.
(వరుణ్ శంకర్) …… పత్రికా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛనే….
ఇవ్వాళ (మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. 1993 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని జరుపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా మీడియాపై, ప్రత్యేకించి ప్రింట్ మీడియాపై ఆంక్షలు, అణచివేతలు పెరుగుతున్న నేపథ్యంలో పత్రికలకు స్వేచ్ఛ అనేది ప్రాణప్రదమని, అది ప్రజాస్వామ్య మనుగడకు ఎంతో కీలకమనే ఉద్దేశంతో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. అయితే పత్రికలకు స్వేచ్ఛ నిజంగానే తగ్గిపోయిందా…?
Ads
అవి ఆంక్షలు, అణచివేతలతో అల్లాడుతున్నాయా…? అనే ప్రశ్నలు వేసుకున్నప్పుడు అనేకానేక అంశాలు చర్చకు వస్తాయి. పత్రికల స్వేచ్ఛ గురించి నిజంగా మథన పడాల్సిన అవసరం ఉందా..? అవి ఏ మార్గంలో పయనించడం వల్ల స్వేచ్ఛను కోల్పోతున్నాయి..? అనే ప్రశ్నలకు జవాబులు వెతుక్కోవాల్సి ఉంటుంది.
భారత రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి ప్రత్యేకమైన అధికరణాలేవీ లేవు. ఆర్టికల్ 19 (ఎ)… పౌరులందరికీ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రసాదించింది. పత్రికా స్వేచ్ఛ కూడా అందులో భాగమే. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని, ఏది పడితే అది మాట్లాడకూడదంటూ రాజ్యాంగం కొన్ని పరిమితులు కూడా విధించింది.
అయితే ఎన్ని నిబంధనలు, పరిమితులు ఉన్నా… పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ కంటే పత్రికల స్వేచ్ఛకు ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. ఎందుకంటే అవి ప్రజాల పక్షాన గొంతును వినిపిస్తాయనే నమ్మకం ఉండేది కాబట్టి.
పత్రికా యాజమాన్యాలు నిర్వహణ వరకే పరిమితం కావడం వల్ల, వాటిలో పనిచేసే పాత్రికేయులకు అపరిమితమైన స్వేచ్ఛ ఉండేది. వార్తలు, కథనాల ప్రచురణలో ఆదర్శనీయ ప్రమాణాలు రెపరెపలాడేవి. ప్రజల కష్టాలను కన్నీళ్లను అక్షరీకరించడంలో, పాలకుల, అధికారుల అక్రమాలను వెలికితీయడంలో ఎలాంటి ఆంక్షలు, రాజీలు ఉండేవి కావు.
యాజమాన్యాలు రాజకీయాలకు, పాలకులకు దూరంగా ఉండటం కూడా ప్రజా పాత్రికేయం వర్దిల్లడానికి కారణాలు నిలిచాయి. అయితే కొన్నాళ్లుగా పత్రికా నిర్వహణ రాజకీయీకరణ, కార్పొరేటీకరణ జరగడంతో పరిస్థితుల్లో సమూలమైన మార్పులు వచ్చాయి.
ఇప్పుడు పత్రికలంటే ఎడిటర్లో, విలేకరులో కాదు, సమస్తమూ యాజమాన్యాలే. వారి పుణ్యమా అని పత్రికలు ఎవరికో వత్తాసు పలకడమో, ఎవరితోనో అంటకాగడమో అలవాటు చేసుకున్నాయి. కులంతో పాటు ఆర్థిక ప్రయోజనాలు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తూ వస్తున్నాయి. తెలుగునాట గత ఐదు దశాబ్దాలుగా ఇది మరీ ప్రబలిపోయింది.
తమ వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు మరోలా వ్యవహరిస్తూ పత్రికా ప్రమాణాలు, ఆదర్శాలను గాలికొదిలేశాయి. పత్రికలు పొలిటికల్ స్టాండ్ తీసుకోవడం మొదలైన తర్వాత పత్రికలు ఆయా రాజకీయ పార్టీల కరపత్రాలుగా మారిపోయాయి.
