Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

Destiny..! ఆ ఘడియ తరుముకొస్తే ఆ శ్రీకృష్ణుడికే తప్పలేదు… మనమెంత..?!

April 8, 2025 by M S R

.

కరోనాకాలంలో చెప్పుకున్నట్టు…  ఒక సమయం వస్తుంది… ఆ టైం తరుముకొచ్చినప్పుడు… నీ హోదాలు, నీ డబ్బులు, నీ ఆస్తులు, నీ అంతస్థులు, నీ సర్కిళ్లు… ఒక్కటి, కనీసం ఒక్క హాస్పిటల్ బెడ్ ఇప్పించలేవు… కాసింత ఆక్సిజన్ ఇప్పించలేవు… ఒక్క రెమ్‌డెసివర్ ఇప్పించలేవు… అంతెందుకు స్మశానంలో ప్రశాంతంగా కాలనివ్వవు… మరీ రోజులు బాగాలేకపోతే… బంధుగణం ఎవరూ ఉండరు…

ఎవరో నలుగురు హాస్పిటల్ సిబ్బంది ‘డ్యూటీ’లాగా కాల్చేసి నిష్క్రమిస్తారు… ఎగ శ్వాస తన్నుకుంటూ ఐసీయూలో విలవిల్లాడుతూ… ‘‘ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్ ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్, నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్, రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!’’ అని ఎంత ఏడ్చినా ఎవరూ రాకపోవచ్చు…

Ads

destiny1

సో, ఒక్కటే మార్గం… గుండె దిటవు చేసుకోవడమే… జరిగేదాన్ని ఆపలేం… (Come what may… ఆఫ్టర్ ఆల్ Corona వస్తే మరణించేది కేవలం వన్ పర్సెంట్…) ఒక కార్పొరేట్ హాస్పిటల్ డైరెక్టర్ తన కుటుంబసభ్యుడికి తన హాస్పిటల్‌లో బెడ్ కోసం గంటల తరబడీ నిరీక్షించాల్సి వచ్చింది… సీఎం కార్యాలయాల నుంచి హాస్పిటళ్లకు ఒకటే ఫోన్లు, బెడ్లు కావాలి, ఆక్సిజెన్ కావాలి, రెమ్‌డెసివర్ కావాలి అంటూ… ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తన కొడుక్కి బెడ్ సంపాదించలేకపోయాడు…

మరో సీనియర్ ఐపీఎస్ ఎక్కడా దొరక్క, ఇంట్లోని ఓ గదిని ఐసీయూలా మార్పించాడు… అంతెందుకు సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రే తన సోదరుడికి బెడ్ ఇప్పించుకోలేకపోయాడు… ఇలా బొచ్చెడు ఉదాహరణలు మన చుట్టూ… కార్పొరేట్ హాస్పిటళ్ల పెద్దలు ఈ పైరవీలు, ఒత్తిళ్లు భరించలేక ఫోన్లు ఆఫ్ చేసుకుంటున్నారు… అదీ దురవస్థ… మనం ముందే అనుకున్నాం కదా… ఓ రోజు వస్తుంది, అది మనమాట ఏమాత్రం వినదు అని… అదే ఇది… డెస్టినీ…

destiny2

డెస్టినీ అంటే గుర్తొచ్చింది… నిన్న, మొన్న తెలుగు వాట్సప్ గ్రూపులలో ఓ మెసేజ్ ఒకటే చక్కర్లు కొడుతోంది… అంతటి భారీ బలగం ఉన్న దేవుడు శ్రీకృష్ణుడు చనిపోతేనే అంత్యక్రియలకు ఎవరూ దిక్కులేరు… అర్జునుడు ఒక్కడే నిర్వహించాల్సి వచ్చింది… మరి మనం ఎందుకు ఏడ్వడం… వెంట ఎవరూ లేక స్మశానానికి వెళ్లాల్సి వస్తే అది విధిలిఖితం, అంతే…

