.
Mohammed Rafee ….. కీర్తి కోరుతున్న న్యాయం ఏమిటి? – ముగిసిన వినుత కోట రాజకీయ జీవితం…
రాయుడు చెల్లెలు కీర్తి నిన్న మీడియాతో మాట్లాడటం చూశాను! చాలా ఆసక్తికరంగా ఉంది వినుత కోట ఇష్యూ! ఆమెకు డ్రైవర్ శ్రీనివాసులుకు అక్రమ సంబంధం ఉందని, అది భర్తకు తెలిసాక ప్లేట్ ఫిరాయించి చంపేశారని మీడియా కోడె దూడ అయి “మేసింది”! ఏవేవో రాసుకొచ్చింది…
Ads
శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సైతమ్ హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి స్మెల్ వచ్చేలా ఇండైరెక్ట్ గా మాట్లాడి వదిలేసారు! ఇవాళ శ్రీనివాసులు చెల్లెలు కీర్తి మాటలు విన్నాక ఆసక్తిగా అనిపించి పరిశోధన ప్రారంభిస్తే అనేక విషయాలు తెలిశాయి!
ఈ హత్య వెనుక పెద్ద శక్తులేమి లేవు! కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు, మరో ముగ్గురు సహచరుల సహాయంతో రాయుడును లేపేశారు! దొరికిపోయారు! నేరం అంగీకరించారు! అది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దెబ్బ రాకుండా ఉండేందుకు తీసుకున్న కొంత అతి జాగ్రత్త, కొంత నిర్లక్ష్యం కారణంగా రాయుడు బలి అయ్యాడనేది వాస్తవం!
రాయుడు చేసింది తప్పే! అతనేం అమాయకుడు కాదు! క్లీన్ చిట్ ఇవ్వడం లేదు! కానీ, పేదరికంలోంచి బయటపడాలనే చిన్ని ఆశ అతన్ని తప్పు చేయించింది! ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి వినుత కోట సమాచారం అందిస్తూ దొరికిపోయాడు! ఆమె బెడ్ రూమ్ లో చూడకూడని సన్నివేశాలు రికార్డ్ చేసి వాటిని ఏం చేసాడో తెలియదు!
కానీ, నాలుగు నెలల క్రితం పట్టుబడ్డాడు! వినుత, ఆమె భర్త చంద్రబాబు అతన్ని పరిశీలించడం మొదలుపెట్టారు! అతను వినుత వ్యతిరేక వర్గం దగ్గర డబ్బులు తీసుకుని వీరి గుట్టును ఎప్పటికప్పుడు తెలియచేస్తూ వచ్చాడు!
- నాలుగు నెలల క్రితమే జనసేన నేతగా వినుత కోట పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినట్లు విశ్వసనీయ సమాచారం! ప్రభుత్వానికి ఇబ్బంది రాకుండా ఉండాలి, ఇందులో టిడిపి ఎమ్మెల్యే పాత్ర ఉంది కాబట్టి జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పి ఆయన పంపించారట!
“మీరు ఇస్తున్న ఐదు వేల జీతం సరిపోక తప్పుడు పని చేస్తున్న” అని శ్రీనివాసులు చెప్పడంతో మార్చి నెలలో అతని జీతానికి అదనంగా మరో నాలుగు వేలు పెంచారు వినుత కోట! అయినా అతని ఆగడాలు ఆగలేదు! బెడ్ రూమ్ లో రికార్డింగులు ఆగలేదు! ఎప్పటికప్పుడు వారు తీసుకునే నిర్ణయాలు, వారి ఉనికి దినచర్యను ఎదుటి వర్గానికి చేరవేస్తూ వచ్చాడు! చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నాడు!
శ్రీనివాసులు అలియాస్ రాయుడు ఒక పేద కుటుంబానికి చెందిన వాడు! తలిదండ్రులు ఇద్దరూ తన చిన్నప్పుడే చనిపోయారు! చెల్లెలు కీర్తిని, శ్రీనివాసులును మేనమామ, అమ్మమ్మ పెంచారు. శ్రీనివాసులు ఐటిఐ చదివాడు! పవన్ కళ్యాణ్ కు పరమ వీర చక్రలాంటి అతి భయంకర అభిమాని! జనసేన అని చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్న వీరాభిమాని!
కేవలం పవన్ కల్యాణ్ ను దగ్గరగా చూడొచ్చు అనే ఒకే ఒక్క ఆశతో డ్రైవింగ్ నేర్చుకుని కేవలం ఐదు వేల రూపాయల జీతానికి వినుత కోట కారుకు డ్రైవర్ గా చేరాడు! ఇతని మంచితనం గుర్తించి అతనికి ఇంట్లోనే ఆశ్రయం కల్పించారు. ఎంతగా అంటే తన చేతిపై “వినుత అక్క” అని పచ్చ బొట్టు పొడిపించుకునేంత! రాఖీ పండుగ వస్తే వినుతతో మొదట రాఖీ కట్టించుకుని ఆ తరువాత చెల్లెలు కీర్తితో రాఖీ కట్టించుకునేంత అభిమానం!
వినుత చంద్రబాబులది ప్రేమ వివాహం. చంద్రబాబు కమ్మ వర్గం, వినుత కాపు వర్గం! ఇద్దరూ బిటెక్ చేశారు. పెళ్ళి చేసుకున్నాక మెక్సికో వెళ్లి ఉద్యోగాలు చేశారు. 2018లో ఇద్దరూ తిరిగి వచ్చి శ్రీకాళహస్తి లో సేవా కార్యక్రమాలు చేపట్టారు. జనసేన పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా వినుత కు హామీ లభించింది. కొంత పొలం అమ్మి భారీగా ఖర్చు చేస్తూ వచ్చారు!
కూటమి పొత్తులో భాగంగా ఆ సీటు టిడిపికి వెళ్ళింది! మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పోటీ చేశారు, గెలిచారు! 2029లో శ్రీకాళహస్తి జనసేనకు కేటాయించాలని ఒప్పందం కుదిరింది! అక్కడే వివాదం రాజుకుంది!
ఎలాగైనా వినుత కోటను పక్కకు జరిపితే మళ్ళీ సీటు టిడిపికే ఉండాలని ఆ వర్గం నిర్ణయించుకుని ఎత్తులు ఫై ఎత్తులు వేసి మొత్తానికి డ్రైవర్ శ్రీనివాసులు ద్వారా వినుత కోటను తొక్కేసే ప్రయత్నం, కుట్రలో భాగమే… చివరకు శ్రీనివాసులు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి! కానీ, అతని మరణంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పాత్ర ప్రత్యక్షంగా లేదు! కోట వినుత దంపతుల ద్వారా చంపబడ్డాడు!
- ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని పవన్ కళ్యాణ్ అప్పట్లో వినుత ఫిర్యాదును పక్కన పెట్టకుండా ఉండి ఉంటే ఈపాటికి డ్రైవర్ శ్రీనివాసులు ప్రాణాలతో జైలులో వుండే వాడు!
వినుత ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురైంది! ఆమె రాజకీయ జీవితం ముగిసిపోయింది! అంతే, విధి చాలా విచిత్రంగా ఆడిస్తుంది! ఎన్నో ఆశలతో విదేశీ ఉద్యోగాలు వదలి, ఎంతో ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తూ, జనసేన లో ఒక గ్యారంటీ నేతగా గుర్తింపు పొంది చివరకు జీరో కావడం అంటే ఇదే!
సరే, ఈ కేసు ఇప్పుడు ఇంకో దారి పట్టింది! ఫిర్యాదు చేయకుండా ఉండేందుకు, అన్న చావును పట్టించుకోకుండా ఉండేందుకు కీర్తికి 30 లక్షలు ఇస్తామని ఎవరో ఆశ పెట్టారని ఆ అమ్మాయి చెబుతోంది! ఎవరు ఏ వర్గం నుంచి ఈ ఆఫర్ వచ్చినట్లు? సుధీర్ రెడ్డి వర్గమా? వినుత వర్గమా? తెలియాల్సి వుంది!
ఇప్పుడు ఆ అమ్మాయి న్యాయం కావాలని కోరుతోంది! ఆ అమ్మాయి కోరుతున్న న్యాయం ఏమిటి? పవన్ కళ్యాణ్ అప్పోయింట్మెంట్ అడుగుతోంది! చిన్న వాటికే స్పందించే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తోంది! జనసేన వీరాభిమాని హత్యకు గురైతే స్పందించరా అని అడుగుతోంది! మీరు మీరు రాజకీయంగా ఏమైనా చేసుకోండి, మధ్యలో మా అన్న ను బలి చేయడం ఏమిటి అని అడుగుతోంది! న్యాయం కావాలి అంటోంది!
30 లక్షలు తిరస్కరించా అని చెబుతోంది! అంటే ఆ అమ్మాయి దృష్టిలో న్యాయం అంటే ఏమిటి? అన్నను చంపిన వారిని ఉరి తీయడమా? హత్యకు ప్రేరేపించిన వారికి యావజ్జీవ జైలు జీవితమా? లేదా తన కుటుంబం బాగుపడటానికి కోటి రూపాయల నష్ట పరిహారం, ఉండటానికి పక్కా ఇల్లు కావాలనుకుంటుందా? ఆ అమ్మాయి కోరుతున్న న్యాయం ఏమిటనేది త్వరలో తెలుస్తుంది!…. – డా. మహ్మద్ రఫీ
Share this Article