.
Veerendranath Yandamoori …… ఈ రోజు సంక్రాంతి. అప్పటిదాకా రంకెలు వేసిన చలి, తనే మూడంకె వేసి డొంకదారి పట్టే రోజు. భూదేవి కొత్త పెళ్ళికూతురైతే బంతిపూలు పసుపు. మిరపపంట కుంకుమ. సర్వాంగ భూషితయైన కొత్త పెళ్లి కూతురిలా ‘ఆమని’, తోటి పెళ్ళి కూతురు ‘కోయిల’ని తోడు తీసుకుని కుడిపాదం ముందు పెట్టటానికి తయారవుతోంది.
తొలి మొగ్గ తొడిగిన మల్లెరెమ్మ గ్రీష్మానికి స్వాగతం పలుకుతోంది. కాలాన్ని కట్టేసి నిదురోయిన సెలయేటిని పల్లె పడుచులు కడవలతో తట్టి లేపుతున్నారు. వెన్నెల్ని పక్కేసి నిదురోయిన ప్రకృతిని, సూరీడు ప్రత్యూష కిరణాలతో కొంటెగా కవ్విస్తూన్నాడు. గరిక పోచలమీద రాత్రి తాలూకు నీటి చుక్కలు మంచిముత్యాల్లా మెరుస్తున్నాయి. సంక్రాంతి అవటంవల్ల మామూలుకన్నా ఊరు తొందరగా మేల్కొంది.
ముగ్గుల మధ్యలో ముద్దుగుమ్మలు ముద్దబంతులనీ, పూబంతులు చామంతులనీ అమరుస్తున్నారు. పిల్లలు గొబ్బెమ్మలను గుమ్మడి పూలతో అలంకరిస్తున్నారు. ఆడపిల్లలు పోటీపడి వేసిన ముగ్గులు వీధిలోకి వ్యాపించి ఉన్నాయి.
Ads
గోవుపేడతో చేసిన గొబ్బిళ్ళ మీద అందంగా పసుపుబొట్టు పెట్టి, కూర కొనలూ, తంగేడు పూలూ సర్ది, వాటిపై రేగుపళ్ళు పోశారు., పరికిణీ గలగలలు వెనుక వాద్య సంగీతాలుగా శబ్దం చేస్తూంటే పదారేళ్ళ పడుచుపిల్లలు ”సుబ్బీ గొబ్బెమ్మా సుబ్బణ్ణివ్వావే… తామర పువ్వంటి తమ్ముణ్ణివ్వావే… చామంతి పువ్వంటి చెల్లెల్నివ్వావే,” అంటూ లయబద్ధంగా తిరుగుతూ పాడుతున్నారు.
మనసులో అసలు పాట అది కాదట. ముసి ముసి నవ్వుల్తో రవ్వంత కంఠం తగ్గించి లోలోపల పాడే పాట వేరే ఇంకొకటట. పండక్కొచ్చిన కూతుళ్ళూ అల్లుళ్ళకీ, నిద్ర లేచి పక్కమీద నుంచి ఇంకా లేవని నాన్నకీ, మొత్తం ఇంటిల్లిపాది కోసం తెల్లారే లేచి వంట మొదలుపెట్టిన అమ్మకీ వినపడకుండా, తమలో తామే మోచేత్తో పొడుచుకుంటూ గుసగుస నవ్వుల మధ్య పాడే అసలు పాట ‘మొగలి పువ్వంటి మొగుణ్ణివ్వావే… గుమ్మడి పువ్వంటి కొడుకునివ్వావే’ అట. అదట అసలు కోరిక.
గొబ్బి అన్న వ్యావహారికం ‘గోపి’ అనే సంస్కృత పదం నుంచి వచ్చినది. గొబ్బెమ్మ సాక్షాత్తూ గౌరీ స్వరూపo. ‘లోకజనని’ అని కూడా పిలుస్తారు. గొబ్బిని ఆవుపేడతో మాత్రమే చేయాలి. పసుపు కుంకుమలతో, రంగురంగుల పూరేకులతో అలంకరించిన ఈ గొబ్బెమ్మలను, కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలుగా పరిగణిస్తారు. మధ్యలో ఉంచే గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. పాడుతూ చుట్టూ తిరిగే బాలికలంతా కృష్ణతత్వం అలవడాలని ప్రార్థించే భక్తురాండ్రు.