ఆ దేవుడికే తప్పలేదు కదా… ఇదీ ఆ మెసేజ్ సారాంశం… కానీ చాలామందికి సందేహం… నిజంగా కృష్ణుడికి ఆ దిక్కులేని చావు ఏమిటి..? నిజమే… భారతంలోని మౌసలపర్వం చెప్పేది ఈ కథే… మనది కాని ఓరోజు గనుక తరుముకొస్తే దేవుడు లేడు, దెయ్యం లేదు, మనిషి లేదు… అది కబళించేస్తుంది… సంక్షిప్తంగా ఆ మౌసలపర్వం చెప్పాలంటే…

mousala

ఆ రోజు వచ్చేసింది… కృష్ణుడి కొడుకు తిక్క చేష్టలతో మీ యాదవులంతా కొట్టుకుచస్తారని మునులు పెట్టిన శాపం నిజమయ్యే రోజు వచ్చేసింది… నా పరివారంలాగే నీ పరివారమూ పరస్పరం చంపుకుంటారని గాంధారి పెట్టిన శాపమూ నిజమయ్యే రోజు వచ్చింది…

ద్వారక నగరం మొత్తం మునిగిపోతుందని అశరీరవాణీ హెచ్చరించింది… సునామీ సంకేతాల్ని పసిగట్టిన బలరాముడు అరణ్యాల్లోకి వెళ్లిపోయాడు, ధ్యానంలో మునిగాడు… చెట్టు మీద కూర్చుని కాళ్లూపుతుంటే వేటగాడు లేడి అనుకుని కృష్ణుడి పాదాల్లో బాణం నాటాడు… కృష్ణుడు అవతారం చాలించాడు…

వేటగాడు పారిపోయాడు.. పార్థివదేహం ఆ తుప్పల్లోనే పడి ఉంది మూడునాలుగు రోజులపాటు… ద్వారక భవిష్యత్తు తెలిసి అర్జునుడు వచ్చేటప్పటికి వసుదేవుడు మరణిస్తాడు, ఆయన భార్యలు సహగమనం చేస్తారు… మిగతా వారందరినీ ఇంద్రప్రస్థం తీసుకుపోతాను సిద్ధంగా ఉండండి అని చెబుతాడు…

కృష్ణుడిని వెతుకుతూ వెళ్తే ఓచోట అనాథప్రేతంలా కనిపిస్తాడు… ఎందరో భార్యలు, కొడుకులు, విస్తృత పరివారం ఉన్న కృష్ణుడు అలా పడి ఉన్న తీరుకు విలపిస్తూ, అప్పటికే రోజులు గడుస్తున్నందున అక్కడే అంత్యక్రియలు చేస్తాడు అర్జునుడు…

yadavas

బలరామ కృష్ణుల భార్యలు సహా ద్వారకలోని పరివారాన్ని తీసుకుని అర్జునుడు ఇంద్రప్రస్థానికి వెళ్తుంటాడు… దారి మధ్యలో దొంగలు దాడి చేస్తారు… యాదవులంతా అప్పటికే మరణించారు… తన బలం, తన ప్రాణం అయిన కృష్ణుడు మరణించడంతో అర్జునుడు నిర్వీర్యుడయ్యాడు…

చివరకు గాండీవం కూడా ఎత్తలేని అసహాయత… దివ్యాస్త్రాలు కాదు కదా, మామూలు బాణాలూ సంధించలేక… దొంగలు దోచుకుంటుంటే కళ్లప్పగించి చూస్తుంటాడు… మహిళల్ని కూడా దొంగలు ఎత్తుకుపోతారు… మిగిలినవారితో హస్తిన చేరతాడు అర్జునుడు…

సత్యభామ అడవులకు వెళ్లిపోతుంది తపస్సు చేసుకుంటూ, అక్కడే జీవితం చాలిస్తానంటుంది… రుక్మిణి, జాంబవతి కృష్ణుడిని తలుచుకుంటూ చితి పేర్చుకుని సతీ సహగమనం చేస్తారు… సముద్ర ప్రళయానికి ద్వారక మునిగిపోతుంది… మనది కాని రోజు రావడమంటే అదే… ఆ కర్మఫలానికి అది బోధించిన కృష్ణుడు కూడా అతీతుడు కాదు… ఆఫ్టరాల్ మనమెంత..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions