.
బొగ్గు కొన్ని వేల, లక్షల ఏళ్ళు భూమి పొరల్లో రూపాంతరం చెందితే వజ్రమవుతుందని ఒక నమ్మకం అనాదిగా ఉంది. వజ్రంలో ఉన్న కర్బన పదార్థం బొగ్గులో ఉన్న కర్బన పదార్ధం ఒకటి కాదని శాస్త్రవేత్తల వివరణ. అయినా తులం బంగారమే లక్ష దాటినవేళ వజ్రాల విలువ, తయారీ గురించి మనకెందుకు?
అందుకే భూమిలో దొరికే సహజమైన వజ్రాలను వదిలి కృత్రిమంగా ప్రయోగశాలల్లో తయారుచేసిన “ల్యాబ్ గ్రోన్ డైమండ్స్” వెంట పడుతున్నాం. కంచు మోగునట్లు కనకంబు మోగునా? మోగదు. అలాగే అసలు సిసలు వజ్రం కంటే ల్యాబ్ గ్రోన్ వజ్రం మెరుపు రెండాకులు ఎక్కువే!
Ads
ఆర్టిఫిషియల్ డైమండ్స్ లేదా ల్యాబ్ మేడ్ డైమండ్స్ అని వీటికి పేరు పెట్టి ఉంటే ఏ బాధా ఉండేది కాదు. ల్యాబ్ గ్రోన్ అనేసరికి నగల దుకాణాల వాళ్ళకు తెలుగులోకి తర్జుమా చేయడంలో వచ్చింది చిక్కు. వజ్రాన్నయినా వజ్రంతో కోయవచ్చుకానీ…ఈ అనువాదాన్ని మాత్రం ఏ వజ్రంతోను కోయలేము.
బహుశా వజ్రానికి నోరు ఉండదు, భాషతో పనిలేదు కాబట్టి గుడ్డి గూగుల్ మిక్సీలో వేసి అనువధించినట్లున్నారు. దాంతో అది “ల్యాబ్ పెరిగిన వజ్రాల ఆభరణాలు” అయ్యింది.
చదవడానికి, వినడానికి ఇబ్బందిగా ఉన్నా…ల్యాబ్ గ్రోన్ విడి విడి మాటలను పరిగణనలోకి తీసుకుంటే “ల్యాబ్ పెరిగిన” అయ్యిందనుకోవాలి. ఎన్నెన్నో రాయకుడని, చదవకూడని బూతులను అంగీకరిస్తున్నాం. వాటితో పోలిస్తే ల్యాబ్ తనంతట తనే పెరిగి వజ్రమైన ఈ అమూల్యమైన కృత్రిమ అనువాద వజ్రభాషను వజ్రసంకల్పంతో పెద్ద మనసుతో అంగీకరించవచ్చు!
“ఎలెవె” అన్న ఆ నగల దుకాణం పేరుకు వ్యుత్పత్తి అర్థాలు వెతుక్కోకుండా కలం పట్టిన ప్రతివాడూ కవి అయి తెలుగులో అంత్యప్రాసల అంతు చూస్తూ…
“ఎలెవె!
ఓ ఎలెవే!
పోనీలేవే!
ఏవీ లేవే!
లేనే లేవే!
రానే రావే!
వస్తే పోవే!
పోతే రావే!
గో గో అవే!”
లాంటివి రాసి ఈ ల్యాబ్ పెరిగిన దుకాణం మెడలో ఆశుకవితాక్షర వజ్రాల హారంగా అలంకరించవచ్చు!
పాపం సవర్ణదీర్ఘ సంధి:-
సవర్ణదీర్ఘసంధి సంస్కృతానిది. ఏది తెలుగో, ఏది సంస్కృతమో తెలియనంతగా పెనవేసుకుపోయి ఉంటాయి కాబట్టి ఆ చర్చ ఇక్కడ అనవసరం. అత్యంత సరళమైనది, సులభమైనది, సహజమైనది సవర్ణదీర్ఘసంధి.
అలాంటి సవర్ణదీర్ఘసంధికి ఇలాంటి చెప్పుకోలేని కష్టం వస్తుందని సంస్కృత వ్యాకరణం రాసి పెట్టిన పాణిని కానీ, తెలుగుకు వ్యాకరణదీపం చిన్నదే అయినా చాలా పెద్ద బాలవ్యాకరణం రాసి పెట్టిన పరవస్తు చిన్నయసూరి కలలో కూడా అనుకుని ఉండరు!
సవర్ణదీర్ఘ సంధి సూత్రం?
“ఓక పేద కుటుంబానికి చెందిన సువర్ణ అనే అమ్మాయికి దీర్ఘకాలిక వ్యాధి అయిన డయాబెటిక్స్ తో బాధపడుతూ ఉండేది. వాళ్ళ నాన్న తాగుబోతు అవ్వడంతో వైద్యానికి డబ్బులు లేక, వాళ్ళ ఇంటిపక్క సంధులో ఉన్న ఒక ముసలావిడ సహాయంతో ఆ వ్యాదికి మందును కనిపెట్టింది. అప్పటినుండి ఆ సంధుని సువర్ణదీర్ఘ సందు అని పిలిచేవారు. కాలక్రమేన అది సవర్ణదీర్ఘసంధిగా మారింది”
తెలుగు పరీక్షలో ఒక ఉన్నతపాఠశాల విద్యార్ధి రాసిన సమాధానంగా ఇది వైరల్ గా తిరుగుతోంది. నిజంగా జరిగిందో లేక సోషల్ మీడియాలో ఎవరైనా పుట్టించి వైరల్ చేశారో తెలియదు కానీ…ఇందులో మంచీ చెడూ రెండూ ఉన్నాయి.
ఓక పేద;
సువర్ణ;
వ్యాది;
సంధులో;
కాలక్రమేన…లాంటి ఎన్నెన్నో మణిమాణిక్యాల మధ్య సువర్ణ కాస్త సవర్ణ దీర్ఘం కావడంలో ఔచిత్యం మాత్రం ఉంది!
ప్రస్తుతం తెలుగుకు కరువు కాలం. కాలక్రమంలో తేలికైన సవర్ణదీర్ఘసంధికే ఇంతటి జబ్బు చేస్తే…సంక్లిష్టమైన ఆమ్రేడిత, ద్విరుక్తటకార, అనునాసిక, గసడదవాదేశ, కర్మధారయ, పుంప్వాదేశ, టుగాగమ సంధులకు వైద్యం చేయడానికి వీలుకాని ఇంకెన్నెన్ని జబ్బులు చేస్తాయో!
ఈ సువర్ణ వాళ్ళ ఇంటిపక్కనున్న ఆ ముసలావిడ నాటు వైద్యమే ఇక అన్ని తెలుగు సంధులకు దిక్కూ మొక్కూ!!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
Share this Article