.
John Kora … కోహ్లీ రిటైర్మెంట్ రూమర్ల వెనుక దాగున్న కారణాలు ఏంటి?
టెస్టు క్రికెట్ నుంచి విరాట్ కోహ్లీ రిటైర్ అవుతాడంటూ అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ నుంచే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్‌లో కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి పలు మార్లు సహచరులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
Ads
‘ఆ రోజు వచ్చేసింది’ అంటూ తన సన్నిహితులతో చెప్పాడట. ఆ సిరీస్‌లో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 9 ఇన్నింగ్స్‌లో కలిపి కేవలం 190 పరుగులు మాత్రమే చేశాడు. పైగా 9 మ్యాచ్‌లలో 8 సార్లు ఒకే విధంగా అవుట్ కావడం కోహ్లీ అభిమానులకు కూడా చికాకు తెప్పించింది.
అవుట్‌సైడ్ ఆఫ్ బంతులను వెంటాడి, వేటాడి మరీ అవుట్ కావడం క్రీడాభిమానులు ఇప్పటికీ మర్చిపోలేరు. అప్పటి నుంచి టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని కోహ్లీ భావిస్తూ వస్తున్నాడట. అయితే ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్ కారణంగా కోహ్లీ టెస్టు రిటైర్మెంట్‌పై చర్చ జరగలేదు. కానీ ప్రస్తుత టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆ ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పడంతో కోహ్లీ విషయం మరోసారి తెరపైకి వచ్చింది.
రోహిత్ టెస్టులకు గుడ్ బై చెప్పిన తర్వాత మరోసారి టీమ్ ఇండియా టెస్టు పగ్గాలు చేపట్టాలని కోహ్లీ భావించాడు. తన మనసులో మాట బీసీసీఐ సెలెక్టర్లకు కూడా చెప్పాడట. ఇంగ్లాండ్ టూర్‌కు తనను కెప్టెన్‌గా చేస్తే బాగుంటుందని రాయబారం పంపాడట. కానీ బీసీసీఐ మేనేజ్మెంట్, సెలెక్టర్లు కోహ్లీ రిక్వెస్ట్‌ను సున్నితంగా తిరస్కరించారని.. దాంతో అతను తీవ్రంగా బాధపడ్డాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం రాసుకొచ్చింది.
భారత క్రికెట్ జట్టు భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని యువ క్రికెటర్లను ప్రోత్సహించాల్సిన సమయం వచ్చిందని.. టెస్టు జట్టుకు శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా చేయాలని భావిస్తున్నట్లు కూడా కోహ్లీకి తెలిపిందట. దీంతో కోహ్లీ మనస్తాపం చెందినట్లు వార్తలు వస్తున్నాయి.
టెస్టు క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన భారతీయులు కేవలం ముగ్గురే. సచిన్, గవాస్కర్, ద్రవిడ్‌లు మాత్రమే 10వేల మార్కును దాటారు. కోహ్లీ ఈ మార్కును చేరుకోవడానికి మరో 770 పరుగులు అవసరం ఉన్నాయి. టెస్టు క్రికెట్‌లో ఇలాంటి ఘనత అందుకునే ఛాన్స్ వదులుకుంటూ రిటైర్మెంట్ అవడం సబబు కాదని ఇప్పటికే కోహ్లీని బుజ్జగిస్తున్నారట.
టెస్టు జట్టు నుంచి ఒకే సారి రోహిత్ శర్మ, కోహ్లీ తప్పుకుంటే.. జట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని.. యువ జట్టుకు అండగా ఉండాలని కోహ్లీని బీసీసీఐ కోరిందట. టెస్టుల నుంచి రిటైర్మెంట్ అప్పుడే ప్రకటించవద్దని అడిగిందట. అయితే కోహ్లీ వైపు నుంచి మాత్రం ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తుంది.
అయితే, కేవలం కెప్టెన్సీ కోసం కోహ్లీ రిటైర్మెంట్ వరకు వెళ్తాడా? కోహ్లీని తప్పించడానికే ఇలాంటి రూమర్లను కొంత మంది కావాలని ప్రచారంలో పెడుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఏదేమైనా టెస్టుల నుంచి కోహ్లీ రిటైర్మెంట్ అయితే.. అది జట్టుపై తీవ్ర ప్రభావమే పడుతుంది.
ఒకేసారి రోహిత్, కోహ్లీలు దూరమైతే యువకులు ఆ ఒత్తిడిని తట్టుకుంటారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. మరి కోహ్లీ వైపు నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి….. #భాయ్‌జాన్
Share this Article