ఏబీఎన్ చానెల్‌లో డిబేట్‌కు వెళ్లడం ద్వారా కేసీయార్ బిడ్డ కవితకు వచ్చిన ఫాయిదా ఏమిటి..? కనీసం డ్యామేజీ కంట్రోల్ ఏమైనా జరిగిందా..? తన వెర్షన్ బలంగా వినిపించగలిగిందా..? అసలు ఆ డిబేట్‌కు వెళ్లాలనే సలహా ఇచ్చింది ఎవరు..? నిజానికి ఈ డిబేట్ కవితకు ఒకరకంగా నష్టం చేకూర్చింది… ఎలాగో చెప్పుకోవాలంటే కాస్త దీనికి పూర్వరంగం నెమరేసుకోవాలి…
కవిత పేరును పదే పదే బీజేపీ వాళ్లు ఢిల్లీ మద్యం స్కాంలోకి తీసుకొస్తున్నారు… ఆమె కోర్టుకు వెళ్లి ఎవరూ తన మీద నిరాధార ఆరోపణలు చేయకుండా అడ్డుకుంది… అక్కడివరకూ బాగానే ఉంది… కానీ ఆంధ్రజ్యోతిలో బీజేపీ వాళ్ల ఆరోపణలు ప్రముఖంగా కవర్ కావడం, హెడ్డింగులోనే తన పేరు ప్రముఖంగా పబ్లిష్ చేయడం, తనను వివరణ కూడా అడగకపోవడం, తను ఇచ్చిన వివరణకు పెద్ద ప్రయారిటీ ఇవ్వకపోవడం, పైగా సీఎం తనను మందలించినట్టు ఇంకో వార్త రాయడం… ఇవన్నీ ఆమెను హర్ట్ చేశాయి… రాధాకృష్ణ మీద బాగా కోపమొచ్చింది…
సహజం… అసలే తను చిక్కుల్లో ఉంది, ఈ స్థితిలో తమ కుటుంబానికి కావల్సిన రాధాకృష్ణ తనకు బాసటగా ఉండాల్సింది పోయి, వార్తల్లో నిరాధారమైన ఘాటుతనం పెంచాడనేది ఆమె ఫీలింగ్… అంతేకాదు, కేసీయార్, తాను మాత్రమే ఉన్నప్పుడు జరిగిన సంభాషణను తను అక్కడే ఉండి విన్నట్టుగా రాధాకృష్ణ ఎలా రాస్తారనేది ఆమె సూటి ప్రశ్న… అదేం జర్నలిజం అనడిగింది… ‘‘నువ్వు కూడా గిట్ల తయారైనవేంది..?’’ అనేది ఆమె ప్రశ్న సారాంశం… బీజేపీ వాళ్లు కేసీయార్‌ను, తనను కుట్రపూరితంగా టార్గెట్ చేస్తున్నప్పుడు తాను బాధితురాలిని కదా, నిందితురాలిగా ముద్ర వేస్తావేంది అనడిగేసింది…
Ads
ఇక్కడ ఆమె చేసిన పొరపాటు ఏమిటంటే… ‘‘మాకు కావల్సిన వాడివి, వాళ్లెవరో ఏవేవో ఆరోపిస్తే అంత ప్రయారిటీ ఇవ్వడం దేనికి..? మామీద జరిగే కుట్రలు మీకు తెలియవా..?’’ అని ఫోన్ చేసి, దులిపేస్తే, కాదు, కాదు, వదిలేస్తే అయిపోయేది… రాధాకృష్ణ ఈ అసంతృప్తిని కూడా వాడుకోవాలని అనుకున్నాడు… డిబేట్‌కు రమ్మన్నాడు, ఎవరో కాదు, నేనే ఇంటర్వ్యూయర్‌ను అన్నాడు… ఆమె వచ్చేసింది… వీలైనంతవరకూ రాధాకృష్ణ జాగ్రత్తగానే మాట్లాడాడు… కానీ ‘‘సీఎం మందలించినట్టు నీకెవరు చెప్పారు..? అది చెప్పు, సీఎంఓ నుంచి తీసేద్దాం’’ అంటూ… జర్నలిజం అంటే టెక్నిక్స్, ట్రిక్స్, మోసపూరితంగా సమాచారం సేకరించడం కాదు అని రాధాకృష్ణకు కవిత క్లాస్ తీసుకునే ప్రయత్నం చేసింది…
ఇక్కడే రాధాకృష్ణను అండర్ ఎస్టిమేట్ చేసింది… నువ్వు గౌనుల్లో తిరిగినప్పుడే నేను జర్నలిజంలోకి వచ్చేశానమ్మా అని తెలివిగా కార్నర్ చేసిన ఆయన తనకు అలవాటైన పెడసరపు ధోరణితో ‘‘జర్నలిజం అంటేనే అది… నా వార్త అబద్ధమైతే కేసు పెట్టండి, పరువునష్టం వేయండి, అందులోనూ క్రిమినల్ కేసు వేయండి, ఎలాగూ మీడియాలో అందరూ మీకు దాసోహం అన్నారు, నేనొక్కడినే తిక్కలోడిని మీకు భయపడకుండా నిలబడింది, జర్నలిస్టులు ఎవరైనా సోర్స్ చెబుతారా..?’’ అని ఎదురుదాడికి దిగాడు… తమ రాతలన్నీ నిజాలేనని మళ్లీ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పక్కాగా ప్రయత్నించాడు… స్కాం వివరాలు తనకు తెలుసునంటూ కవితను డిఫెన్స్‌లో పడేయడానికి ప్రయత్నించాడు… మొత్తం డిబేట్ ఆంధ్రజ్యోతి వార్తలకు ఆమె ఆగ్రహం, రాధాకృష్ణ వివరణ అన్నట్టుగా సాగింది తప్ప, నాకు ఆ స్కాంతో సంబంధం లేదని ఆమె బలంగా చెప్పుకోలేకపోయింది… నిజానికి అదే ఆమె చేసి ఉండాల్సింది…
దీనివల్ల ఏం జరిగింది..? కవితకు వచ్చిన ఫాయిదా ఏమీ లేకపోగా… ఢిల్లీ స్కాం గురించి మళ్లీ ఓసారి లక్షల మందికి గుర్తుచేసినట్టయింది… అదీ నష్టం… ‘‘నిజంగానే ఏదో ఉన్నట్టుంది, లేకపోతే రాధాకృష్ణ అంత బలంగా ఎందుకు తమ రాతల్ని డిఫెండ్ చేసుకుంటాడు అనే కొత్త సందేహాలకు తావిచ్చినట్టయింది… ఒకవైపు కోర్టులో తన మీద ఎవరూ ఆరోపణలు చేయకుండా ప్రొటెక్షన్ తెచ్చుకున్న తనే ఈ డిబేట్ ద్వారా మళ్లీ ప్రజలకు చెప్పినట్టు కాలేదా..? ఒడ్డున కూర్చున్నవాడు రాధాకృష్ణ, ఎన్నయినా మాట్లాడతాడు, కానీ సెన్సిటివ్ పొజిషన్‌లో ఉన్నది కవిత కదా…! ఇలాంటి సందర్భాల్లోనే వీలైనంతవరకూ మీడియాకు, ప్రత్యేకించి ఏబీఎన్, టీవీ5 వంటి మీడియాకు కాస్త దూరదూరంగా ఉండాలి… అదీ కవితకు ఎవరూ చెప్పలేదు…!!
Share this Article