.
Raghu Mandaati ………… నేటి వినియోగదారుల సంస్కృతి పూర్తిగా బ్రాండ్ల ఆధీనంలో ఉంది. ఫ్యాషన్, గాడ్జెట్‌లు, అప్లియెన్స్‌లు, ఫర్నీచర్ – అన్నింటికీ లైఫ్‌స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. మనం నిజంగా అవసరమైనవాటిని కొనుగోలు చేస్తున్నామా? లేక బ్రాండ్లు మనపై మాయాజాలం కట్టి మనలను మరింతగా కొనుగోలు చేసేలా మారుస్తున్నాయా?
నెట్‌ఫ్లిక్స్ లో ఇటీవల విడుదలైన Buy Now: The Shopping Conspiracy అనే డాక్యుమెంటరీ మనం రోజు ఎదుర్కొంటున్న ఓ ముఖ్యమైన సమస్యను వెలుగులోకి తెచ్చింది. ఈ డాక్యుమెంటరీలో ప్రముఖ బ్రాండ్లు వినియోగదారులపై ఎలా మానసిక ఒత్తిడి కలిగిస్తాయో, ప్రణాళికాబద్ధంగా వస్తువుల జీవిత కాలాన్ని తగ్గిస్తూ కొత్త ఉత్పత్తులు కొనిపించేలా ఎలా మాయ చేస్తాయో వివరంగా చర్చించారు.
Ads
ప్లాన్డ్ అబ్సలెసెన్స్ ఒక వ్యాపార వ్యూహం.
ఒక ఫోన్ మూడేళ్లకే పనిచేయడం మానేస్తుంది, గొప్ప బ్రాండెడ్ షూస్ రెండు లేదా నాలుగేళ్లకు తెగిపోతాయి. ఇదంతా యాదృచ్ఛికంగా జరుగుతుందా, కానే కాదు. Planned Obsolescence అనే వ్యాపార వ్యూహం ద్వారా పెద్ద పెద్ద కంపెనీలు ఉత్పత్తులను నాణ్యతను తగ్గించి తద్వారా కొత్త ఉత్పత్తి చేసి వినియోగదారులను మళ్ళీ కొనుగోలు చేసేలా ఉసిగొలుపుతాయి.
ఆన్‌లైన్ షాపింగ్ కోసం మనం వెతికిన ప్రొడక్ట్స్, మనకు నచ్చిన రంగు, మన ఆర్థిక స్థాయిని బట్టి వచ్చిన ఆఫర్లు ఇవన్నీ మనకోసం ప్రత్యేకంగా రూపొందించినట్టే అనిపిస్తుంది. కానీ, AI మరియు డేటా అనలిటిక్స్ ఉపయోగించి మన షాపింగ్ అలవాట్లను విశ్లేషించి, బ్రాండ్లు మనలో మానసిక అవసరాన్ని సృష్టిస్తాయి. ఇవి ఎలాగా అంటే నిత్యం మనం తొంగి చూసే సోషల్ మీడియా మాధ్యమం ద్వారా బ్రాండ్లు మన జీవితాల్లోకి, మన మెదడులోకి అంతెందుకు మన నరనరాలను ఆక్రమించేశాయి.
ఇంత వేగంగా కొత్త వస్తువుల అవసరం కలిగించడం వల్ల మనం అనవసర ఖర్చులకు లోనవుతాం. దాంతో పాటు వ్యర్థ వస్తువుల పేరుతో ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. మార్కెటింగ్ వ్యూహాల వల్ల మనలో కొంతమంది ముఖ్యంగా టీనేజ్ మహిళలు తోటి వారితో పోల్చుకునే ధోరణికి లోనై, స్టేటస్ సింబల్స్ కోసం ఫోన్ లు, గాడ్జెట్స్, ఫాషన్ ఉత్పత్తుల కోసం ఎంతో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు.
