.
చరిత్రలో కొందరు తమ ప్రజల కోసం, వారి హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం తమ జీవితాలనే అర్పించారు. కానీ, ఆ పోరాటాలు, ఈ త్యాగాలు విలువ తెలియని, స్వార్థంతో కూడిన ప్రజలకు సమర్పించి ఏం లాభం? ఈ విషయంపై ఆలోచింపజేసే రెండు కథలు ఇక్కడ ఉన్నాయి.
గొర్రెల కాపరి చెప్పిన నిజం
Ads
లాటిన్ అమెరికాలో విప్లవ వీరుడుగా పేరుగాంచిన చే గువేరా పదుల సంవత్సరాల పాటు పేద ప్రజల హక్కుల కోసం పోరాడాడు. చివరకు, ఒక కుట్రలో భాగంగా ఆయన తన రహస్య స్థావరం నుండి బయటకు వెళ్తుండగా పట్టుబడ్డాడు…
ఆ స్థావరాన్ని ఒక గొర్రెల కాపరి చూపించాడని తెలియగానే, ఒక సైనికుడు ఆశ్చర్యపోయి, “నువ్వు జీవితమంతా నీ కోసం, నీ హక్కుల కోసం పోరాడిన వ్యక్తిని ఎలా అప్పగిస్తావు?” అని అడిగాడు…
దానికి ఆ గొర్రెల కాపరి చాలా ప్రశాంతంగా, “ఆయన చేసే యుద్ధాలు, పోరాటాలు నా గొర్రెలను భయపెట్టాయి” అని బదులిచ్చాడు… హాశ్చర్యం…
ఆ మాటల్లో ఎంతో లోతైన విషాదం ఉంది… ఒక వ్యక్తి తన జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసి ఒక గొప్ప లక్ష్యం కోసం పోరాడుతుంటే, ప్రజలు మాత్రం తమ స్వార్థం, రోజువారీ భయాల గురించి మాత్రమే ఆలోచిస్తారు… వారి దృష్టిలో, పోరాటం వల్ల కలిగే ప్రయోజనాల కంటే తాత్కాలిక భయాలే పెద్దవిగా అనిపిస్తాయి…
అలెగ్జాండ్రియా వీరుడు మహమ్మద్ కరీం
దీనికి ముందు ఈజిప్ట్‌లో అలెగ్జాండ్రియా ప్రజల కోసం, తమ దేశం కోసం ధైర్యంగా పోరాడిన మహమ్మద్ కరీం కథ కూడా అంతే విషాదభరితం… నెపోలియన్ సేనలు ఈజిప్ట్‌పై దాడి చేసినప్పుడు, మహమ్మద్ కరీం అలెగ్జాండ్రియా ప్రజలను ముందుండి నడిపించి, ఫ్రెంచ్ సైనికులను వీరోచితంగా ఎదుర్కొన్నాడు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన పట్టుబడ్డాడు…
ఆయనను ఉరి తీయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ, నెపోలియన్ తన సైనికులకు ఇలా చెప్పాడు: “నేను ఒక గొప్ప నాయకుడిని చంపినట్లుగా చరిత్రలో మిగిలిపోదలుచుకోలేదు. ఒకవేళ అతడు మాకు కలిగించిన నష్టాలకు పదివేల బంగారు నాణాలను చెల్లిస్తే, అతన్ని క్షమిస్తాను…”
ఆ మాటలు విన్న మహమ్మద్ కరీం నవ్వి, “నా దగ్గర అంత డబ్బు లేదు. కానీ అలెగ్జాండ్రియాలోని వర్తకులంతా నాకు లక్షకు పైగా బంగారు నాణాలను ఇవ్వాలి, ఇస్తారు… నీకు ఇస్తాను…” అని చెప్పాడు.
నెపోలియన్ ఆయనకు అవకాశం ఇచ్చాడు… సంకెళ్లతో, సైనికుల మధ్య ఆయన బజారుకు వెళ్ళాడు… తాను ప్రాణాలకు తెగించి కాపాడిన వర్తకులు తనకు సహాయం చేస్తారని ఆయన ఆశించాడు… కానీ, ఏ ఒక్క వర్తకుడూ ఆయనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు… పైగా, “నువ్వే అలెగ్జాండ్రియాకు, మా వర్తకానికి నాశనం తీసుకొచ్చావు…” అని నిందించారు…
నిరాశతో, మానసికంగా కుంగిపోయి మహమ్మద్ కరీం తిరిగి నెపోలియన్ వద్దకు వచ్చాడు… అప్పుడు నెపోలియన్ ఇలా అన్నాడు..: “నిన్ను మాపై పోరాడినందుకు నేను చంపడం లేదు.., నీ ప్రాణాలను పిరికిపందలైన ప్రజల కోసం త్యాగం చేసినందుకు చంపుతున్నాను… వీరికి స్వేచ్ఛ కంటే వ్యాపారమే ముఖ్యం…”
ఈ రెండు కథల సారాంశం ఒక్కటే… “అజ్ఞానులైన, స్వార్థ ప్రజల కోసం నిలబడే వ్యక్తి, గుడ్డివారికి దారి చూపించడానికి తన శరీరాన్ని తగలబెట్టుకున్న వాడితో సమానం…” అని తత్వవేత్త మహమ్మద్ రషీద్ రిదా చెప్పినట్లు, ప్రజలు తమ హక్కుల విలువ తెలియకపోతే ఎంత గొప్ప నాయకుల త్యాగమైనా వ్యర్థమే…
స్వార్థం, తాత్కాలిక భయాల మధ్య స్వేచ్ఛ విలువ మరుగున పడిపోతుంది… మరి మీ దృష్టిలో, ఇటువంటి ప్రజలకు నాయకులు ఏం చేయాలి..? ఇంతకీ వర్తమాన భారతీయ రాజకీయాల్లో ఏ నాయకుడికి ఈ కథ వర్తిస్తుంది..?! ఎవరికి అన్వయిస్తారో మీ ఇష్టం..!!
Share this Article