నిజమే… ఈ రేంజులో అసమ్మతి సెగలు బహిరంగంగా ప్రదర్శితం అవుతాయని జగన్ కూడా అనుకుని ఉండడు… ప్రతి ఒక్కరూ చెప్పినట్టు వింటారనీ, నా మాటే శాసనం అన్నట్టుగా ఇలా చెప్పగానే అందరూ నిశ్శబ్దంగా తన మాట పాటిస్తారనీ అనుకుంటే… దానికి భిన్నంగా బజారుకెక్కారు మంత్రి పదవులు రాని నేతలు… వ్యక్తి కేంద్రంగా ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ అది, తను పార్టీ పెట్టాక ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లే అందరూ… ఎవరి లెక్కలు వాళ్లవి… ఎవరి స్వార్థం వాళ్లది… అంతే తప్ప జగన్ పట్ల వీరభక్తి కాదు కదా…
సో, భిన్నంగా ఎందుకుంటుంది..? అందుకే అసమ్మతి స్వరాలు అంటుకున్నయ్… వెంటనే ఎక్కడికక్కడ నియంత్రించేశాడు జగన్… నిజానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జగన్‌ను విడిచి వెళ్తే అది వాళ్లకే నష్టం తప్ప, జగన్‌కు పోయేదేమీ లేదు… వాళ్లకు ప్రత్యామ్నాయమూ లేదు… పైగా రాజకీయ పార్టీల్లో ఇలాంటి పోకడలు సహజమే… ఈ అసమ్మతి మంటల్లో మారీచ పత్రికలు పెట్రోల్ పోయాలని ప్రయత్నించాయి గానీ, ఫలించలేదు… అందరినీ తొలగించి, కొత్త వాళ్లకు చాన్స్ ఇస్తానని జగన్ చెప్పిన మాట నిజమే… కానీ అది చేతగాకుండా పోయిన మాట కూడా నిజమే… కారణాలు ఏవైతేనేం..? 11 మంది పాతవాళ్లను అలాగే ఉంచేయాల్సిన అనివార్యత…
అంతా తను అనుకున్నట్టుగా సాగదు అనే తత్వం బోధపడింది, బొప్పికట్టింది జగన్‌కు..! ఇప్పుడేమో అసమ్మతి సద్దుమణిగింది… భగ్గుమంటే చలికాచుకోవాలని అనుకున్న ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇది జీర్ణం కాలేదు… (టీవీ5 చానెల్‌ను పరిగణనలోకి తీసుకోనక్కర్లేదు…) దాంతో ఇష్టారాజ్యం విశ్లేషణలకు దిగారు… తాము అంచనా వేసిన నష్టం జగన్‌కు జరగకపోతే ఆ పత్రికలకు మహా బాధ… ఇది ఒకసారి చూడండి…
Ads
వార్త తప్పేమీ కాదు… కానీ ప్రభుభక్తి తప్పు అన్నట్టుగా తొమ్మిది ఫోటోలు వేసి, ముద్దాడారు- మోకరిల్లారు అంటూ ఓ పెద్ద కథనం రాసుకొచ్చింది ఈనాడు… మరీ చీప్ టేస్టు స్టోరీ ఇది… ఎస్, అమాత్య పదవి దక్కిన ఉద్వేగం, ఆనందం ఎమ్మెల్యేల్లో ఉండటం సహజమే కదా… అది అసాధారణం ఏమీ కాదు కదా… అలాగే మంత్రి పదవి కొనసాగింపు భాగ్యం దక్కినవాళ్లకూ ఆ సంతోషం ఉంటుంది… సో, బాస్ దగ్గరకు వెళ్లి కాళ్లు మొక్కితే అది అభ్యంతరపెట్టాల్సినంత తప్పా..?
ఒకరు కాళ్లు మొక్కడం స్టార్ట్ చేస్తే, ఆ వెనుక వచ్చేవాడికీ ఇరకాటం… తను కూడా మొక్కకపోతే అవిధేయతగా ముద్రపడుతుందేమోనని సంశయం ఉండనే ఉంటాయి… జగన్ చేయిని ముద్దాడితే తప్పేమిటో కూడా ఈనాడుకే తెలియాలి… ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రం గ్రేట్ అన్నట్టుగా కూడా రాశారు… మొదట గవర్నర్‌కు నమస్కరించి, ఆ తరువాత జగన్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడట… (తను జగన్ భుజం తట్టాడు… అదీ బొత్స స్టేటస్ అన్నమాట)…
ఆంధ్రజ్యోతి కూడా ఈ ప్రభుభక్తి మీద కథనం రాసుకొచ్చింది… కానీ మరో ఫస్ట్ పేజీ విశ్లేషణ పేలవంగా ఉంది… ఏడుపు కథనమని కనిపిస్తూనే ఉంది… 14 మందిని ఎందుకు పీకేశావు..? 11 మందిని ఎందుకు కొనసాగించావు అని ప్రశ్నిస్తోంది… అంతేకాదు, ఈ మంత్రివర్గ కూర్పులో శాస్త్రీయత కనిపించడం లేదట… హహహ… ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో చేసే ఎంపికలకూ శాస్త్రీయత ఉంటుందా..? అంటే ఏమిటి..? ఆ సైంటిఫిక్ మెథడ్ ఏమిటో కూడా రాస్తే బాగుండేది…
ఒక కులం వాళ్లను తీసేసి, మళ్లీ ఆ కులంవాళ్లకే ఆ ప్లేసులో స్థానం కల్పించడం ఏమిటి, ఇదేం సామాజిక న్యాయం, నాన్సెన్స్ అన్నట్టుగా రాసుకొచ్చింది… అదీ తప్పేనా..? కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలను విస్మరించిన తీరు మాత్రం ప్రస్తావించదు… ఐనా మంత్రుల ఎంపిక, తొలగింపు వెనుక ముఖ్యమంత్రికి రకరకాల పొలిటికల్ ఈక్వేషన్లు ఉంటయ్… విధేయత ఫాక్టర్ చూసుకోవాలి… అంతేతప్ప మంత్రివర్గం ఎంపికకు ఓ ఫిక్స్‌డ్ ఫార్ములా ఏముంటుంది రాధాకృష్ణుడా..?!
Share this Article