణం…
నిజానికి సాధ్యా ఇలా ఉండాలి అనే సూత్రాలేమీ ఉండవు… ఇందులో కూడా ఆర్థికస్థోమత కీలకం… పైగా పేరుకు 26 రకాలు అంటారు గానీ… పాపడం, అరటిపండు తదితర అనుబంధ ఆధరవులు, ఇతర ఆహారాంశాలను కూడా వంటల రకాల్లో లెక్కేస్తుంటారు… చివరకు విస్తరిలో మొదట వడ్డించే ఉప్పు కూడా ఓ రకమే… ఐనాసరే, సాధ్యాలో ఏం తిన్నాం అనేది ముఖ్యం కాదు… ఎక్కడెక్కడో ఉండేవాళ్లు కూడా ఓనం నాటికి సొంతింటికి చేరుకుని, కుటుంబసభ్యులతోపాటు అరటి ఆకుల ముందు కూర్చుని, మొదటి ముద్ద నోట్లో పెట్టుకున్నప్పుడు కలిగే తృప్తి వేరు…
వినాయకచవితి అంటే కుడుములు, ఉండ్రాళ్లు, తాళికలు, లేతచింతకాయ తొక్కు… దసరా అంటే ప్రధానంగా మాంసాహారం… దీపావళి అంటే మిఠాయిలు… ఇలా పండుగలను బట్టి కొన్ని వంటకాలను ఖచ్చితంగా టేస్ట్ చేయడం మనకు అలవాటే కదా… సాధ్యాలో కూడా ఉంటాయి… ఓసారి ఈ ఫోటో చూడండి… సాధ్యా స్థూలంగా ఇలా ఉంటుంది… ఇలాగే ఉండాలని కాదు, ఒక ఉదాహరణ…
Ads
ఉప్పు, పాపడం వోకే… పాఝం అంటే చిట్టి అరటిపండ్లు… దీన్ని చేత్తో మెత్తగా పిసికి, పాయసంలో కలిపి జుర్రుకోవడం ఓ కళ… ఆత్మారాముడికి అలౌకికమైన ఆనందం… సాంబారు, రసం వేర్వేరు… ఉప్పెరి అంటే అరటికాయ చిప్స్… షర్కర ఉప్పెరి అంటే తీపి చిప్స్… బెల్లం వాడతారు… అందరూ వండలేరు దీన్ని… మామిడికాయ కొత్త సోగి (ఆవకాయ) మనకున్నట్టుగానే… (కేరళ వంటకాల్లో ఎక్కువగా అరటి, కొబ్బరి, మిరియాలు…)
కాలన్ అంటే కొబ్బరి, పెరుగు, అరటిలతో చేసే వంటకం… ఇదీ ఓనం విశేషమే… కూటు కర్రీ అంటే ఉజ్జాయింపుగా మిక్స్‌డ్ వెజ్ కర్రీ… పప్పులు, పలు కూరగాయలతో చేస్తారు… కొబ్బరి, మిరియాలు తప్పనిసరి… ఎరిసెరి మరో స్పెషల్… గుమ్మడికాయ, అలసందలతో చేసుకునే కూర… ఓలన్ అంటే సొరకాయ, కొబ్బరిపాలతో చేస్తారు… అవియల్ అంటే కూడా పలు కూరగాయలు ప్లస్ కొబ్బరి… పులిసెరి అంటే దోసకాయ, పెరుగు… బెల్లం, మామిడితో స్వీట్ డిష్ చేసుకుంటే అది మాంబజ పులిసెరి…
పైన్ ఆపిల్ పచ్చడి… దోసకాయ పచ్చడి సరేసరి… బీన్స్ తోరన్ అంటే పనస, క్యారెట్, బఠాణీ, బీన్స్ కర్రీ… బీన్స్ బదులు క్యాబేజీతో చేస్తే క్యాబేజీ తోరన్… చోరు అంటే అన్నం… కేరళలో సన్నబియ్యం వాడకం తక్కువ… ఎర్రబియ్యం, దొడ్డుబియ్యం, కొందరు ఉప్పుడుబియ్యం వాడతారు… మోరు కర్రీ అంటే దాదాపు పలుచగా చేసుకునే పెరుగు పచ్చడి… పరుప్పు అంటే పప్పు కూర… పాల్ పాయసం అంటే దాదాపుగా రైప్ పుడింగ్… సంబారం అంటే భోజనానంతరం తాగే మజ్జిగ… అల్లం, మిర్చి ముక్కలు, కరివేపాకు వేస్తారు…
మొత్తం వంటకాల్లో ప్రథమాన్ మరో విశేషం… స్వీట్… రైస్‌తో చేస్తే పలడా ప్రథమాన్… అరటి, బెల్లం, కొబ్బరిపాలతో చేస్తే పాఝ ప్రథమాన్… గోధుమ నూకతో చేస్తే గోతంబు ప్రథమాన్… పెసర్లతో చేస్తే పరిప్పు ప్రథమాన్… పనస ప్రథమాన్, మినుములతో చేస్తే కదల ప్రథమాన్… ఇప్పటితరం ఇవన్నీ ఇష్టపడుతోందా..? అదొక పెద్ద ప్రశ్న..!! వర్తమానంలో ఎంతమందికి ఇవన్నీ చేసే ఓపిక ఉంది..? ఇది మరో ప్రశ్న…!!
Share this Article