రాజ్యసభ పదవుల కోసమో, యాడ్స్ కోసమో, కాంట్రాక్టులు, స్థలాలు పొందడం కోసమో పత్రికా విలువలను నిర్లజ్జగా తాకట్టు పెట్టేస్తున్నారు. రాజకీయ భావజాలాలు, వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఎన్ని వున్నా, వాటిని పత్రికల్లోకి చొచ్చింపకూడదనే ఆదర్శాన్ని గాలికొదిలేస్తున్నారు.
పాత్రికేయంలో లక్ష్మణరేఖలను, సమతౌల్యాన్ని పాతిపెట్టి ఇష్టారాజ్యంగా వార్తలను వండివారుస్తున్నారు. ఈ క్రతువులో పాత్రికేయులు నిమిత్తమాత్రులు. ఎడిటర్ల నుంచి కంట్రిబ్యూటర్ దాకా అందరూ మేనేజ్‌మెంట్ పాలసీని తెలుసుకునో, అర్థం చేసుకునో వార్తల్ని రాయాలే తప్ప, ఉన్నది ఉన్నట్టుగా రాసే పరిస్థితులు లేవు. వాళ్లు ద్రవపదార్థం లాంటి వారు. మేనేజ్‌మెంట్లు ఏ సీసాలో పోస్తే అందుకు తగ్గట్టుగా సర్దుకుంటారు.
ఇప్పుడు పత్రికలన్నీ ఏదో ఒక పార్టీకో, కులానికో వత్తాసు పలుకుతూ వారితో కలిసి కులుకుతున్నాయి. తమ వారు కానివారో, తమకు పడని వారో అధికారంలో ఉన్నప్పుడు పత్రికా యాజమాన్యాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయి. పనిగట్టుకొని రంధ్రాన్వేషణ చేస్తూ వార్తా కథనాలు రాయిస్తున్నాయి. తమ పాలసీని మొహమాటం లేకుండా తేటతెల్లం చేస్తున్నాయి.
తమ వారి కోసం సిగ్గూఎగ్గూ లేకుండా పేజీలకు పేజీలు కుమ్ముతూ డప్పు కొడుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే… ‘పెట్టుబడి మాది, పత్రిక మాది.. మా ఇష్టం వచ్చినట్టు రాస్తాం.. వేస్తాం…’ అని ప్రకటించుకుంటున్నారు. దానికి పత్రికాస్వేచ్ఛ భాష్యాలను ఆలపిస్తుంటారు. అధికారంలో ఉన్నవాళ్లు ఏదైనా చర్యకు దిగితే పత్రికా స్వేచ్ఛ బుగ్గయిపోతోందని గగ్గోలు పెడతారు.
వాస్తవానికి పత్రికల్లో రాజకీయ ప్రేరేపిత, రాజకీయ ప్రయోజనాల కథనాలు తప్పితే, మిగతా వార్తలన్నీ కూడా ఎంతో విలువైనవి.. ఎంతో సమాచారాత్మకమైనవి. వీటి వల్లే పత్రికలకు ఇప్పటికీ ఎంతో కొంత ఆదరణ ఉంటోంది. సోషల్ మీడియా ఎంతగా ప్రభావం చూపుతున్నా.. పత్రికల్లో వచ్చే రాజకీయేతర కథనాలు, వార్తలు పాఠకులకు ఎంతో కొంత ఉపయుక్తమైనవే.
వీటి విషయంలో మేనేజ్‌మెంట్లు ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదు కాబట్టి పాఠకులు బతికిపోయినట్టే అనుకోవాలి. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు, కార్పొరేట్ కంపెనీల విషయంలో యాడ్స్ యావతో వార్తల్ని తొక్కిపెట్టే ప్రక్రియ, కిల్ చేసే ప్రక్రియ సగటు జనానికి చాలా వరకు తెలియదు. అది వేరే కథ.
పత్రికా నిర్వహణ అనేది ఒకప్పుడు సామాజిక బాధ్యతగా ఉండేదేమో గానీ, ఇప్పుడైతే ఫక్తు వ్యాపార ప్రక్రియ. యాజమాన్యాల వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలే పరమావధి. వార్తలు రాయడం ద్వారా, రాయకపోవడం ద్వారా ఏడాదికి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందనేదే లెక్క.
