.
ముందుగా రమణ కొంటికర్ల రాసిన ఓ కథనం చదవండి… అది భారత్- పాక్ మధ్య 1965లో జరిగిన ఓ యుద్ధం కథ… అందులో పోరాడి మాయమైపోయిన ఓ వీరుడి కథ…
ఆ యుద్ధంలో అదృశ్యమై, ఏమైపోయాడో చాలాకాలంపాటు తెలియక, ఆ తర్వాత మరణించినట్టు ప్రకటించిన అజ్జమడ దేవయ్యే మనం చెప్పుకోబోతున్న ఆ మహావీర చక్ర యోధుడి కథ…
Ads
వీర్ పహారియా అజ్జమడ బి. దేవయ్యగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన బయోపిక్ స్కైఫోర్స్. అక్షయ్ కుమార్ మరో కీలకపాత్ర పోషిస్తున్నఈ బాలీవుడ్ సినిమా విడుదలైన సందర్భంలో ఓసారి ఈ గణతంత్ర దినోత్సవాన ఆ యుద్ధవీరుణ్ని గుర్తు చేసుకుందాం…
1965 ఇండో-పాక్ వైమానిక యుద్ధం!
వైమానిక యుద్ధాల్లో ఇండియా- పాకిస్థాన్ మధ్య 1965లో జరిగిన వార్ చరిత్రలో మరో చీకటి అధ్యాయం. ఇండియా- పాక్ ఈ రెండు దేశాల మధ్య అదే మొట్టమొదటి వైమానిక యుద్ధం కూడాను. 1965 సెప్టెంబర్ మాసంలో వేలాదిమంది సైనికులు ఇటు భారత్, అటు పాకిస్థాన్ లో తమ రక్షణ కోసం దాడులకు తెగబడ్డారు.
ఓవైపు యుద్ధం కొనసాగుతుండగానే ఇటు భారత్, అటు పాకిస్థాన్ రెండు దేశాలు మాదే విజయమంటే మాదేనంటూ ప్రకటించాయి. ఇద్దరూ చెప్పిన లెక్కలు సరిపోలక ఓ గందరగోళ వాతావరణాన్ని సృష్టించాయి. తాము 104 ఎయిర్ క్రాఫ్ట్స్ నాశనం చేశామని.. అలాగే, తమ సొంత యుద్ధ విమానాలు పందొమ్మిదింటిని కోల్పోయామని పాక్ ప్రకటించింది.
కానీ, అందుకు భిన్నమైన లెక్కలను భారత్ విడుదల చేసింది. 73 పాకిస్థాన్ యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్టు, తాము 35 ఎయిర్ క్రాఫ్ట్స్ కోల్పోయినట్టు భారత్ ప్రకటించింది. ఎవరికీ పూర్తిగా ప్రయోజనం లేని ఓ యుద్ధంగా.. ఎవ్వరికీ విజయం దక్కని ఓ యుద్ధంగానే ఆ వార్ ముగిసిపోయింది…
నాటి ఇండో- పాక్ వార్ కు బహుముఖ వివాదాలు కారణమయ్యాయి. సాయుధదళాల విమానాలు, అతి పెద్ద ట్యాంకర్స్ తో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన మరో భీకరయుద్ధమది. ఇరువైపులా గణనీయమైన నష్టమూ జరిగింది. దానివల్ల రాజకీయ, భౌగోళిక వివాదాలు మరింత పెరిగాయి. మొత్తంగా పాక్- భారత్ సంబంధాలు గతం కంటే దూరమయ్యేందుకు కారణమైన యుద్ధం 1965 వార్.
స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య పాత్రేంటి..? అసలాయనెవరు..?
1965 ఇండో- పాక్ యుద్ధంలో స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్యది కీలకపాత్ర. ఆ యుద్ధంలో దేవయ్య అదృశ్యమయ్యాడు. సుభాష్ చంద్రబోస్ లాగానే అదృశ్యమైపోయిన ఆయన.. బతికున్నాడా, మరణించాడా అన్నదీ తెలియని పరిస్థితి.
అలా దశాబ్దాలపాటు ఆయన ఉనికి ఓ రహస్యంగా మారింది. భారత వైమానిక దళం (INDIAN AIR FORCE) మొదట ఆయన అదృశ్యమైనట్లు నివేదించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు దేవయ్య మరణించినట్లు ప్రకటించింది. కానీ, ఆయన మరణంపై కచ్చితమైన ఆధారాలను మాత్రం చూపలేకపోయింది.
1965 యుద్ధం తాలూకు నష్టాన్ని అంచనా వేసేందుకు 1979లో బ్రిటీష్ రచయిత జాన్ ఫ్రైకర్ నేతృత్వంలో పాక్ వైమానిక దళం ఓ కమిషన్ నియమించింది. అప్పుడు ఫ్రైకర్ కమిషన్ దేవయ్య మరణించినట్టు ధృవీకరించింది. పాక్ సెంట్రల్ పంజాబ్ లోని సర్గోధ జిల్లా సమీపంలో లభించిన మృతదేహాన్ని అక్కడి గ్రామస్థులు ఖననం చేసినట్టు ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.
ఆ తర్వాతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దేవయ్య వీరమరణం చెందినట్టు ప్రకటించింది. వీరమరణం పొందిన దేవయ్యకు 1988లో భారత ప్రభుత్వం మహావీర్ చక్రను ప్రదానం చేసింది. యుద్ధం జరిగిన 23 ఏళ్ల తర్వాత మహావీర్ చక్ర పురస్కారాన్ని ఆయన భార్య స్వీకరించారు.
దేశం కోసం పోరాడి అసువులు బాసిన సైనికుడిగా దేవయ్య పేరిట.. తన జన్మస్థలమైన కర్నాటకలోని కొడగు జిల్లా మడికేరిలో బస్ట్ స్టాండ్ సర్కిల్ కు ఆయన పేరు పెట్టుకున్నారు. అలాగే, ఆయన జ్ఞాపకార్థం ఆ ఊళ్లో ఓ విగ్రహాన్నీ ఏర్పాటు చేసుకున్నారు. అయితే, ఓ బస్సు ఢీకొని ఆ విగ్రహం ధ్వంసం కావడంతో అది ఉద్ధేశపూర్వకంగా ఎవరైనా చేశారా అనే అనుమానాలకూ తావిచ్చింది.
ఇండో- పాక్ యుద్ధంలో సర్గోధను లక్ష్యంగా చేసుకుని స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య సాహసోపేతమైన ఎయిర్ క్రాఫ్ట్ దాడిలో పాల్గొన్నాడు. 12 యుద్ధవిమానాల్లో ఒకటి ఫెయిల్ అవ్వడం వల్ల ఎయిర్ ఇన్స్ట్రక్రటర్ గా వ్యవహరిస్తున్న స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య తానూ రంగంలోకి దిగాడు.
దేవయ్య ఎయిర్ క్రాఫ్ట్ ను.. పాక్ శత్రుమూకల యుద్ధవిమానాలు చుట్టుముట్టాయి. అయినప్పటికీ యుద్ధవిమానంలోంచి కాల్పులు జరిపి శత్రువులను కుప్పకూల్చిన దేవయ్య నిగ్రహం కోల్పోలేదు. కానీ, ఒక్కసారి పాకిస్థాన్ పైలట్ లెఫ్టినెంట్ అమ్జాద్ తన పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ AIF104 యుద్ధవిమానంతో దేవయ్య ఎయిర్ క్రాఫ్ట్ ను అడ్డగించాడు. అలా తన విమానం క్రాష్ అయి గతి తప్పింది. ఆ తర్వాత దేవయ్య కనిపించకుండా పోయారు.
మొత్తంగా నాటి 1965 ఇండో- పాక్ భయంకర వైమానిక యుద్ధంలో కీలక పాత్రధారిగా వ్యవహరించిన స్క్వాడ్రన్ లీడర్ అజ్జమడ బొప్పయ్య దేవయ్య.. వింగ్స్ ఆఫ్ ఫైర్ గా గుర్తింపు పొందాడు. (తనది సమరయోధుల కులం కొడవ… రష్మిక మంధన్నా ఆ కులమే… మార్షల్ కమ్యూనిటీ… ఫీల్డ్ మార్షల్ కరియప్ప, ఫస్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ తిమ్మయ్య కూడా సేమ్…)
అలా దేవయ్య కథతో తెరకెక్కిందే స్కై ఫోర్స్. నాడు ఓ. పీ. తనేజా నేతృత్వంలో 13 ఎయిర్ క్రాఫ్ట్స్ దళాలు పాకిస్థాన్ పై చేసిన సాహసోపేతమైన యుద్ధం తాలూకు సన్నివేశాల కల్పనతో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్షయ్ కుమార్ తనేజా పాత్ర పోషించగా.. స్క్వాడ్రన్ లీడర్ దేవయ్య పాత్రలో వీర్ పహారియా నటించాడు. సారా అలీఖాన్ దేవయ్య భార్య పాత్ర పోషించింది…
ఈ సినిమా రిలీజుకు ముందే కొన్ని వివాదాలు… కొడవ కమ్యూనిటీ కర్నాటకకు చెందింది అయితే దేవయ్యను తమిళుడిగా చిత్రించారని ఓ వివాదం…
మూడు రోజుల్లో 40 కోట్ల పైచిలుకు వసూలు చేసింది సినిమా… ఫస్టాఫ్ పెద్దగా ఆసక్తికరంగా లేకపోయినా సెకండాఫ్ బాగానే ఉన్నట్లు రివ్యూలు చెబుతున్నాయి… వరుసగా ఫెయిల్యూర్లతో అసలు ఫర్దర్ కెరీర్ ఉంటుందా లేదానే సందేహంలో పడిన అక్షయ్ కుమార్‌కు ఇది కాస్త రిలీఫే… సో, దేశభక్తి మిళాయించిన మరికొన్ని వార్ మూవీస్ ట్రై చేయొచ్చు అన్నమాట..!!
Share this Article