ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క గద్దె మీద కొలువు తీరింది… భక్తకోటి ప్రణమిల్తుతోంది… మేడారం అడవి సమ్మక్క నామస్మరణతో మారుమోగిపోతోంది… మన కుంభమేళాకు ప్రసిద్ధిపొందిన ఈ జాతర ఆదివాసీలకు పవిత్రం… సంప్రదాయిక హిందూ భక్తులకు తిరుపతి, కాశి, చార్ ధామ్ వంటివి ఎలాగో ఆదివాసీ సమాజానికి మేడారం అలాగే…
కాకపోతే వాళ్లకు రూపాల్లేవు.,. కొబ్బరికాయ, బంగారంగా భావించే బెల్లం మాత్రమే కానుకలు… అక్కడే పుట్టువెంట్రుకలు, మొక్కులు గట్రా… ఒకప్పుడు ఆదివాసీల జాతర, కానీ ఇప్పుడు అందరూ వస్తున్నారు… రెండేళ్లకోసారి జాతరకు మినీమేడారం పేరిట ఏటేలా నిర్వహిస్తున్నారు.,. మామూలు రోజుల్లో కూడా భక్తగణం వస్తోంది…
ఒకప్పుడు ఎడ్ల బండ్లు, ఎక్కడ పడితే అక్కడ గుడారాలు ఎట్సెట్రా… ఇప్పుడు సౌకర్యాలు బాగా పెరిగాయి, బస్సులే కాదు, వాహనాలే కాదు, ఏకంగా హెలికాప్టర్లే వచ్చాయి… ఒక్కసారి, ఒక్కసారి… సమ్మక్క అడవి నుంచి వస్తున్నప్పుడు భక్తుల హోరు, కింద వరుసగా పడుకుని సమ్మక్క తమ మీదుగా నడిచి పోవాలని కోరుకునే భక్తి ఆవేశం మనం అక్కడ ఉండి గమనిస్తే, సమ్మక్క మీద ఆదివాసీల భక్తి తీవ్రత ఎంతో అర్థమవుతుంది… అక్కడ ఉన్నంతసేపూ అదొక ట్రాన్స్‌లోకి వెళ్లిపోతాం మనం కూడా… (20 ఏళ్ల క్రితమే చిలుకలగుట్ట తొవ్వలో ఆ అనుభూతి నాకు దొరికింది)
Ads
సరే, ఇప్పుడు హఠాత్తుగా సోషల్ మీడియాలో చినజియ్యర్ వ్యాఖ్యల మీద పోస్టులు కనిపిస్తున్నాయి… ఆయన సమ్మక్క- సారలమ్మలు దేవతలే కాదని వ్యాఖ్యానించాడనీ, జాతర మొత్తం బిజినెస్ అయిపోయిందన్నాడనీ అభ్యంతరాలు… నిజంగా అప్పట్లో ఏమన్నాడు ఆయన..? ఇదుగో సాక్షి టీవీ వీడియో ఒకటి కనిపించింది…
‘సమ్మక్క- సారక్క ఎవరు..? వాళ్లేమైనా దేవతలా..? బ్రహ్మలోకం నుంచి దిగివచ్చినవాళ్లా..? ఏమిటీ చరిత్ర..? అదేదో ఒక అడవి దేవత, గ్రామ దేవత, సరే చేసుకోనివ్వండి అక్కడుండేవాళ్లు… చదువుకున్నవాళ్లు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆపేరుతో బ్యాంకులు పెట్టేశారు ఆ తరువాత, దట్ బికేమ్ బిజినెస్ నవ్…’ ఇదే ఆయన అన్నది…
తరువాత గొడవ జరిగింది… ఆమధ్య రేవంత్‌రెడ్డి, సీతక్క తదితరులే కాదు సీపీఐ నారాయణ ప్రభృతులు కూడా ఖండించారు, జియ్యర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు… అబ్బే, నేను అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం అన్న మాటల పూర్వాపరాలు తెలుసుకోకుండా వివాదం చేస్తున్నారు, ఇది కరెక్టు కాదు, నేనెవరినీ అవమానించలేదు… అని వివరణ ఇచ్చాడు తను… కానీ నేను అలా అనలేదు అని మాత్రం తోసిపుచ్చలేదు…
తను ఆ మాటలన్నది నిజం… కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరచడమే… బ్రహ్మలోకం నుంచి దిగిరావడం ఏమిటో ఆయనే చెప్పాలి… దేవతలు ఎక్కడి నుంచీ దిగిరారు స్వామీ, ఇక్కడే పుట్టి, ఆదర్శంగా వ్యవహరించి దేవుళ్లయ్యారు… ఏ ఉదాహరణ తీసుకున్నా అదే సత్యం… దేవుడు అంటేనే విశ్వాసం… కోట్లాది మంది విశ్వాసమే ఇక్కడ దేవతలు… ఈమాత్రం ఆధ్యాత్మిక స్పృహ లేకపోతే ఇక ఎవరూ ఏమీ చెప్పలేరు, లక్ష మాటలకేమి గానీ… ప్రతి చిన్న ఫంక్షన్‌కూ ఎవరెవరి ఇళ్లకో వెళ్లి పాదపూజ చేయించుకుని మరీ పైసలు వసూలు చేస్తారు కదా… మీరు ఎవరు..?
అంతెందుకు, హైదరాబాద్ శివారులో రామానుజుడికి అంత పెద్ద విగ్రహం పెట్టారు, కదా, అదీ అక్కడి రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసమే అనే విమర్శలు కూడా ఉన్నాయి కదా… అసలు రామానుజుడు ఎవరు..? ఎందుకీ ఆరాధన..? ఎస్, ఆయన్ని ఆరాధించినట్టే కోట్లాదిమంది ఈ అడవి దేవతలనూ ఆరాధిస్తున్నారు… తమ కోసం ప్రాణాలర్పించిన ఆ మహిళా దేవతల సాహసం, తెగువ, ధిక్కారం, పోరాటం, ఆత్మత్యాగాల్ని స్మరించుకుంటోంది అడవి… ఇదంతా ఏదో కావాలని మళ్లీ రచ్చ చేసే కథనం కాదు… ఆ అవసరమూ లేదు… కానీ ఎవరికైనా జియ్యర్ వంటి అభిప్రాయాలు గనుక ఉంటే వాళ్లకు ఇది ఓ వివరణ..!!
Share this Article