వేలాది మంది పాల్గొనే ఒక ప్రోగ్రాంను సరదా జోకులు వేస్తూ, ఎవరినీ నొప్పించకుండా హోస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు… కోట్లాది మంది టీవీల ముందు కూర్చుని చూస్తుంటారు… చిన్న పొరపాటు దొర్లినా అభాసుపాలవుతుంది… అందుకే ఏ ప్రోగ్రాంకైనా మంచి వ్యాఖ్యాత కావాలని వెతుకుతుంటారు ముందుగా… మన యాంకర్ సుమ తెలుసు కదా… కొన్ని వేల షోలకు వ్యాఖ్యాత ఆమె… ఇప్పటివరకూ ఎవరినీ నొప్పించిన దాఖలాలు లేవు… పర్‌ఫెక్ట్…
అలాగే సభికులు, గెస్టుల మీదే జోకులు వేస్తూ, వారితోనే చప్పట్లు కొట్టిస్తూ, మెప్పిస్తూ, ఆనందాన్ని పంచడంలో కపిల్ శర్మ ఫేమస్… అవి ఎదుటివాడిని అవమానించేలా ఉండవు… ఫ్రెండ్లీ సెటైర్స్, పంచెస్… చాలామంది హోస్టులకు ఈ విద్య తెలియదు… ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే… ప్రతిష్ఠాత్మకంగా సాగిన ఆస్కార్ అవార్డుల వేదిక మీద ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ వ్యాఖ్యాతగా ఉన్న క్రిస్ రాక్ అనే కమెడియన్‌ను ఈడ్చి నాలుగు పీకాడు…
విల్ స్మిత్ భార్య జడా పింకెట్… ఆమె కూడా నటి… అంతకుముందు గుండుతో ఏదో సినిమాలో నటించింది… ఆమె గురించి మాట్లాడుతూ ఈ వెకిలి వ్యాఖ్యాత ‘ఓహ్, ఆ మూవీకి సీక్వెల్ చేస్తున్నవా..? నీ గుండు బాగుంది, ఐ లవ్ యూ’ అని వదిరాడు… అక్కడ వచ్చింది తేడా… నిజానికి మామూలు సందర్భంలో అయితే స్మిత్ గానీ, ఆయన భార్య జడా గానీ స్పోర్టివ్‌గా తీసుకునేవాళ్లేమో… కానీ ఆమె ఓ జబ్బుతో బాధపడుతోంది… అదేమిటంటే..?
Ads
అలోపీషియా అరియాటా… ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్… దీనివల్ల ప్యాచులుప్యాచులుగా జుట్టు రాలిపోతుంది… వేగంగా, ఎక్కువ సంఖ్యలో… స్త్రీపురుష తేడా ఏమీ లేదు, అందరికీ వస్తుంది… ఇది పెద్దగా పీడించదు, కానీ లుక్కు కూడా ముఖ్యం కదా సినిమా నటులకు… వాళ్ల బలమే అది కదా… అందుకని బాగా హర్టింగ్… చికిత్స ఉంది గానీ చాలామందికి ఫలించదు… అందుకని గుండు చేయించుకోవడమో లేదంటే జుట్టు రాలిపోయి సహజంగానే గుండు రావడమో…
ఈ నేపథ్యం బహుశా ఆ వ్యాఖ్యాతకు తెలిసి ఉండదు… కానీ విల్ స్మిత్‌కు కోపమొచ్చింది… తెలిసీ తన భార్యను వెక్కిరిస్తున్నాడని అనుకున్నాడు… అందుకే నాలుగు పీకాడు… తన కోపంలో ఆవేశంకన్నా బాధ ఉంది, తన భార్య హర్టవుతుందనే ఆవేదన ఉంది… అర్థం చేసుకోవాలి… సేమ్ టైమ్, వ్యాఖ్యాతకు గనుక ఆమె అనారోగ్యం గురించి తెలిస్తే అంత ప్రిస్టేజియస్ వేదిక మీద అలా మాటలు తూలి ఉండేవాడు కాదేమో… కానీ అదలా జరిగిపోయింది…
ఫిజికల్ అబ్యూస్‌కన్నా మెంటల్ అబ్యూస్ మనిషిని బాగా హర్ట్ చేస్తుంది… పైగా అంత పెద్ద వేదిక మీద తన జబ్బును వెక్కిరిస్తున్నాడనే ఫీలింగ్ జడాను కూడా షాక్‌కు గురిచేసి ఉంటుంది… ఐనాసరే, స్మిత్ మళ్లీ వెంటనే తేరుకుని, క్రిస్ రాక్‌కు సారీ చెప్పాడు… ఈ చెంపదెబ్బ ఎపిసోడ్ జరిగాక అరగంటకు స్మిత్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డు అందుకున్నాడు… ఎమోషన్స్ ఆపుకోలేనివాడు నటుడిగా పనికిరాడు, ఈ అవార్డుకు అర్హుడు కాడు అని కొందరు తిట్టిపోస్తున్నారు… కానీ ఆ క్షణంలో స్మిత్ చేసిన పనిలో తప్పులేదు… ఆస్కార్ అవార్డు అందుకునే అపురూప ఆనందాన్ని స్పాయిల్ చేసినందుకు సదరు వ్యాఖ్యాత మీద కోపం రావడంలో అసహజం కూడా ఏమీలేదు..!!
స్మిత్ మీద యాక్షన్ తీసుకుంటారట… అసలు వేటు పడాల్సింది ఆ హోస్ట్ పైన కదా…!!
Share this Article