ఊరికి ఇట్నుంచి బుడబుక్కలవాడు ఢమరుకాన్నీ, అట్నుంచి జంగందేవర గంటనీ పట్టుకుని బయల్దేరారు. అన్నాళ్ళూ ఏమయ్యారో గానీ ఒకపక్క బాలసంతువాడు, మరోపక్క పెద్దమ్మలవాడు కూడా దర్శనమిస్తున్నారు. పెద్దెద్దువాడు బక్కచిక్కిన గంగిరెద్దుకి వీలైనంతలో అలంకరణ చేసి ఇంటింటి ముందూ ఆపి నమస్కారం చేయిస్తున్నాడు.
బుడబుక్కలవారు వృత్తిరీత్యా కాటికాపర్లు. ఉత్తరదిక్కు నుంచి ఊరిలోకి ప్రవేశిస్తున్నారు. దక్షిణం నుంచి జంగం దేవరలు రంగప్రవేశానికి అంగలేస్తున్నారు. కోసెడు దూరం నుంచీ హరిదాసు కీర్తన వినిపిస్తూంది. పక్కూళ్ళో జరిగే కోడి పందేలకి కుర్రకారు అప్పుడే బయల్దేరుతున్నారు.
మరో నాలుగు రోజులు పోతే… కళ్ళాపి జల్లిన వాకిళ్ళు, ముగ్గులేసిన ముంగిళ్ళు, చిగురుబోడులు పెట్టిన గొబ్బిళ్ళు. ముద్దరాళ్ళు అమర్చిన ముద్దబంతులు, గంగిరెద్దు మేళాలు, పగటి వేషగాళ్లు, హరిదాసు ప్రవచనాలు, కొమ్ముదాసర్ల ప్రహసనాలు గతమై… నిర్మానుష్యమైన రోడ్ల మీద వాడిపోయిన చేమంతులూ, వెలిసిపోయిన రంగవల్లులూ..! పాతికేళ్ళు నట్టింట్లో తిరిగిన కూతురు పెళ్ళయి అత్తారింటికి వెళ్ళిపోగానే బోసిపోయిన ఇల్లులా ఉంటుంది వీధి. అప్పగింతల తంతు ముగిసి అప్పుల లెక్కలు వేసుకుంటున్న ఆడపెళ్ళివారి ఇల్లులా నిస్తేజమై పోతుంది ఊరు.
అంతే కదా జీవితం. బాల్యం బొమ్మలకొలువు భోగి. యవ్వనం రంగుముగ్గుల సంక్రాంతి. వృద్ధాప్యo ఎండుటాకుల గ్రీష్మం. అయినా వర్తమానాన్ని ఆనందించటమే జీవితం.
”సంక్రాంతిలో విశేషమేమీ లేదు. మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించటంలోనూ విశేషమేమీ లేదు. కానీ కాసిని తిండిగింజలకోసం చెట్టుకొక పక్షిగా వెళ్ళిన కొడుకులూ ఆడపిల్లలయిన ఈడపిల్లలూ, వాళ్ళ కొడుకులూ అందరూ కలవటంలో విశేషం ఉంది. అదీ పండగంటే!
ఒక పండగ వెళ్ళగానే మరో పండగ కోసం ఎదురు చూడటంలో తృప్తి ఉంది. అదే లేకపోతే రోజులు నిస్సారంగా, మనకీ, పశువులకీ తేడా లేకుండా గడిచిపోతాయి. ‘మనిషి బ్రతుకే ఒక పండగ’ అని నిరూపించటం కోసమే పండుగ”…. సంక్రాంతి శుభాకాంక్షలు…..
Share this Article