హమ్మయ్య… కాస్త సద్దుమణిగింది… హైదరాబాద్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల తొక్కిసలాట, పోలీసుల లాఠీ ఆట, నిర్వాహకుల డబ్బుల ఆట… మీడియా కన్నులపంట… గంటల తరబడీ చూపించే చూపి, వాగిందే వాగి, పెంటపెంట చేశారు… ఆమె ఎవరో తన బిడ్డ ఈ దేశం కోసం గాయాలపాలైనట్టు విలపిస్తోంది… ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని టీవీ చానెళ్లలో ఎండగడుతోంది… ఈరోజు కాస్త హడావుడి తగ్గింది… మనకు ఎలాగూ పీఎఫ్ఐ ముప్పులు, ఖలిస్థానీ ముప్పులు పనికిరావు, కనిపించవు కదా…
మళ్లీ ఎన్టీయార్, వైఎస్ఆర్ అనే జాతిపురుషుల గొడవలో పడి, మీడియా కాస్త ఆ క్రికెట్ టికెట్ల ఎపిసోడ్ ఏడుపు తగ్గించేసింది… సోషల్ మీడియా కూడా చల్లబడింది… తెలుగు జాతికి ఇద్దరే మూలపురుషులు, వాళ్లకు ముందు చరిత్ర లేదు… సో, ఆ సీరియస్ విషయం మీదే మీడియా ఫోకస్ సాగుతోంది… నిజానికి ఇంకా పది మందికి గాయాలైనా సరే ఎందుకు చింతించాలి..? వాళ్ల మూర్ఖత్వానికి వాళ్లే అనుభవిస్తారులే అని వదిలేయాలి…
ఎస్, పోలీసుల విచక్షణరాహిత్యం ఉంది… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అరాచకమూ ఉంది… ఇక్కడ క్రికెట్ అభిమానం అనే మూర్ఖత్వం ఉంది కాబట్టి హెచ్‌సీఏకు అలుసు… అసలు ఆ స్టేడియం వెళ్లి చూడటానికి ఏముంది..? గతం వేరు… ఇప్పుడు టీవీయే క్రికెట్ వీక్షణానికి సూపర్… కానీ వేల మందికి ఇప్పటికీ స్టేడియంలో చూడటం అంటేనే పిచ్చి… కారణం :: మూకానందం… అంటే గుంపులో, జనసమూహంలో ఉండి, అరవాలి, ఆనందించాలి, భంగు తాగినట్టు ఎగరాలి… ఒకడిని చూసి ఇంకొకడు… పైగా మన ఇండియన్లకు క్రికెట్ అంటే ఓ పిచ్చి కదా…
Ads
సరిగ్గా ఇదే క్రికెట్ అసోసియేషన్లకు, వాటి పెద్దలకు, మంద బుద్ధులకు డబ్బులు కురిపిస్తోంది… రోజూ కొన్ని లక్షల మంది థియేటర్ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటున్నారు, వెళ్తున్నారు, ఎక్కడా చిన్న గొడవ లేదుగా… విమానాశ్రయాలు, రైల్వేలు, బస్సులు, ఎవిరీ వేర్… ఆన్‌లైన్ టికెట్లు ఇప్పుడు చాలా చిన్న విషయం… ఇప్పుడు అజారుద్ధీన్ తలతిక్క సాకులు చెబుతున్నాడు…
మాకేం సంబంధం..? టికెట్ల క్రయవిక్రయాలు పేటీఎంకు ఇచ్చాం, వాళ్లదీ తప్పు అంటాడు ఒకసారి… మ్యాచ్ నిర్వహణ నాట్ ఈజీ తెలుసా అని దబాయిస్తాడు ఇంకోసారి… నిజానికి జరిగేది ఏమిటి..? పెద్ద సంఖ్యలో బ్లాక్, కాంప్లిమెంటరీలు… అజర్, కొడుకు, కోడలు హంగామా అట… ఆంధ్రజ్యోతి రాసింది… ఇది ఆ కుటుంబం నిర్వహించే ప్రైవేటు మ్యాచా..? ఈనాడు ఒక ఫోటో వేసింది… స్టేడియంలో ప్రస్తుతం సీట్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో…
వీటిపై కూర్చుని క్రికెట్ అభిమానులు మ్యాచ్ చూడాలట… పోనీ, అక్కడికి వెళ్తే ఏముంటుంది..? వెళ్లడం ప్రయాస… ట్రాఫిక్, తీరా వెళ్లాక పార్కింగ్ ఎక్కడో… 3000 మంది పోలీసుల నిఘా, ఆంక్షలు… బెరుకుబెరుకుగా లోపలకు వెళ్తే అదీ సీట్ల పరిస్థితి… వాటర్ బాటిళ్లు సహా ఏమీ తీసుకుపోనివ్వరు… ఫుడ్డు ఉండదు, ఇక ఎంజాయ్ చేయడానికి ఏముంటుందిరా..? ఎక్కడో దూరంగా క్రికెటర్లు… సరిగ్గా కనిపించి చావదు, పైగా ఒకే యాంగిల్‌లో చూడాలి… కానీ టీవీ అయితే…
కామెంటరీ, రకరకాల యాంగిల్స్‌లో షాట్లు, బాల్స్… స్లో మోషన్ సీన్లు, పాత స్టాటిస్టిక్స్… గ్రౌండ్ చివరలో కూర్చుని ఆట చూస్తున్నట్టే ఉంటుంది… చూస్తూ ఏదైనా తినొచ్చు, ఎగరొచ్చు, తాగొచ్చు, ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్‌తో కలిసి చూస్తే అదే కదా మజా… ఓటీటీలు వదిలి, ఇంకా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే ఎడ్డి మొహాలూ మీరూనూ… స్టేడియంలో ఏముందిరా..? గాయపడ్డారా..? పర్లేదు, తగిన శాస్తి జరిగింది..!!
Share this Article