బీజేపీకి అసలు బలం… హిందుత్వ కాదు, సంస్థాగత బలం కాదు… దాన్ని ద్వేషించే శక్తులే దాని అసలు బలం… లేని కిరీటాలు పెట్టి, బీజేపీకి బోలెడన్ని మహత్తులు, హక్కుల్ని ఆపాదిస్తూ… కట్టబెడుతూ… దాన్ని బలోపేతం చేస్తుంటాయి అవి…! మొన్నటికి మొన్న చూశాం కదా గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిపోయే ప్రమాదముందహో అంటూ సెక్యులర్ టీఆర్ఎస్ను, వీర సెక్యులర్ మజ్లిస్‌ను గెలిపించడానికి కంకణాలు కట్టుకుని, ప్రచారాలు చేసి, వ్యాసాలు రాసి తరించిపోయిన అతి లౌకిక మేధావులను చూశాం కదా…
నిజానికి హిందూధర్మానికి బీజేపీ ఏమైనా హక్కుదారా..? కాదు… కానీ వీళ్లంతా బీజేపీయే హిందుత్వకు హక్కుదారు అంటూ లేని హక్కుల్ని బీజేపీకి కట్టబెట్టి, దాన్ని సుసంపన్నం చేస్తుంటారు… సేమ్, అలాంటిదే మరొకటి… తమిళనాట ద్రవిడ పార్టీలన్నీ దాదాపుగా నాస్తికమే… అందులోనూ డీఎంకే మరీ కరడుగట్టిన పార్టీ… ఎక్కువగా హిందూ సంబంధ వ్యవహారాలకు విరుద్ధం, మరీ ప్రత్యేకించి ఆర్య సంబంధ భావజాలానికి వ్యతిరేకం… అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు… కానీ, అది కూడా ఈమధ్య ప్రతి అంశానికీ బీజేపీతో ముడివేస్తోంది… రాజకీయం వేరు, దాన్నీ దీన్నీ కలపొద్దు… కానీ డీఎంకే చేసేది అదే…
ఈమధ్య ప్రసారభారతి ఓ ఆదేశం జారీ చేసింది… ప్రతి దూరదర్శన్ ప్రాంతీయ కేంద్రం సాయంత్రం ఏడుంబావు నుంచి ఏడున్నర వరకు సంస్కృత న్యూస్ బులెటిన్ ప్రసారం చేయాలనేది దాని సారాంశం… ప్రాంతీయ కేంద్రాలు అంటే మన సప్తగిరి, యాదగిరి చానెళ్ల తరహా… ఇంకేముంది..? ఈమధ్య కెలకడానికి ఏమీలేవు కదా, దీన్ని పట్టేసింది డీఎంకే… నాన్సెన్స్, సంస్కృత బులెటిన్ పేరిట మాపై సంఘ్ పరివార్ ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని రుద్దే ప్రయత్నం చేస్తోంది, ఇది యాంటీ పీపుల్, యాంటీ ఫెడరలిజం, ఆ యాంటీ, ఈ యాంటీ, అంటూ బోలెడు యాంటీలను ఏకరువు పెడుతూ గగ్గోలు స్టార్ట్ చేసింది…
Ads
ఆ పార్టీ ఎంపీలు, చివరకు స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా రచ్చ రచ్చ మొదలుపెట్టేశారు… చూశారా, దేశంలో ఉన్నదే 24 వేల మంది… తమిళనాడులో ఉన్నది 803 మంది… వీళ్లకు ప్రత్యేకంగా ఓ బులెటిన్ దేనికి..? మీ ఆర్య సంస్కృతిని రుద్దుతున్నారా మామీద..? మరి మా తమిళులు దేశమంతా ఉన్నారు… ప్రతీ రాష్ట్రంలోనూ మాకు ప్రత్యేక బులెటిన్లు ప్రసారం చేస్తారా..? ఇలా మొదలుపెట్టారు…
కనీసం అయిదారుగురు కూడా చూడరు, ప్రత్యేకంగా బులెటిన్లట, రుద్దుతారట, ఊరుకునేది లేదు, మీ బీజేపీ సంస్కృతిని రుద్దకండి అని కస్సుమన్నాడు వెంపీ వెంకటేశన్… ఇది దేశ సమైక్యతకు విఘాతం అనేశాడు స్టాలిన్ అయితే… ద్యా- వుడా..?
అసలు సంస్కృతం అంటే ఒక భాష… దానికీ బీజేపీకి ఏం సంబంధం..? దాని మీద బీజేపీకి గానీ ఆర్ఎస్ఎస్కు గానీ పేటెంట్ రైట్స్ ఉన్నాయా..? అసలు సంస్కృతానికీ సంస్కృతికీ లింకేమిటి…? దానికీ హిందుత్వకూ లంకె ఏమిటి..? పైగా హిందూ ధర్మానికి బీజేపీ ఏమైనా హక్కుదారా..? మళ్లీ ఈ మాటంటే బాగుండదు సుమా, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందువులు వేరే పార్టీల్లో ఉన్నారు, లీడ్ చేస్తున్నారు… ఈ డీఎంకే బుర్రలకు తెల్వదు, మొత్తుకోదు…
అవునూ, సంస్కృత భాషను మాతృభాషగా చెబుతున్నఆఫ్టరాల్ 24 వేల మంది కోసం బులెటిన్లు దేనికి అని అడుగుతున్నారు కదా… ఆఫ్టరాల్ అయిదారుగురు కూడా చూడని బులెటిన్ దేనికి అంటున్నారు కదా… మరి ఆ ఆఫ్టరాల్ పనికిరాని అంశం మీద ఈ రచ్చ దేనికి బ్రదర్స్..? ఎవరూ చూడని ఆ చానెల్లో ఏదో ప్రసారం చేస్తే… అది ఏదో పార్టీ సంస్కృతిని రుద్దడం ఎలా అవుతుంది..? రుద్దాలని బలంగా సంకల్పం, కుట్ర గనుక ఉంటే… ట్రాయ్ ద్వారా ప్రతి న్యూస్ చానెల్ తప్పకుండా సంస్కృత బులెటిన్ ప్రసారం చేయాలని… డీఎంకే వాళ్ల సన్ టీవీ సహా… ఆదేశాలు జారీచేసేవాళ్లు కదా…!!
పొరపాటున స్టాలిన్, మమత వంటి వీర హిందుత్వ వ్యతిరేక నేతలు ఈ పిడివాదాన్ని మానేస్తే… ముందుగా బాధపడేది మోడీయే… తనకు వీళ్లే కదా అమితమైన బలం…! మోడీకి కూడా తెలియని బోలెడు పేటెంట్ రైట్స్ వెతికి మరీ కట్టబెట్టేది వాళ్లే కదా…!!
Share this Article