ఇంకోవైపు అప్పుడే పుట్టిన పిల్లల నుండి యుక్త వయసుకు వచ్చేంత వరకు తిండి, బట్ట, ఆట వస్తువులు, అలంకరణలు, గృహోపకరణాలు, ఇలా ఒకటి కాదు రెండు కాదు మామూలు సామాన్యుడు సైతం వారానికి హీన పక్షం రెండు లేదా మూడు వస్తువులను, అదీ కాకుండా వారంలో కనీసం మూడు పూటలైన తిండి పదార్ధాలు ఆన్లైన్ లో కొనుగోలు చేస్తున్నారని సమాచారం.
ఉత్పత్తుల లైఫ్‌స్పాన్ తక్కువగా ఉండటం న్యాయమా?
అప్పుడు 1985-2010 వరకు కూడా మనం షాపింగ్ చేయాలంటే మార్కెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. ఫ్యామిలీతో కలిసి పండుగల సమయంలోనే ఎక్కువగా కొనుగోలు చేసేవాళ్ళం. ఒక్కో వస్తువు కొనుగోలు చేయడంలో ఎంతో ఆలోచనతో పాటు ఒక ప్రణాళిక ఉండేది. బ్రాండ్లు మీద కాకుండా నాణ్యతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళం.
మరి ఇప్పుడు, అంటే 2010-2025…. ఆన్‌లైన్ షాపింగ్ వల్ల మనం ఏ సమయంలోనైనా, ఎక్కడి నుండైనా కొనుగోలు చేయగలుగుతున్నాం. ప్రతి ఫెస్టివల్, ప్రత్యేక డీల్స్ పేరుతో కంపెనీలు మనకు ఆఫర్లను చూపించి మానసిక ఒత్తిడి పెంచుతున్నాయి.
బ్రాండ్లు తరచుగా కొత్త ఉత్పత్తులను విడుదల చేసి, మునుపటి ఉత్పత్తులకు విలువ లేకుండా చేస్తున్నారు.
సోషల్ మీడియా ప్రభావంతో, మనం అసలు అవసరం లేని వస్తువులను కూడా కొంటున్నాం. గతంలో ఉన్నదాన్ని మెరుగుపరిచే సంస్కృతిని అవలంబించేవాళ్ళం.
మన పెద్దవాళ్లు ఒక వస్తువు పాడైపోతే దాన్ని మరమ్మత్తు చేసుకోవాలని చెప్పేవారు. చిరిగిన బట్టను కూడా సరి చేసుకోవడం నేర్పించే వారు, పాత టైపు రైటర్‌ను సరిచేసుకోవడం, వాడిన వస్తువుల్ని తిరిగి మళ్లీ ఉపయోగించడం సర్వ సాధారణం.
ఇప్పటి మార్కెటింగ్ మాయాజాలం
ఇప్పుడు కంపెనీలు ఎలా నడుస్తున్నాయంటే… మీ వద్ద ఉన్నది పాతది, కొత్తది ఇంకా మంచిది! అనే భావనను రేకెత్తించేస్తాయి. టెక్నాలజీ, ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు వేగంగా మార్చేలా ప్రణాళికాబద్ధంగా మార్కెటింగ్ చేస్తాయి.
సైకలాజికల్ ట్రిక్స్ వాడి, వినియోగదారులను కనెక్ట్ చేసేందుకు సోషల్ మీడియా, వ్యక్తిగత డేటా ఉపయోగిస్తున్నాయి. అంతెందుకు ఇదే ఫేస్బుక్ కేవలం మిత్రుల కలయిక కోసం వారి భావస్వేచ్ఛకు పునాది వేసి, లైక్ మైండెడ్ గ్రూప్ చర్చల కోసం, కొత్త పరిచయాలు, కొత్త కొత్త పోస్టులతో ఆహ్లాద్దకరంగా ఉండేది.
