.
ప్రేమ…. ఎంత చిన్న పదం… ఎంత పెద్ద భావం…. ఎంత మంది ఎన్ని యుగాల నుండి ఆ జాజిపూల వానలో తడిసి ముద్దైపోయుంటారు.. ఎంత మంది ఆ రంగు కలల్లో మెరిసి ముగ్గై పోయుంటారు.. ఎంత మంది అది పొందక బతుకు పొరల్లో బుగ్గై పోయుంటారు..
అంతా ప్రేమే.. ఈ సృష్టికి మూలం ప్రేమే.. మనిషికి అందం ప్రేమే. ఎన్నిరకాల ప్రేమలో ఈ లోకంలో.
Ads
తొలి పొద్దు సూరీడు మెల్లగా లోకాన్ని నిద్ర లేపడం ప్రేమ..
తొలకరిన చిరుజల్లు చిరునవ్వు నవ్వడం ప్రేమ..
హేమంత కాలాన చేమంతి వెన్నెలలు ప్రేమ..
సంక్రాంతి సమయాన నునువెచ్చటి నవ్వులు ప్రేమ.
అసలు ఈ పదానికి అర్ధం చెప్పటానికి ఎంత మంది కవులు ఎన్ని రకాలుగా ప్రయత్నించి ఉంటారు
ఎన్ని భాషల్లో ఎన్ని భావాల్లో వర్ణించి ఉంటారు…
అయినా అది అసంపూర్ణమై, ఇంకా ఎంతైనా ఎలా అయినా చెప్పగలిగేంత గొప్పతనం ఉన్న ఓ బ్రహ్మ పదార్ధం ప్రేమ.
అప్పుడెపుడో దేవలోకాన దేవి- దేవుడు ఆటాడుకుంటుంటే ఆమె అందట. ఎప్పుడూ అమృతం తాగడం, నందనంలో ఆడడమేనా…. బతుకు బోర్ కొడుతుందయ్యా ఏదైనా విచిత్రాన్ని చూపించు అని. అప్పుడు ఆ సృష్టికర్త ఓ పిడికెడు పదార్థాన్ని తీసి కాస్త గుండ్రంగా చేసి దూరంగా విసిరి దానికి “భూమి” అని పేరు పెట్టాడట.
కొంచెం మంచులా ఉన్న ఆ ముద్ద సూరీడు చుట్టూ బొంగరంలా తిరుగుతూ మెలమెల్లగా వెచ్చబడి ఓ రోజు పచ్చని చిగురేసిందట.. ఆ చిగురు చెట్టై , ప్రేమ ఓ పిట్టై దానిపై వాలితే ఆ అందాల భూమిని అబ్బురంగా చూసిన ఆ దేవి కళ్ళు- ప్రభో, ఆ అందాలన్నీ ఇక్కడా ఉన్నాయి కదా, మరి ఇంకేదైనా అంటే, సరే అంటూ తను సరదాగా చేసిన చిన్న చిన్న బొమ్మలను కిందకి విసిరి , ఇక చూడు ఎప్పటికీ బోర్ కొట్టని అక్కడి యవ్వారాల్ని అంటే.. ఆమె ఊహు! కేవలం ఆ బొమ్మల ప్రేమనే చూస్తాను.. మిగిలిన వాటి కళలను తరువాత చూస్తాను అందట. సరే అని ఆ బొమ్మలకు ప్రాణం పోసి దేవుడు సరదాగా వాకింగ్ కి వెళ్ళిపోతే.. ఆమె చూపుల్లో… దూరంగా… భూమిపై ఓ దగ్గర-
యవ్వనపు తొలి రోజుల్లో ఎగిరే ఓ అందాల బొమ్మ ఉంగరాల జుట్టు చూస్తూ,
మెరిసే కనులలో ఏవో కలలు నింపుతూ,
ఎర్రని పెదాలపై ఓ చిరునవ్వు అతడు దిద్దుతుంటే-
వద్దంటూ ఓసారి, అవునంటూ మరోసారి అతడితో పరాచికాలాడుతూ ఆ మనసును ఆమె ఉయ్యాలలూపుతుంటే…
అతడు మెలమెల్లగా తెలతెల్లగా చూస్తూ ఆ పాదాలకు పారాణి అద్దే రోజు కోసం
ఆ చెంపలకు గంధాలు రుద్దే రోజు కోసం ఎదురు చూడడం ప్రేమ..
ఇంకొన్ని రోజుల ముందు వరకూ,
ఓ రెండు కుటుంబాలు ఇతడికి ఈమె ,
ఈమెకి ఇతడు సరిజోడంటూ మమతల ముహుర్తాలు పెట్టడం, అంతవరకూ ఎవరో తెలియని మనిషి ఇకపై మనదనుకుంటూ ఇష్టం పెంచుకోవడం ప్రేమ..
గుండెలపై వేళాడే ఓ పసుపు కొమ్ము ప్రేమ..
పదినెలల తరువాత ఓ వెచ్చని తొలి కేక శబ్దం ప్రేమ.
పొత్తిలిలో ఓ మెత్తని స్పర్శ ప్రేమ…అక్క చేయి అపురూపంగా పట్టుకొని వేసే అడుగులు ప్రేమ..
తమ్ముడి తప్పులను తిడుతూ దిద్దడం ప్రేమ..
అలిసి వచ్చిన నాన్నకు అందించిన చల్లటి మంచినీటి గ్లాసు ప్రేమ..
