కాశ్మీర్, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలయ్యాయ్… లక్షద్వీప్‌లో కేంద్ర పాలన అంటే ఏమిటో రుచిచూపించబడుతోంది… ఇప్పుడు కొత్తగా ఓ డిమాండ్… పశ్చిమ బెంగాల్‌ను రెండుగా చీల్చి, ఉత్తర ప్రాంతాన్ని, అంటే ఉత్తర బెంగాల్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనేది ఆ డిమాండ్… సహజంగానే అది బీజేపీ నుంచి వస్తోంది… ఏయ్, ఎవడ్రా ఆ డిమాండ్ చేసేది, నాలుక కోస్తా, తాటతీస్తా అని మమత అప్పుడు ఫైరయిపోతోంది… అయితే అకస్మాత్తుగా బీజేపీ ఈ పాట ఎందుకు పాడుతోంది..? వివరాల్లోకి వెళ్తే… అలిపుర్దార్ ఎంపీ జాన్ బర్ల ఈమధ్య పార్టీ ఆంతరంగిక భేటీల్లో దీన్ని ప్రస్తావిస్తున్నాడు… తనకు పార్టీ నేతలు కొందరు మద్దతు పలుకుతున్నారు… డార్జిలింగ్, కూచ్ బేహర్, జలపాయ్‌గురి, కలిమ్పొంగ్, అలిపుర్దార్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్… ఈ ఏడు జిల్లాలను కలిపి, బెంగాల్ నుంచి విడదీయాలనేది ఆ ప్రతిపాదన… నిజానికి ఆ ఎంపీ మాటల్ని మమత లైట్ తీసుకుంటే సరిపోయేది… కానీ ఆమె ఆవేశం తెలుసు కదా, విరుచుకుపడి, లేని ప్రయారిటీ ఇచ్చి, జాతీయ స్థాయిలో ఈ చర్చ జరగడానికి ఆమే కారణం అవుతోంది…
ఇలాంటి విభజన మా ఎజెండాలో లేదు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ చెబుతూనే ఉన్నాడు… ఆ ప్రాంతం నుంచి ఏడుగురు ఎంపీలున్నారు… మిగతా ఎంపీలు కూడా ఈ విభజన ప్రతిపాదన జాన్ బర్ల వ్యక్తిగత డిమాండ్ అని చెబుతున్నారు… ఐనా సరే, దీనివెనుక బీజేపీ హైకమాండ్ ఉందేమో, మొన్న ఓడిపోయినందుకు తన మీద ఇలా ప్రతీకారం తీర్చుకునే ఆలోచనలో ఉన్నారేమో అని మమత తనలోతనే సందేహపడి, భయపడి అగ్గి నిప్పయింది… నిజానికి దేశంలో అనేకచోట్ల కొత్త రాష్ట్రాల డిమాండ్లున్నయ్… వస్తూనే ఉంటయ్… అంతెందుకు, ఉత్తర ప్రదేశ్ నుంచి ఆల్రెడీ ఉత్తరాఖండ్ విడదీశారు కదా, మరో నాలుగు ముక్కలు చేసి, యోగిని జస్ట్, గోరఖ్‌పూర్‌కు పరిమితం చేయడానికి మోడీ, అమిత్ షా కుట్రలు చేస్తున్నారంటూ బోలెడు వార్తలు వచ్చినయ్ ఈమధ్య… వడ్లగింజలో బియ్యపుగింజ… ఇప్పుడు ఆ ఆలోచన లేదని బీజేపీ కుండ బద్ధలు కొట్టేసింది… అసలు ఈ బెంగాల్ కథేమిటి..?
