Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్… విశ్వనగరంలో అత్యాధునిక రవాణా!

November 13, 2026 by M S R

.

హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే ఆకాశహర్మ్యాలు, విశాలమైన రహదారులు, ఫ్లైఓవర్లు మాత్రమే ఉంటే సరిపోదు. అంతర్జాతీయ నగరాలకు దీటుగా ప్రజా రవాణా వ్యవస్థ కూడా ఉండాలి. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న ఐటీ కారిడార్లు, నిత్యం గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్న ఉద్యోగులు.. ఇవన్నీ హైదరాబాద్ ముందున్న సవాళ్లు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో వినూత్న రవాణా వ్యవస్థపై దృష్టి పెట్టింది. అదే పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT).. వ్యక్తిగత వేగవంతమైన రవాణా వ్యవస్థ. మెట్రో, ఎంఎంటీఎస్‌, ఎలక్ట్రిక్ బస్సుల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ రోడ్లపైనే కాకుండా, రోడ్లపైనుంచి ఎత్తులో నిర్మించే ప్రత్యేక మార్గాలపై డ్రైవర్‌లెస్ పాడ్ కార్లు పరుగులు తీయబోతున్నాయన్నమాట!

Ads

అసలు పాడ్ కార్లు ఎలా పనిచేస్తాయి?
పీఆర్టీ వ్యవస్థలో చిన్న చిన్న ఎలక్ట్రిక్ క్యాప్సూల్స్ ఉంటాయి. వీటిని పాడ్ కార్లు (Pod Cars) అంటారు. ఒక్కో వాహనంలో సాధారణంగా నలుగురు నుంచి ఆరుగురు ప్రయాణించవచ్చు. డ్రైవర్ ఉండడు. కంప్యూటర్ నియంత్రణ, ఆటోమేటిక్ నావిగేషన్‌తో ప్రత్యేకంగా నిర్మించిన ఎత్తైన ట్రాక్‌లపై ప్రయాణిస్తాయి.

ప్రయాణికుడు తన గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకుంటే ఆ మార్గంలో వెళ్లేలా వ్యవస్థ పనిచేస్తుంది. మెట్రో రైలులా ప్రతి స్టేషన్‌లో ఆగుతూ వెళ్లాల్సిన అవసరం ఉండదు. అందుకే వీటిని రైలు, ట్యాక్సీ మధ్యలో వచ్చిన మరో కొత్త రవాణా రూపంగా చెప్పుకోవచ్చు. ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి, టైమ్ సేవింగే కాదు, వాయు కాలుష్యానికి కూడా కళ్లెం…

prt

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ వస్తాయి?
నిన్న జరిగిన ఓ సమీక్షలో ముఖ్యమంత్రి డిసెంబరుకల్లా టెండర్లు ఖరారు చేసి, ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించాడు… కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ వరకు తొలి దశలో పీఆర్‌టీ లైన్… ఇందులో దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్ మీదుగా బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు అత్యంత రద్దీగా ఉండే మార్గం కవరవుతుంది…

గచ్చిబౌలిలోని ఐకియా సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్ నిర్మించి, అందులో పీఆర్‌టీ డిపో ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించాడు… తరువాత దశల్లో నగరంలోని ఇతర కీలక ప్రాంతాలను అనుసంధానించేలా మరో రెండు పీఆర్‌టీ కారిడార్ల ఏర్పాటు జరుగుతుంది… అవి…

* ఎల్‌బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు ఒక కారిడార్…

* అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమాక్స్ మీదుగా బేగంపేట వరకు మరో కారిడార్…

నెక్లెస్ రోడ్ ప్రాంతంలో మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయం కల్పించి, అందులో పీఆర్‌టీ డిపో నిర్మించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించాడు…

అధ్యయన అంచనాల ప్రకారం 2030 నాటికి రోజుకు 75 వేల మంది, 2040 నాటికి 96 వేల మంది, 2050 నాటికి 1.14 లక్షల మంది ఈ వ్యవస్థలో ప్రయాణించే అవకాశం ఉంది. ఇవి అంచనాలు మాత్రమే… ఎంత మంది ప్రయాణించగల పాడ్ కార్స్ అంతిమంగా ప్రవేశపెట్టాలో ఇంకా క్లారిటీ రావల్సి ఉంది… 20 మంది వరకూ ప్రయాణిస్తే అది గ్రూప్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (GRTS)… అవసరాన్ని బట్టి చిన్న పాడ్ కార్లు, పెద్ద సామర్థ్యం ఉన్న వాహనాలు రెండింటినీ ఉపయోగించే అవకాశం ఉంది…

