I would have still been the chief minister if I had continued to maintain good relations with BJP. The goodwill I had earned in 2006-2007 & over a period of 12 years, I lost everything due to the alliance with Congress party: HD Kumaraswamy, former Karnataka CM pic.twitter.com/AosBsxKgWh
— ANI (@ANI) December 5, 2020
…… ఈ ట్వీట్ చదివారు కదా… కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి శోకాలు… ఆ కాంగ్రెస్ సిద్ధరామయ్య ఏదో మాయ చేశాడు, మా డాడీని తప్పుదోవ పట్టించాడు, బీజేపీతో చెలిమి కట్ చేసుకున్నాను, ఆ స్నేహం అలాగే కొనసాగి ఉంటే మళ్లీ సీఎం అయ్యేవాడిని, వా, వా… ఎంత పనైపోయిందీ… అని ఏడుస్తున్నాడు… లోలోపల ఏమీ కాదు, బాహాటంగా ట్వీట్ చేసి మరీ కుమిలిపోతున్నాడు… మీడియాతో చెప్పుకుని మరీ దుఃఖిస్తున్నాడు…
ఫెడరల్ ఫ్రంటు దిశలో మళ్లీ అడుగులు వేస్తానని, డిసెంబరులో హైదరాబాదులోనే భేటీ పెట్టి, బీజేపీ అంతుచూస్తానని ఆమధ్య కేసీయార్ చెప్పాడు కదా… మళ్లీ ఇప్పుడు కుమారస్వామికి ఫోన్ చేశాడనే వార్త ఏదో చదివాక… హఠాత్తుగా ఈ కుమారస్వామి శోకం గుర్తొచ్చింది… బీజేపీతో దోస్తీ కటీఫ్ చేసుకుని మస్తు నష్టపోయానని పశ్చాత్తాపపడుతున్న సదరు కుమారస్వామి ఇక కేసీయార్ పెట్టే ఫెడరల్ ఫ్రంటుకు వస్తాడంటారా..? అసలు కేసీయార్‌కు యాంటీ- కాంగ్రెస్, యాంటీ- బీజేపీ ప్రాంతీయ పార్టీల సమాఖ్య దిశలో ఫస్ట్ కనిపించే పేరు కుమారస్వామి ఒక్కడే… ఇక తనే ఇలా శోకాలు పెడుతున్నాడు అంటే ఇక కేసీయార్ ఫ్రంటు కథ ఎలా ఉండనుంది..?
Ads
భారత్ బంద్‌కు మద్దతునిస్తా, పార్లమెంటులోనూ వ్యతిరేకించా, ఆ రైతుచట్టాలు దుర్మార్గం అని చెబుతున్న కేసీయార్… అదే రైతుల దిశలో సన్నధాన్యం రైతుకు, పత్తి రైతుకు తను చెప్పిందేమిటి, జరిగిందేమిటి, ఈ నిశ్శబ్దం మాటేమిటో ఒకసారి ప్రజలకు వివరణ ఇస్తే బాగుండు… సరే, కుమారస్వామికి అప్పట్లో ఏదో ఆర్థికమో, హార్దికమో ఏం సాయం చేశాడో వదిలేద్దాం, ఆ సాయం చంద్రబాబు కూడా చేశాడు.., కుమారస్వామి గాకుండా ఇంకా ఎవరున్నారు ఇప్పటికిప్పుడు కేసీయార్ మాట విని, ఛలో మీ వెంట మేము అని చెప్పడానికి…?
పాపం, సీపీఎం, సీపీఐ కూడా జాతీయ పార్టీలేనాయె… తెలుగుదేశం జాతీయ, అంతర్జాతీయ, ఖగోళ పార్టీ… ఇక జగన్… తనెంత కేసీయార్ దోస్త అయినా సరే, బీజేపీ మీద కత్తి దూసే సీన్ లేదు… తన కేసులు, తన భయాలు… స్టాలిన్ కలిసొస్తాడు కానీ తను కూడా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉన్నాడు… మరెలా..? మమతకు తన రాష్ట్రంలో చక్కదిద్దుకోవడమే తనకు చేతకావడం లేదు… ముఫ్తి, అబ్దుల్లాలు మళ్లీ మాట్లాడితే మరో రెండేళ్లు నిర్బంధంలో ఉంచేస్తుంది బీజేపీ… అఖిలేష్, తేజస్వి యాదవ్, శరద్ పవార్, జేఎంఎం గట్రా మిగిలారు…
వీరిలో శరద్‌పవార్ కూడా కాంగ్రెస్ పొత్తుదారే… శివసేన కేసీయార్‌ను నమ్మదు… ఆమధ్య ఎన్నికల ముందు ఇలాగే కేసీయార్ ఎక్కేగడపా దిగేగడపా అని తిరిగాడు కదా… నవీన్ పట్నాయక్ సహా ఎవరూ పెద్దగా స్పందించలేదు… నిజానికి ఇలాంటి కథలు, కసరత్తులు చంద్రబాబు వల్ల అవుతాయి తప్ప కేసీయార్ వల్ల కావు… మరిక ఆయన పెట్టబోయే ఫెడరల్ ఫ్రంటు భేటీకి ఎవరొస్తారబ్బా..? చివరకు ఈ కుమారస్వామి కూడా వస్తాడా రాడా డౌటే… ఆఁ ఏముందిలే… వీర సెక్యులర్ జాతీయ పార్టీ మజ్లిస్, టీఆర్ఎస్ పార్టీ కలిస్తే చాలదా ఏం అంటారా..? ఈ ప్రపంచ నెంబర్ వన్ హిందువు దేశంలోని ముస్లిములందరినీ ఏకం చేసి, ఒవైసీ సైన్యాధ్యక్షుడిగా, మోడీ మీద యుద్ధం చేస్తే సరిపోదా అంటారా..?
నువ్వు మన తెలంగాణ సమాజాన్ని ఉద్దరించవయ్యా స్వామీ, అది చాలు, మంచిగా పరిపాలించు, ఎల్లకాలమూ నువ్వే మా హీరోవు, వేరొకరు మాకక్కర్లేదు… అని ఆ పెద్ద కుర్చీ ఎక్కిస్తే…, నా కొడుకును ఇక్కడ కూర్చోబెడతా, నేనేమో ఢిల్లీ పోతా, గాయిగత్తర లేపుతా, ఆ మోడీ తాటతీస్తా అంటే తెలంగాణ సమాజం మాత్రం ఏం చేయగలదు..? దుబ్బాక, గ్రేటర్ ప్రజలు చెప్పారు కదా… ఐనా సమజ్ చేసుకోకపోతే ఎట్లా..?
Share this Article