Ads
గూర్ఖాలాండ్ డిమాండ్ చాన్నాళ్లుగా ఉన్నదే… ఆందోళనలు జరిగినయ్… ఉండీలేనట్టుండే ఓ స్వయంప్రతిపత్తి కలిగిన పాలన సంస్థను ఏర్పాటు చేసి, ఎలాగోలా ఎప్పటికప్పుడు ఆ ఉద్యమాల్ని, ఆ ఆకాంక్షల్ని తొక్కేస్తూనే ఉన్నారు… అప్పట్లో లెఫ్ట్, ఆ తరువాత మమత… ఉత్తర బెంగాల్ అభివృద్ధి సంస్థ కూడా వేరే ఏర్పాటు చేశారు… తెలంగాణలోలాగా రాజకీయ అనివార్యతను క్రియేట్ చేయలేని నాయకత్వం కారణంగా ఈ ప్రత్యేక ఆందోళనలు, ఆకాంక్షలు ఎక్కడికక్కడ తొక్కేశారు… ఇది రక్షణ రీత్యా ఇండియాకు చాలా కీలక ప్రాంతం… ఈశాన్య రాష్ట్రాలతో లింక్ కలిపే ‘చికెన్ నెక్’ ఈ ప్రాంతంలోనే… పైన మ్యాప్ చూస్తే అర్థమవుతుంది… ఇటు భూటాన్… మన మిత్రదేశమే కాబట్టి పర్లేదు, పైన చైనా ఆక్రమించిన టిబెట్ ప్రాంతం, పశ్చిమాన చైనాతో దోస్తీ పెంచుకున్న నేపాల్… సో, ఎప్పుడైనా సరే భారతీయ రక్షణ వ్యవస్థలు అలర్ట్‌గా ఉండాల్సిన ప్రాంతమిది…
దీనిపక్కనే బంగ్లాదేశ్… అక్కడి నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు వలస వస్తున్నారనీ, ఆ ప్రాంత డెమోగ్రఫిక్ చిత్రమే మారిపోతోందని, ఇది ప్రమాదకరమనీ హిందూవాదులు ఎన్నాళ్లుగానో వాదిస్తున్నారు… ఇప్పుడు అది దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఈ డిమాండ్ లేవనెత్తుతోందని వాదించేవాళ్లూ ఉన్నారు… కానీ నిజం కాదు, మొన్నటి ఎన్నికల్లోనూ బీజేపీ ఈ ఎజెండాను ప్రస్తావించలేదు… పైగా హిందూ వోట్లను పోలరైజ్ చేసుకుంటూ ముప్పయ్ దాకా ఎమ్మెల్యేలను కూడా అదే ప్రాంతం నుంచి గెలిపించుకుంది… ఆ అనుకూలత ఉన్నప్పుడు కేంద్రపాలన వైపు ఎందుకు ఆలోచిస్తుంది..? ఓవరాల్‌గా ఈ ఏడు జిల్లాలను కలిపి చూస్తే ముస్లింల జనాభా 30 శాతంలోపే… మరీ బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉండే కొన్ని పట్టణాల్లో వాళ్ల జనాభా బాగా పెరిగిపోవడం నిజమే అయినా… ఈ వలస అనేది ఎప్పుడూ ఓ సహజ పరిణామమే…
ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో మాత్రం ముస్లింల సంఖ్య 50 శాతం… అదే దక్షిణ దినాజ్పూర్లో 30 శాతంలోపే… ముస్లింలు సగభాగం దాటిన మరో జిల్లా మైదా… కానీ ప్రతిపాదిత ఉత్తర బెంగాల్లో ఆ జిల్లాను కలపడం లేదు… సో, బీజేపీ వైపు నుంచి వస్తున్న ప్రతిపాదనకు ముస్లింల సంఖ్య పెరగడం అనేది కారణం కాదు… ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ప్రత్యేక ఉద్యమాలేమీ చురుకుగా లేవు… సో, ఎవరికీ ఏ రాజకీయ లబ్ధి దక్కేది లేదు… ఐతే రక్షణ అనే కోణంలో మాత్రం ఈ ప్రాంతం కేంద్రం ఆధీనంలోనే ఉండటం శ్రేయస్కరమనే భావన ఢిల్లీవర్గాల్లో ఉన్నది… ప్రత్యేకించి దేశభద్రత కోణంలో మమత తత్వాన్ని శంకించలేకపోయినా సరే… ఆమె పాలన, రాజకీయ విధానాలతో ఆ ప్రాంతం ‘సెన్సిటివ్’గా మారిపోతుందనేది ఆ వర్గాల ఆందోళన… కానీ ఇన్నాళ్లుగా లేని ప్రమాదం ఇప్పుడే ఎందుకొస్తుంది..? ‘‘రాజకీయంగా మమతను ఏమీ చేయలేక బీజేపీ ఈ కుంపటి వెలిగిస్తున్నది’’ అనే అపప్రథకు ఈ వివాదం దారితీస్తుంది…!! మమతను కెలకడానికి, గిచ్చడానికి ఉపయోగపడుతుందేమో గానీ ఈ కొత్త చిచ్చుతో బీజేపీకి రాజకీయంగా లాభించేది కూడా ఏమీలేదు ప్రస్తుతం…!!
Share this Article