హైదరాబాద్‌లో పీఆర్టీకి ప్రధాన కారణం మెట్రోకు చివరి మైలు అనుసంధానం (Last Mile Connectivity)… ఉదాహరణకు రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో దిగిన ఉద్యోగి తన కార్యాలయానికి వెళ్లడానికి మళ్లీ ఆటో, క్యాబ్ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. పాడ్ కార్లు అందుబాటులోకి వస్తే మెట్రో స్టేషన్ నుంచే నేరుగా కార్యాలయానికి చేరుకోవచ్చు. ప్రైవేటు వాహనాలపై ఆధారపడటం తగ్గవచ్చు.

విశ్వనగరం అంటే కేవలం ఆకాశహర్మ్యాలు కాదు!
హైదరాబాద్‌కు ఇప్పుడు అవసరమైనది ఒకదానికొకటి పోటీ పడే రవాణా వ్యవస్థలు కాదు. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ, ఎలక్ట్రిక్ బస్సులు, పాడ్ కార్లు.. అన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేసే సమగ్ర రవాణా వ్యవస్థ.

మెట్రో ప్రధాన నగర ప్రాంతాలను కలుపుతుంది. ఎంఎంటీఎస్ సుదూర ప్రాంతాల నుంచి నగరానికి చేరుస్తుంది. బస్సులు అనేక ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పిస్తాయి. పీఆర్టీ మాత్రం మెట్రో దిగిన తర్వాత ప్రయాణికుడిని గమ్యస్థానానికి చేర్చే బాధ్యత తీసుకుంటుంది….

  • ఒక్కసారి న్యూయార్క్ రవాణాను పరిశీలిస్తే… అధికశాతం పర్సనల్ కార్లే… కానీ ప్రజారవాణా కూడా కీలకమే… సిటీ పరిసరాల నుంచి వచ్చేందుకు పాథ్‌లు… మన ఎంఎంటీఎస్‌లాగా అనుకోవచ్చు, కానీ ఎక్కువగా అండర్ గ్రౌండ్… సిటీలోనే పలు ప్రాంతాలకు వెళ్లేందుకు సబ్ వేలు… మన మెట్రో టైపు… ఇవీ ప్రధానంగా అండర్ గ్రౌండ్… పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ లేదు, ఒకవేళ హైదరాబాద్ దాన్ని సమకూర్చుకుంటే ఎన్నో రద్దీ నగరాలకు ఆదర్శంగా నిలవడం ఖాయం..!!

వియత్నాం కార్లు… దీన్ని కూడా భిన్నంగా చూడాల్సిన పనిలేదు… ఊబర్, రాపిడోలకు భిన్నంగా గ్రీన్ఎస్ఎం యాప్‌తో విన్‌గ్రూప్ తన సొంత కార్లనే డ్రైవర్లను నియమించుకుని క్యాబ్ సర్వీస్ నడిపిస్తుంది… రేట్ తక్కువ, ఎలక్ట్రిక్ వాహనాలు, కొత్తవి కాబట్టి కాలుష్యానికి కళ్లెం… ఛార్జింగ్, నిర్వహణ, వాహనాల నాణ్యత, ప్రయాణికుల భద్రత అంతా కంపెనీదే… కాలుష్య రహిత హైదరాబాద్ దిశలో ఇదీ అవసరమే… కాకపోతే ప్రాథమికంగా కొన్ని సమస్యలు వస్తాయి… సహజమే కదా…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్… విశ్వనగరంలో అత్యాధునిక రవాణా!
  • ఆ ఒక్కడి ఆ బలహీనత- చైనా హానీట్రాప్- కుప్పకూలిన ‘బ్లూచిప్’…
  • G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!
  • పాపం రెహమాన్ ! కచేరీలకు ఆదరణ కరువు ! చుట్టూ బోలెడు నెగెటివిటీ !!
  • Overhauling Telangana’s Schooling: A Bold Step Toward Educational Equity
  • పాఠశాల విద్య సంస్కరణలు- బీఆర్ఎస్‌కు చేతకానిది, రేవంత్ సంకల్పించినది!
  • 3200 కోట్ల మంది హిందూ దేవతలట… మమత పార్టీ ఎంపీ పిచ్చి కూతలు!!
  • పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!
  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?
  • పక్కా అర్హుడు! ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి ఆశించి ఉంటే తప్పేముంది…!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions