ఒక కేసు… ఉత్తరప్రదేశ్‌లోని బరేలి… బరాదరి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మహిళ తన కూతురిపై అత్యాచారం జరిగిందని 2019, డిసెంబరులో ఫిర్యాదు చేసింది… కూతురి వయస్సు 15 ఏళ్లు… అజయ్ అలియాస్ రాఘవ్ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లి, మత్తుపదార్థాలు ఇచ్చి అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు సారాంశం…
దీనిపై కేసు పెట్టారు పోలీసులు, అమ్మాయిని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, అత్యాచారం నిజమేనని అమ్మాయి వాంగ్మూలం ఇచ్చింది… విచారణ సా-గు-తూ-నే ఉంది… సదరు నిందితుడు నాలుగున్నరేళ్లు విచారణ ఖైదీగా జైలులోనే ఉంటున్నాడు… బెయిల్ లేదు… అసలే మైనర్‌పై అత్యాచారం కేసు కదా…
రీసెంటుగా కోర్టులో ఎట్టకేలకు మళ్లీ విచారణ… అత్యాచారంపై తన మొదటి వాంగ్మూలం తప్పని న్యాయమూర్తి ఎదుట అంగీకరించింది ఆ అమ్మాయి… దీంతో అదనపు సెషన్స్ న్యాయస్థానం నిందితుడు అజయ్‌ను నిర్దోషిగా ప్రకటించింది… ఇక్కడ ట్విస్టు ఏమిటంటే… తప్పుడు కేసు పెట్టిన ఆ అమ్మాయి తల్లిపై కేసు పెట్టాలని ఆదేశించింది కోర్టు… అదీ ఈ కేసులో ఇంట్రస్టింగ్ పాయింట్…
Ads
340 సెక్షన్ కింద కేసు పెట్టడమే కాదు, ఒక వ్యక్తి 1653 రోజులు అన్యాయంగా, అక్రమంగా జైలులో ఉండటానికి కారణమైన ఆమె కూడా తిరిగి అన్ని రోజులూ జైలులో గడపాలని న్యాయమూర్తి ఆదేశించారు… 6 లక్షల వరకూ జరిమానా కూడా వేశారు… జరిమానా చెల్లించకపోతే మరో 6 నెలల జైలు అదనం…
ఇదీ కేసు… స్థూలంగా చూస్తే మనకూ కోపం వస్తుంది, నిజమే కదా, తప్పుడు కేసు పెట్టిన ఆమె కూడా అన్నిరోజులు జైలులో గడిపితే గానీ బుద్ధిరాదు, అదే ఆమెకు అసలు శిక్ష అనిపిస్తుంది కదా… న్యాయమూర్తి తీర్పులో సిసలైన న్యాయం ఉన్నట్టే అనిపిస్తుంది కదా… ఎస్, కరెక్ట్… ఆహ్వానిద్దాం…
అయితే సదరు యువకుడికి జరిగిన నష్టం పూడేదెలా..? అన్యాయమైన కేసు, అన్నేళ్లు జైలువాసం… సొసైటీలో చెడ్డ పేరు… రేప్పొద్దున కొలువులకు, చదువులకు ప్రతిబంధకం… తను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం ఎలా..? తనకు నిజంగా న్యాయం దక్కినట్టేనా..? ఈ ప్రశ్నలూ ముఖ్యమే కదా…
ఇంకా నయం, ఈ యువకుడికి నాలుగున్నరేళ్లలోనే విముక్తి దొరికింది… వేలాది మంది జైళ్లలో విచారణకు నోచుకోక మగ్గుతున్నారు… వాళ్లకు జరుగుతున్న అన్యాయం మాటేమిటి..? ఆమె ఫిర్యాదు చేయగానే, ఏ ప్రాథమిక విచారణ చేయకుండానే, ఆ యువకుడిపై కేసు పెట్టేసి, అరెస్టు చేసేసి, జైలులో పెట్టేసింది పోలీస్ యంత్రాంగం… నీ ఖర్మ, నువ్వు నిర్దోషివని నువ్వే రుజువు చేసుకో, అదెంత కాలం పడుతుందో అది నీ ఖర్మ అని వదిలేసింది… మరి దీనికి శిక్ష..?
అసలు మన సిస్టంలోనే ఏదో లోపమున్నట్టుంది కదా… దీనిపై మాత్రం చట్టాల రూపకల్పన స్థాయిలో గానీ, సొసైటీలో గానీ సీరియస్ డిబేట్ ఉండదు… మరోవైపు పరిమితిని మించి రద్దీతో, అసౌకర్యాలతో జైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి… తప్పుడు కేసులనే అంశంపైనా అపెక్స్ కోర్టు సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరమైతే కనిపిస్తోంది… అవి ఏవైనా సరే.., గృహహింస, కట్నం, అత్యాచారం, పోక్సో… ఏదైనా…!!
Share this Article