ఎన్నాళ్లుగానో ఉన్న చర్చే… చర్చిలు, మసీదులు, గురుద్వారలు, జైన గుళ్లు, ఇతర తెగల ప్రార్థనాలయాల మీద లేని ప్రభుత్వ పెత్తనం హిందూ గుళ్లు, సంస్థల మీద ఎందుకు..? గుళ్లకు ధర్మకర్తలుగా రాజకీయ నాయకులు, నామినేటెడ్ అనుచరులు దేనికి..? ఏ గుళ్లో ఏ పూజ ఎలా చేయాలో కూడా కోర్టులు ఎందుకు నిర్దేశించాలి..? ఆచారాలు, ఆగమాల మీద వాటికున్న పరిజ్ఞానం ఎంత..? అవి అకస్మాత్తుగా పీఠాలుగా ఎందుకు వ్యవహరించాలి… ఇది మరో చర్చ… సరే, ఇవెప్పుడూ ఉండేవే… పోనీ, హిందూ భక్తులు సమర్పించే విరాళాలు, దానాలు, కానుకలను జనరల్ పర్పస్ కోసం, అనగా ప్రభుత్వ సెక్యులర్ పనులకు వెచ్చించొచ్చా..? అసలు హిందూ భక్తులు ఇచ్చే డబ్బే ఆ ధర్మం కోసం వెచ్చించాలని కదా, కానీ ఈ సోకాల్డ్ సెక్యులర్ ధర్మకర్తలు, ట్రస్టు బోర్డులు, ప్రభుత్వాలు అలాగే వెచ్చిస్తున్నాయా..? ఇది మరో ప్రశ్న… మద్రాస్ హైకోర్టుకు ముందుకొచ్చిన కీలకప్రశ్న… అసలు దేశం మొత్తమ్మీద చర్చ జరుగుతున్న ప్రశ్న…
టీఆర్ రమేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ మీద విచారణ జరిగింది… ఆయన పిటిషన్ ఏమిటంటే..? ‘‘అయ్యా, సదరు స్టాలిన్ ప్రభుత్వం హిందూ మతసంస్థలు ఇచ్చిన సొమ్మును జనరల్ కాలేజీల ఏర్పాటుకు వినియోగిస్తోంది, అది అన్యాయం కదా, మీరేమంటారు’’ అని…!! హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజిబ్ బెనర్జీ మరియు జస్టిస్ ఆదికేశవుల బెంచ్ విచారించింది… ఏమిటయ్యా, ఏమిటీ సంగతి అని అడ్వొకేట్ జనరల్ షణ్ముక సుందరాన్ని అడిగింది… ఆయనేమో, అవునండీ ఎనిమిది కాలేజీలు ప్లాన్ చేశాం, నాలుగు ఓపెన్ అయ్యాయి, అడ్మిషన్లు కూడా స్టార్టయ్యాయి అని చెప్పాడు… అది ‘‘సెక్యులర్ ఫండ్ కాదు కదా, ప్రభుత్వం చేయాల్సిన పనికి హిందూ సొమ్మును ఎలా ఖర్చు చేస్తావు..?’’ అనడిగింది…
Ads
మన దేవాదాయ శాఖలాగే అక్కడ హిందూ రెలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ అని ఓ ప్రభుత్వ శాఖ ఉంది… అదే హిందూ గుళ్ల ఆదాయం తింటూ, వాటి మీదే పెత్తనం చేస్తూ, ఇంకా ఇంకా తింటూనే ఉంటుంది… ప్రభుత్వం చేయాల్సిన పనులకు కూడా హిందూ సొమ్మునే ఖర్చు చేస్తూ ఉంటుంది… స్టాలిన్ ప్రభుత్వం స్థూలంగా పేరుకు నాస్తికం… కానీ యాంటీహిందూ పోకడ… అందరికీ తెలుసు… కరడుగట్టిన హిందూ వ్యతిరేకి కరుణానిధి పార్టీ అది… దాని వారసుడు స్టాలిన్… ‘‘అబ్బే, ఇది కొత్తేమీ కాదు యువరానర్, ఉదాహరణకు కొలత్తూరులోని కపాలీశ్వర గుడి నిధుల నుంచి ఓ కాలేజీ పెట్టలేదా..? ఆల్ రెడీ నడవడం లేదా, కుట్టాలంలోని పరాశక్తి కాలేజీ ఆరు దశాబ్దాలుగా నడుస్తోంది కదా అని గుర్తు చేశాడు అడ్వొకేట్ జనరల్…
బెంచ్ ఆలోచనల్లో పడింది… ఆల్ రెడీ ఓపెన్ అయిపోయిన కాలేజీలు సరే, మిగతా నాలుగు ప్లానింగులో ఉన్న మరో నాలుగు కాలేజీల్ని కాస్త హోల్డ్‌లో పెట్టండి అని ఆదేశించింది… మరి ఓపెనైన కాలేజీల మాటేమిటి..? అడ్మిషన్లు కూడా స్టార్టయ్యాయి అంటున్నారు కదా… అందుకని ‘‘ఓ పని చేయండి, ఆ కాలేజీల్లో హిందూ మతం మీద ఓ సబ్జెక్టు పెట్టి బోధించండి’’ అని మధ్యేమార్గంగా చెప్పింది… అసలు ధర్మకర్తల మండలి కదా నిర్ణయాలు తీసుకోవాల్సింది, అడహాక్ ట్రస్టు బోర్డులు నిర్ణయాలు ఎలా తీసుకుంటాయి అనడిగింది… నో ఆన్సర్… నిజానికి పిటిషన్‌దారు అడిగిందేమిటంటే..? హిందూ భక్తుల సొమ్ము పాడుపడిన గుళ్ల జీర్ణోద్దరణ, నవీకరణ, హిందూధర్మ ప్రచారం కోసం కదా, సెక్యులర్ పనులకు ఎలా వాడతారు అని…!! అది తుది తీర్పు కోసం వేచి ఉంది ఇప్పుడు… ఇక్కడ న్యాయమూర్తులు వాడిన వాక్యం… ‘‘అది సెక్యులర్ ఫండ్ కాదు కదా…’’ దీనికి ఎవరి దగ్గర సమాధానం ఉంది… తుది తీర్పు కోసం వేచిచూద్దాం…. అవునూ… ప్రపంచంలోకెల్లా ధనికదేవుడు శ్రీవెంకటేశ్వరస్వామి నిధులు ఎలా ఖర్చువుతున్నాయబ్బా…!!!
Share this Article