రాహుల్ అనే ఓ సీనియర్ జర్నలిస్టు… కేసీయార్ తన ప్రెస్‌మీట్లలో రాహుల్‌ను పేరుపెట్టి పిలిచి మరీ ప్రస్తావించేవాడు… తను రిటైరయ్యాడు… కేసీయార్ ఉదారంగా ఏదో ఓ పదవి ఇస్తాడనే ప్రచారం నిన్న సోషల్ మీడియాలో బాగా సాగింది… ఉద్యోగి అన్న తరువాత రిటైర్ కావడం సహజం… దాని మీద ఈ చర్చ కూడా అనవసరం… కేసీయార్ తనకు పదవి ఇవ్వాలనుకుంటే ఎప్పుడో ఇచ్చేసేవాడు బహుశా… కానీ రాహుల్ మీద చర్చించిన సోషల్ మీడియా సదరు పత్రిక ఆఫీసును రాష్ట్రావతరణ దినం సందర్భంగా సీరియల్ బల్బులతో అలంకరించడాన్ని మాత్రం పట్టించుకోలేదు…
వీళ్లేమిట్రోయ్, కాస్త వంగమని అడిగితే ఏకంగా పాదాల మీదే పడిపోయారు… అని అప్పుడప్పుడో ఓ పెద్దమనిషి మీడియా పాదదాస్యంపై విసుక్కున్నాడట… నిన్న హిందూ ఆఫీసు అలంకరణ ఫోటో చూశాక ఇదే గుర్తొచ్చింది… ఎందుకింత సాగిలబడటం..? దశాబ్ది ఉత్సవాల్లో తప్పకుండా పాల్గొనాలని ఉన్నత స్థాయిలో ఉన్న అధికారిణి చెప్పగానే హిందూ పాటించేయాలా..? ఏరియా మనోభావాలను గౌరవించాలి కరెక్టే… 9 ఏళ్లకే దశాబ్ది ఉత్సవాలు చేస్తుంటే, మీడియా హౌజులు కూడా పాటించాలని చెప్పగానే వోకే వోకే అని తలాడించేయాలా..? ఎక్కడో తమిళనాడు బేస్, ఇక్కడ పెద్ద స్టాండ్ కూడా లేదు… కానీ ఎందుకీ గజగజ…
రేప్పొద్దున ఇంకేదో ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరూ పాటించాలి అని చెబితే చేసేస్తుందా..? రాష్ట్రావతరణను ప్రభుత్వమే ఓ అఫిషియల్‌గా చేస్తోంది… దాన్ని గౌరవించాలనేది కరెక్టు… కానీ మీడియా హౌజులు కూడా ప్రైవేటు సంస్థలే కదా… పెద్ద పెద్ద ప్రైవేటు సంస్థల్ని ఏమైనా అలంకరించారా..? ఉత్సవాలు చేస్తున్నారా..? హిందూకు ఈమాత్రం తెలియలేదా..? పోనీ, ఈ ప్రాంత మనోభీష్టాల్ని, మనోభావాల్ని గౌరవించాలి అనుకుంటే, ఈసారే ఎందుకు ఈ హడావుడి..? ప్రతి అవతరణ దినాన ఈ సందడి ఎందుకు లేదు మరి..? పైగా మార్కెట్‌లో పెద్దన్నలాగా బోలెడు నీతులు చెబుతుంటుంది…
Ads
నిజానికి ప్రభుత్వ ముఖ్యలు ఆయ్ అని గద్దిస్తే, ఎడాపెడా పేజీల కొద్దీ యాడ్స్ తీసుకునే చిన్న పత్రికలు, లోకల్ పత్రికలు, లోకల్ భాషాపత్రికలు, టీవీలు పాటించాయంటే అర్థం చేసుకోవచ్చు… చివరకు హిందూ కూడానా..?! అదీ కలుక్కుమనిపించేది… హిందూతో పోలిస్తే తమ స్వతంత్రతను కాపాడుకున్నవి లోకల్ భాషాపత్రికలే… యాడ్స్ తీసుకోవడంలో అగ్రస్థానంలో ఉండి ఇటీవల సర్కారుకు సాగిలబడటంలోనూ నంబర్ వన్ ప్లేసులో ఉన్న ఈనాడు సైతం ఈ అలంకరణ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు… తన ఇజ్జత్ తాను కాపాడుకున్నది… అంతెందుకు నమస్తే సాక్షిలా సాగిలబడిన పత్రిక కూడా ఈ అలంకరణల్ని లైట్ తీసుకుంది… ఆంధ్రజ్యోతి సరేసరి… ప్రభుత్వ ముఖ్యులకూ, ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి పడటం లేదు కదా… పడినా సరే, ఇలాంటి శుష్క, సందర్భరహిత ఆదేశాలను అది అస్సలు పట్టించుకోదు… దమ్మున్న పత్రిక కదా…
నమస్తే తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు… బీఆర్ఎస్ సొంత పత్రిక కదా… బీఆర్ఎస్ క్యాంపులో ఏ సంతోషం కనిపించినా సరే, అది నమస్తే ఆఫీసు బయట కూడా కనిపించి తీరాలి… తీరింది కూడా…!! సరే, అది బీఆర్ఎస్ అనుబంధ విభాగమే కాబట్టి తప్పుపట్టే పనిలేదు… పెద్ద పత్రికలే కాదు, చిన్న పత్రికలు కూడా ప్రభుత్వ ముఖ్యుల అభీష్టాన్ని ఎహెపో అని తోసిపుచ్చాయి… మరి ఆ హిందూ ఒక్కటే అంత వంగిపోయి జీహుజూర్ అని మూలుగుతున్నదెందుకు..? పాలకుల చల్లనిచూపుకై ఈ తాపత్రయం వెనుక మర్మమేమిటో…!! (అఫ్‌కోర్స్, ఇలాంటి తలతిక్క నిర్ణయాలకు ప్రధానంగా మీడియా హౌజ్ మార్కెటింగ్ పెద్దలే కారకులు…) ఒకటి మాత్రం సంతోషం… సోకాల్డ్ జాతీయ ఇంగ్లిషు పత్రికలుగా గొప్పలు చెప్పుకునే సదరు హిందూ వంటి పత్రికలకన్నా స్థానిక మీడియా తమ పరువును కాపాడుకుంది… తలవంచలేదు..!!
Share this Article