కానీ ఇప్పుడు ప్రతి పోస్ట్ కింద ఒక యాడ్ మరియు రీల్స్ వీడియోస్ మనల్ని ఊపిరి తీసుకొనివ్వకుండా పది నిమిషాలకే చిరాకు పుట్టే విధంగా తయారయ్యి, చాలా మంది మిత్రుల పోస్ట్ లను చూడలేని పరిస్థితి. రేపో మాపో ఈ ఫేస్బుక్ వాడకానికి కూడా నెలకు ఇంత అని సభ్యత్వం పేరిట డబ్బు వసూలు చేసే రోజు కూడా రావొచ్చేమో…
మీరు గమనించారా? ఒక మొబైల్ ఫోన్ కొన్నాక రెండు మూడేళ్లకు నెమ్మదిగా పనిచేయడం, లేదా త్వరగా ఛార్జింగ్ అయిపోవడం… కొత్త మోడల్ వచ్చిన వెంటనే పాత మోడల్‌కు సపోర్ట్ తగ్గించడం, లేదా ఎలక్ట్రానిక్ పరికరాల్లో పార్ట్స్ మారుస్తూ మరమ్మతులకు ఎక్కువ ఖర్చు వచ్చేలా చేయడం – ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగే పరిణామాలు కాదు!
ఇవి అన్నీ ప్లాన్డ్ అబ్సలెసెన్స్ (Planned Obsolescence) అనే వ్యూహంలో భాగం. అంటే, ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా తక్కువ జీవితకాలం కలిగినవిగా తయారు చేసి, వినియోగదారులు త్వరగా కొత్త ఉత్పత్తులను కొనేటట్లు ప్రేరేపించడమే లక్ష్యం.
2017లో Apple తమ పాత iPhones బ్యాటరీ పనితీరును అప్డేట్ రూపంలో దాని జీవిత కాలాన్ని నెమ్మదిగా చేసినట్లు అంగీకరించింది. Samsung కూడా కొత్త మోడళ్లను ప్రమోట్ చేయడానికి పాత మోడళ్ల పనితీరును తగ్గించిందని ఫ్రాన్స్‌లో కేసు నమోదైంది.
కొత్త ల్యాప్‌టాప్‌లు లేదా ట్యాబ్లెట్‌లను కొనాలని అనిపించేలా పాత మోడళ్లకు సపోర్ట్ తగ్గించడం ఇది మరో వ్యూహం. 1980ల వరకు కార్లను 20-30 ఏళ్ల పాటు వాడగలిగేవారు. ఇప్పుడు కొత్త మోడల్స్ రావడానికి ముందు 5-7 ఏళ్లకే పాత మోడల్ యొక్క మరమ్మతులు ఖరీదైనవిగా మారిపోతున్నాయి.
రిఫర్‌బిష్డ్ (Refurbished) పరికరాలు తక్కువగా లభించడానికి ప్రధాన కారణం – కంపెనీల వ్యూహమే! 1970లలో తయారైన ఫ్రిడ్జ్‌లు 30-40 ఏళ్లకు పైగా పనిచేశాయి! ఇప్పుడు 5 -10 ఏళ్లకే కొత్త మోడల్ తీసుకోవాల్సిన పరిస్థితి! వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు, టీవీలు, ఫ్యాన్లు… అన్నింటికీ అదే కథ!
వీటివల్ల ఎంతో వ్యర్థం తయారవుతోంది. ప్రతి సంవత్సరం సుమారు 50 మిలియన్ మెట్రిక్ టన్నుల ఈ-వేస్ట్ ఉత్పత్తి అవుతోంది! 2025 నాటికి ఈ సంఖ్య 80 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరుగుతుందని అంచనా.
ప్రపంచంలో గరిష్ట ఈ-వేస్ట్ ఉత్పత్తి చేసే దేశాలు – చైనా, USA, యూరప్ దేశాలతో పాటు మన భారత్ కూడా… భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఈ-వేస్ట్ ఉత్పత్తి దేశం! మన దేశంలో అనధికార రీసైక్లింగ్ కార్మికులు రసాయనాలను వాడి తక్కువ ధరకే స్క్రాప్ విక్రయిస్తూ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు….
గతంలో ఓ ఉత్పత్తిని మనం దీర్ఘకాలిక మన్నిక, చవక ధర, నాణ్యత, మంచి సర్వీసింగ్, ఈజీ రిపేర్ కోణాల్లో అంచనా వేసేవాళ్లం… ఇప్పుడు పూర్తిగా భిన్నం…! కంపెనీలే తమ పాత మోడళ్లను పనికిరాకుండా చేస్తుంటాయి… మరి కొత్తవి కొనిపించాలి కదా…!!
Share this Article