సరదా సమయంలో స్నేహితుడి చిరునవ్వు ప్రేమ…
కష్టకాలంలో ఇష్టంగా భుజాన వేసిన చేయి ప్రేమ..
ఓ అసహాయ కొమ్మకు ఆసరా ఇచ్చిన సాయం ప్రేమ..
మలివయసులో బతుకు జ్ఞాపకాల దొంతర ప్రేమ..
ఇన్నిన్ని ప్రేమలు చూసిన ఆ స్వర్గలోక కళ్ళు- మనకెందుకు ఇవన్నీ లేవంటే, దేవీ, మనం దేవతలం మనకు ఇన్నిన్ని రకాల ప్రేమలుండవు .. మనదంతా అమృతం, ఆనందం బ్యాచే అంటే…. ఆమె నవ్వి అలా కాదయ్యా…
అక్కడ- సంబంధం లేకపోయినా కొందరిని చూడగానే కొందరికి ఏవో మైకపు హార్మోనులు విడుదలవుతాయంట..
ఆ మైకంలో తనువు మనసు తైతక్కలాడుతాయంట..
ఆపై ఈ లోకంలో మనిద్దరం తప్ప అందరూ మాయమైపోతే ఎంత బాగున్ను అని కొన్ని నిముషాలైనా అనిపిస్తుందంట నిజమేనా అంటే-
అతడు నవ్వి హా.. నిజమే .. అదంతా నిజమే.. ఆ భావానికి బంధం అక్కరలేదు.. ఆ బంధానికి అందం తక్కువ కానే కాదు అంటూ..
నీకో విషయం చెప్పనా..
మనిషి స్వార్థపరుడు.
తనకు అనుకూలంగా మనసులకి అనేక బంధనాలు పెట్టేసాడు. నిజానికైతే మనసన్నది ఓ ప్రకృతి. అది ఓ ఆహ్లాద వీచిక.. ఓ ఆనంద గీతిక.. ఒక్కోసారి ఓ విచార వేదిక.. కానీ నవ్వును, బాధను ఇష్టాన్ని, కష్టాన్ని కూడా ఈ మనిషి కంట్రోల్ చేసేస్తున్నాడు ఏవేవో సిద్ధాంతాలు చెపుతూ అంటే.. దీర్ఘంగా ఓ ఊపిరి తీసిన ఆ దేవి.. మరి మనం వీటిని మార్చలేమా అనగా..
అమ్మో! మరి అప్పుడు వారికీ మనకీ తేడా ఏముంటుంది..? నీకు టైం పాస్ ఎలా అవుతుంది అంటే –
కాదు ప్రభూ.. స్పష్టాస్పష్ట అభిప్రాయాలు లేని ఓ అందమైన మనోరంజక కోణం చూపమంటే..
ఆ కోణం పేరు కళ అంటూ..
మనిషి ఈ రంగంలో మాత్రం ప్రేమైక స్వరూపమే అన్నాడట..
నిజమే, అందులో అనుమానమే లేదు.
తను వేసే బొమ్మలో
తను రాసే రాతలో
తను గీసే గీతలో
తను పాడే పాటలో
తన ఆలోచనల చూపులో అంతా ప్రేమే..
అవును
ఈ జగమంతా ప్రేమే…
కాకపోతే కాస్త స్పందించే హృదయం ఉండాలి. అందుకే
ఓ బాలసుబ్రమణ్యం గళం ప్రేమ ..
ఓ వేటూరి కలం ప్రేమ ..
ఓ ఇళయరాజా స్వరం ప్రేమ..
ఓ బాపు కుంచె దిద్దిన రంగుల చిత్రం ప్రేమ..
కలిసున్నా లేకపోయినా
చిరుగాలంటి చిరునవ్వునూ
తెరచాపంటి పరువమ్మునూ
ఈ జన్మకే కాదు, వచ్చే జన్మకూ కలిసే కోరుకున్న ఇద్దరి మూగమనసుల నావ-
గోదారి గుండె సుడిగుండంలో మునగడం ప్రేమ..
తన నుదుటి పసుపు, కలల కుంకుమ మాయమైపోయినా అప్పదాసు తనకంటే ముందే పోవాలి, లేదంటే తను ఈ లోకంలో హాయిగా బతకలేడని బుచ్చమ్మ అనుకోవడం ప్రేమ…
పున్నమినాటికి స్వర్గపు ద్వారాలు మూసుకుపోనీ.. ఇంద్రుడి ఇంట అన్ని సుఖాలూ దూరమైపోనీ, ఈ జగదేక వీరుడి చెంత ఏ చింతా లేదు అనుకుంటూ మహిమాంగుళీయకాన్ని సంద్రంలోకి ఇంద్రజ విసిరేయడం ప్రేమ..
వయసుతో సంబంధం లేకుండా ఇష్టమైన వారిని ప్రేమగా టుమ్రీ, బుడ్డీ, కన్నా అని పిలుచుకోవడం ప్రేమ.
ఎక్కడో ఏ యుద్ధంలోనో చనిపోయిన ఓ చిన్నారి మరణానికై రాలిన మన కన్నీటి బొట్టు ప్రేమ..
ఇష్టమైన వారు కాస్త దూరమైతే
ఇళయరాజా పాట కూడా ఆనందం ఇవ్వకపోవడం ప్రేమ…. కిలపర్తి త్రినాథ్.. 9440886844
Share this Article