నిన్న చెప్పుకున్నదే కదా… విభజన సమస్యల మీద ఇలా ఇద్దరు సీఎంలు కూర్చోగానే పెద్దగా ఫలితాలు ఏమీ ఉండవని..! పైగా తెరపైకి కొత్త కొత్త అసాధ్యమైన డిమాండ్లు పుట్టుకొస్తూ సబ్జెక్టును మరింత జటిలం చేయడమే తప్ప తక్షణ పరిష్కారాలు ఏమీ ఉండవని అనుకున్నదే కదా… అదే జరిగింది…
ఏవో కమిటీలు వేస్తామని చెప్పి మమ అనిపించేశారు… శాలువాలు కప్పుకున్నారు, పటాలు బహూకరించుకున్నారు, బొకేలు సమర్పించుకున్నారు, దండాలు- ఆలింగనాలు… మొత్తానికి ఓ సుహృద్భావ భేటీ జరిగింది… ఒడిశింది… ఇదంతా సరే… ఇలాంటివి ఏం జరిగినా సరే, ఏదో రాజకీయ ప్రయోజనాల మర్మమేమిటో ఉంటుంది… ఇక్కడ ఎవరికేం ఫాయిదా..?
తెలంగాణలో ఇండి కూటమి అధికారం… ఏపీలో ఎన్డీయే కూటమి అధికారం… పార్టీలుగా ప్రత్యర్థులే అయినా ఇద్దరు సీఎంలు వ్యక్తులుగా సన్నిహితులు… మరి ఎవరేం ఫాయిదా కోరుకున్నారు..? రేవంత్‌రెడ్డి విషయానికే వద్దాం… మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అరకొర మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్, దాని పరిసర ప్రాంతాల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి…
Ads
ఈ ప్రాంతాల్లో బలాన్ని పెంచుకునే భావనతో బీఆర్ఎస్ నాయకులను పార్టీలో చేర్చుకుంటున్నారు… చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టచ్‌లోకి వచ్చారు… ఇంకా రేపోమాపో కొన్ని చేరికలుంటాయి… GHMC ఎన్నికల్లో మంచి రిజల్ట్ చూపించాలి…
కానీ మొన్నటి లోకసభ ఎన్నికల్లో గ్రేటర్, దాని పరిసరాల్లో కాంగ్రెస్ లాభపడలేదు… ఖాళీ అయిన బీఆర్ఎస్ ప్లేసుల్లోకి బీజేపీ చేరుకుంది… చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్, మెదక్ సీట్లు బీజేపీ కైవసం చేసుకుంది… ఓవరాల్‌గా బీజేపీ వోట్లు కాంగ్రెస్‌కన్నా పెరిగాయి… అది GHMC మీద కన్నేసింది…
సో, రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి రాజధాని ఏరియాలో బలాన్ని పెంచుకోవడం అవసరం… వోటు బ్యాంకు పెరగాలి… హైదరాబాద్ ఏరియాలో కమ్మ, రెడ్డి, ఇతర సెటిలర్ వోట్లు బీఆర్ఎస్ పక్షాన నిలిచాయి తప్ప కాంగ్రెస్ వైపు రాలేదు… (అసెంబ్లీ ఎన్నికల్లో)… ఈ స్థితిలో ఏపీలో అధికారంలోకి వచ్చిన తన పాత బాస్ చంద్రబాబును హైదరాబాద్ రప్పించి, సీఎంల భేటీ పేరిట ఓ హంగామా క్రియేట్ చేసి, సెటిలర్ల వోట్లను మళ్లించుకోవడం బహుశా రేవంత్ రెడ్డి ఆలోచన కావచ్చు… అది కొంతమేరకు ఫలించవచ్చు కూడా…
కానీ పేరుకు చంద్రబాబేమో ఎన్డీయే మనిషి… మరి తను తెలంగాణలో తన ప్రత్యర్థి కూటమికి ఉపయోగపడేలా వ్యవహరించగలడా..? ఒకవేళ అలా చేస్తే, హైదరాబాదులో ఇంకా బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీ ఊరుకుంటుందా..? ఇవి శేష ప్రశ్నలు… వ్యతిరేకించి బీజేపీ చేయగలిగేది కూడా ఏమీలేదు… అసలే చంద్రబాబు మద్దతు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం… కస్సుమనలేదు, సైలెంటుగా ఉండిపోవడం తప్ప ఉరిమేదీ లేదు…
పైగా చంద్రబాబు రెండు కొబ్బరిచిప్పల పాలసీయే కాదు, రెండు పడవల మీదా కాళ్లు పెట్టి ప్రయాణించగలడు… ఆమధ్య కాంగ్రెస్‌తో అంటకాగిన అనుభవమే కదా… పైగా ఇక్కడి సీఎం చాన్నాళ్లు తన క్యాంపు మనిషేనాయె… మరి చంద్రబాబుకు ఏం ఫాయిదా..? ఇప్పటికిప్పుడు తెలంగాణలో తన పార్టీకి జీవగంజి పోసేంత సీన్ ఏమీ లేదు… అలా తెలుగుదేశం బలపడితే రేవంత్ రెడ్డే ఊరుకోడు… తనకు తన పాత పార్టీ, తన పాత బాసు, తన పాత విధేయతలు కాదు, ప్రస్తుతం ఇక్కడ తన బలం, తన పొజిషన్ ముఖ్యం…
కేసీయార్ తరిమేశాడు… జగన్ కక్షకట్టాడు… జైలులో వేశాడు… అదీ మొన్న మొన్నటిదాకా చంద్రబాబు దురవస్థ… కానీ కోలుకున్నాడు, తేరుకున్నాడు, పోరాడాడు… మళ్లీ ఓ బలమైన పొజిషన్‌లోకి వచ్చేశాడు… తనకు కూడా సెటిలర్ల నుంచి సానుకూలత కావాలి… తను నివసించే హైదరాబాదులో మళ్లీ తలెత్తుకుని, గౌరవాన్ని పొందే వాతావరణం కావాలి… అది లభిస్తోంది… అంతకుమించి ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఆశించే రాజకీయ ప్రయోజనం, దక్కే ఫాయిదా ఏమీ లేవు… ఏమో, మదిలో ఇంకేమైనా ఆలోచనలు పరిభ్రమిస్తున్నాయేమో తెలియదు..!!
Share this Article