స్పేస్ సెల్లింగ్ అనేది ఒకప్పుడు యాడ్స్‌కే వర్తించేది. ఇప్పుడు వార్తలకు కూడా వర్తింపచేస్తున్నారు. తెలుగునాట ఇప్పుడు ఏ ఒక్క పత్రికా సొక్కంపూస కాదు. ఏదో ఒక పార్టీకి అంటకాగుతూనో, వత్తాసు పలుకుతూనో కోట్లు వెనకేసుకుంటున్నాయి. పత్రికా యజమానులు ఇప్పుడు వందలు, వేల కోట్ల సామ్రాజ్యాలకు అధిపతులు.
పత్రికారంగ విలువలు, ప్రమాణాలు, ఆదర్శాలు పూర్తిగా ధ్వంసమైన తరుణంలో పత్రికా స్వేచ్ఛకు ఏమైనా ప్రాసంగికత ఉందా అనేదే ప్రశ్న. విలేకరులపై మీద దాడులు జరిగినప్పుడో, పత్రికల మీద పాలకులు ఆంక్షలు ప్రయోగించినప్పుడో, హెచ్చరించినప్పుడో, బెదిరించినప్పుడో పత్రికా స్వేచ్ఛ తెరపైకి వస్తుంది.
కానీ, గత కొన్నాళ్లుగా ఈ తరహా సంఘటనలకు ప్రజాబాహుళ్యం నుంచి ఎలాంటి స్పందనలు కనిపించడం లేదు. ఏదైనా వివాదం చెలరేగిప్పుడు.. అది సదరు పత్రికా యాజమాన్యానికి సంబంధించిన విషయంగానే చూస్తున్నారే తప్ప, పత్రికరంగానికి చెందినదిగా గుర్తించడం లేదు. ఇది చాలా కీలకమైన, చర్చనీయాంశమైన మార్పు. పత్రికలు ఏ స్థాయిలో విశ్వనీయతను కోల్పోతున్నాయో చెప్పడానికి ఈ మార్పే నిదర్శనం.
ఒకప్పుడు పత్రికా విలేకరులు బెదిరింపులకో, దాడులకో, అవమానాలకో లోనైనప్పుడు సమస్త సమాజం ప్రతిస్పందించేది. ప్రత్యక్ష ఆందోళనలకు దిగేది. ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడు (ఎమ్మెస్సార్) 1995లో ఓ నక్సల్ పార్టీ అకారణ బెదిరింపులకు లోనైనప్పుడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటుచేసుకున్నాయి.
సమాజంలోని భిన్న వర్గాల వారు రోడ్డెక్కి సంఘీభావం ప్రకటించారు. ఇప్పుడలాంటి ఆందోళనలు, సంఘీభావాలు చూడలేం. పత్రికా స్వేచ్ఛ అంటే సూక్ష్మార్థంలో పాత్రికేయుల స్వేచ్ఛ. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అది కొడిగట్టుకుపోయి చాలా ఏళ్లయింది.
కొన్ని ఆధిపత్య కులాలకే పరిమితమై, వారి స్వప్రయోజనాల కొలిమిలో పత్రికా స్వేచ్ఛ అర్థం లేనిదిగా మారిపోయింది. డిజిటల్ విప్లవం మూలాన ఆధిపత్య కులాల పత్రికా నిరంకుశత్వానికి ఇప్పుడు డిజిటల్ మీడియా ప్రత్యామ్నాయంగా ఎదిగివస్తోంది.
అయితే విలువలను, ప్రమాణాలను కాపాడుకోవడం ద్వారా, లక్ష్మణరేఖలను పాటించం ద్వారా పత్రికా స్వేచ్ఛను డిజిటల్ మీడియాలో వెతుక్కోవచ్చు. దాని కోసం నిజాయితీగా పోరాడవచ్చు. ‘జర్నలిజం పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే బట్టలూడదీసి కొడతాం..’ అని పాలకులు హుంకరించినప్పుడు నిటారుగా నిలబడి నిలదీయవచ్చు. ఆధిపత్య కులాలకే పరిమితమైన ప్రెస్‌ను ప్రజల పక్షం చేయవచ్చు…
Share this Article