.
Nàgaràju Munnuru …….. == పాక్ పై సింధూ జలాల ఒప్పందం రద్దు ప్రభావం ==
జమ్మూకశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ను భారత్ ఊహించని దెబ్బ కొట్టిందని కొందరు అంటుంటే మరికొందరు దీనిని కంటి తుడుపు చర్యగా భావిస్తున్నారు.
Ads
ఈ నేపథ్యంలో సింధూ నదిపై పాకిస్తాన్ ఏ స్థాయిలో ఆధారపడింది.. సింధూ జలాల ఒప్పందం రద్దుతో పాక్ ఆర్థిక వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.
సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అనేది 1960 సెప్టెంబర్ 19న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన నీటి పంపక ఒప్పందం.
ఈ ఒప్పందం సింధూ నది, ఉపనదుల (జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్) జలాలను రెండు దేశాల మధ్య పంచుకోవడానికి విధి విధానాలను నిర్దేశిస్తుంది.
ఈ ఒప్పందం ప్రకారం తూర్పు దిశగా ప్రవహించే నదులు (రావి, బియాస్, సట్లెజ్) జలాలపై భారతదేశానికి పూర్తి నియంత్రణ ఉంటుంది. అలాగే పశ్చిమ దిశగా ప్రవహించే నదులు (సింధూ, జీలం, చీనాబ్) జలాలపై పాకిస్తాన్‌కు నియంత్రణ ఉంటుంది.
ఈ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం భారతదేశం సింధూ నదీ జలాల్లో కేవలం 20% మాత్రమే వినియోగించుకోగలదు, మిగిలిన 80% పాకిస్తాన్‌కు చెందుతుంది. అలాగే భారతదేశం ఈ నదులపై కొన్ని పరిమిత వినియోగ హక్కులను (సాగు, విద్యుత్ ఉత్పత్తి) కలిగి ఉంది, కానీ పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని అడ్డుకోకూడదు.
భారత్ తీసుకున్న సింధూ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం పాకిస్తాన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ దేశ వ్యవసాయం, జలవనరులు సింధూ, జీలం, చీనాబ్ నదులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి.
ముఖ్యమైన గణాంకాలు
• పాకిస్థాన్ లోని 80% వ్యవసాయం సింధూ జలాల పై ఆధారపడి ఉంది. సుమారు 16 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తూ పాకిస్థాన్ జీవనాడిగా ఉంది.
• పాకిస్థాన్ జనాభాలో సుమారు 24 కోట్ల మందికి సింధూ జలాలే తాగునీటికి ఆధారం.
• పాకిస్థాన్ లోని ముల్తాన్, లాహోర్, కరాచీ వంటి ప్రముఖ నగరాలు సింధూ జలాల నీటిపై ఆధారపడి ఉన్నాయి.
• పాకిస్థాన్ జల విద్యుత్ ఉత్పత్తిలో 24 % సింధూ, జీలం నదుల మీద నిర్మించిన జల విద్యుత్ కేంద్రాల నుండి ఉత్పత్తి అవుతుంది.
• పాకిస్థాన్ జిడిపిలో 25% వ్యవసాయ ఉత్పత్తుల నుండి సమకూరుతుండగా అందులో మెజారిటీ వాటా సింధూ పరివాహక ప్రాంతంలో సగవుతున్న గోధుమ, వరి, చెరకు, పత్తి పంటలే ఆధారం.
ఇప్పటికే భారత్ పాకిస్థాన్ లోకి ప్రవహించే నదుల నీటి ప్రవాహాన్ని మళ్ళించే డ్యాములు, కాలువలు, సొరంగ మార్గాలు నిర్మించి ఉండటం వలన తక్షణమే నీటి ప్రవాహాన్ని మళ్ళించే అవకాశం ఉంది. ఇప్పటికే తీవ్ర నీటి, ఆహార కొరతతో సతమతం అవుతున్న పాకిస్థాన్ దేశానికి సింధూ జలాల ఒప్పందం రద్దు కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తుంది.
పాకిస్థాన్ దేశంలో తీవ్ర ఆహార సంక్షోభం ఏర్పడి కోట్ల మంది ఆకలితో అలమటించడమే కాదు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది…. అసలే అది దివాలా దశలో ఉంది… అందుకే ఐక్యరాజ్యసమితి వెళ్తా, ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్తా, ప్రపంచ బ్యాంకు ఊరుకోదు వంటి శుష్క వ్యాఖ్యలు చేస్తోంది పాకిస్థాన్…
Share this Article