అప్పట్లో ఓ సినిమా వచ్చింది… కృష్ణంరాజు హీరో కావచ్చు… పెళ్లంటే పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ.. మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. అని ఓ పాట అందులో… సూపర్ హిట్ పాట… ఇవన్నీ ఉంటేనే పెళ్లి జరిగినట్టా..? గత అక్టోబరులో అలహాబాద్ హైకోర్టు తీర్పు అదే చెప్పింది దాదాపుగా… ఇప్పుడు సుప్రీంకోర్టూ చెప్పింది తాజాగా…
కోర్టు ఏమన్నదంటే..? ‘‘పెళ్లి అనేది ఓ పవిత్రబంధం… కేవలం పెళ్లి రిజిస్ట్రేషన్ జరిగినంత మాత్రాన సరిపోదు, అది రుజువు మాత్రమే, కానీ సంప్రదాయ పెళ్లి తంతు జరిగితేనే ఆ పెళ్లికి చట్టబద్ధత… వీసాల కోసం పెళ్లిళ్లు జరిగినట్టు సర్టిఫికెట్లు చూపిస్తున్న జంటలూ ఉంటున్నాయి…
సప్తపది వంటి మతకర్మను నిర్వహిస్తేనే పెళ్లి జరిగినట్టు… అంతే తప్ప కట్నకానుకల బేరాలు, ఒత్తిళ్లు, వైనింగ్, డైనింగ్, ఆట-పాట వంటి సోషల్ గ్యాదరింగ్ కాదు, పెళ్లి అంటే ఒక జంట ఒక కుటుంబంగా ఏర్పడటం, వాళ్ల బంధానికి సామాజిక గుర్తింపు… ఒక జీవితకాలపు సాహచర్యానికి అది పునాది… ఇదేమీ వాణిజ్యపరమైన లావాదేవీ కాదు…’’
Ads
నిజమే… పెళ్లి ప్రాముఖ్యం, విలువ, ఆ తంతుకు ఉన్న ప్రాధాన్యతలపై హిందూ వివాహ చట్టం ఏం చెబుతున్నదో సుప్రీంకోర్టు కాస్త లోతుగానే చెప్పింది… కేవలం పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకున్నంతమాత్రాన అది పెళ్లి అయిపోదు, పెళ్లి తంతు నిర్వహించబడితేనే ఆ పెళ్లికి చట్టబద్ధత ఉంటుందనీ స్పష్టం చేసింది…
సరే, ఏవో నిర్దిష్టమైన కేసు స్వభావాన్ని బట్టి ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు గానీ… నిజానికి హిందూ వివాహం అంటే ఇదీ అని నిర్దిష్టంగా నిర్వచించబడదు… ఉదాహరణకు సప్తపది… హిందూ కుటుంబాల్లోనే చాలా కులాల్లో, చాలా ప్రాంతాల్లో ఈ తంతు ఉండదు…
మన దేశంలో ప్రాంతాల్ని బట్టి, కులాల్ని బట్టి, కులాల్లోనూ ఆనవాయితీలను బట్టి, కుటుంబాల అభిరుచులను బట్టి, శాఖా బేధాలను బట్టి రకరకాల తంతు ఉంటుంది… హిందూ పెళ్లి తంతుకు ఏకసూత్రత ఏమీ ఉండదు… పైగా పెళ్లి తంతు జరిగితేనే పెళ్లి అంటే ఎలా..? మారుతున్న కాలంతోపాటు పెళ్లిని చూసే కోణాలు మారుతున్నాయి… పెళ్లిళ్లే మారుతున్నయ్…
నిజానికి ఏడడుగులు వేస్తేనే పెళ్లా..? మరి స్టేజ్ మ్యారేజీలు, రిజిష్టర్ మ్యారేజీలు, సింపుల్ దండల పెళ్లిళ్లు, సహజీవనాలు, గుళ్లల్లో, ఆర్యసమాజ్‌ల్లో జరిగే పెళ్లిళ్ల మాటేమిటి..? అవి పెళ్లిళ్ల జాబితాలోకి రావా..? వాళ్లు భార్యాభర్తలుగా పరిగణించబడరా..? సర్టిఫికెట్ల కోసం, ఇతరత్రా అవసరాల కోసం నమోదు కాబడే పెళ్లిళ్లను పక్కన పెడితే… సుప్రీం తీర్పు ఇంకాస్త లిబరల్‌గా ఉంటే బాగుండు అనిపించింది…
పెళ్లి తంతులో ఏడడుగులే కాదు… కాళ్లకు మెట్టెలు తొడగడం, పాదాలు తొక్కడం, జిలకర బెల్లం పెట్టడం, పుస్తె కట్టడం, దండలు వేసుకోవడం, అప్పగింతలు, అరుంధతీ దర్శనం దాకా చాలా తంతు ఉంటుంది… అవి కూడా కులాన్ని బట్టి, ఏరియాను బట్టి, ఆయా కుటుంబాల సంప్రదాయాల్ని బట్టి వేర్వేరుగా కూడా ఉంటాయి… తెలంగాణ పెళ్లిళ్లు అయితే వడిబియ్యం కూడా ప్రధానమైందే..!
Share this Article