ముందుగా చిన్న క్లారిటీ… ఆశిష్ విద్యార్థికి 60 ఏళ్లు నిజమే… తను బేసిక్‌గా కేరళైట్… తల్లి ఓ కథక్ డాన్సర్, విద్యార్థి ఢిల్లీలో పుట్టి పెరిగాడు… తాజాగా 33 ఏళ్ల రూపాలీ బారువాను పెళ్లి చేసుకున్నట్టు మీడియా రాసింది… ఫోటోలు వేసింది… నీకేం పోయే కాలమురా ఇంత గ్యాప్‌తో ఓ యువతిని పెళ్లి చేసుకున్నావు అంటూ సోషల్ మీడియాలో పలువురు గడ్డిపెట్టారు… పోయేటప్పుడు ఏమైనా ఆస్తి ఇస్తాడని టెంప్టయి తనను పెళ్లి చేసుకుందంటూ ఆమెను కూడా తిట్టిపోశారు… కానీ నిజం ఏమిటంటే..?
ఆమె వయస్సు 33 కాదు, వారి నడుమ అంత తేడా కూడా లేదు… ఆమె వయస్సు 50… అంటే వయస్సులో తేడా జస్ట్, పదేళ్లు… అస్సాంకు చెందిన ఆమె ఆంట్రప్రెన్యూర్… నామెగ్ పేరిట కోల్‌కత్తాలో హ్యాండ్లూమ్ ఫ్యాషన్ స్టోర్ ఉంది… ఆశిష్‌లాగా సోషల్ మీడియాలో యాక్టివ్ కాదు… ఆమె ఫాలోయర్స్ వెయ్యి లోపు… ఆమె డాన్సర్… తమ పెళ్లి గురించి బ్రీఫ్‌గా చెబుతూ, ఆనందాన్ని వ్యక్తం చేసిన ఆమె ఆశిష్ పాత పెళ్లాం గురించి ఒక్క మాట నెగెటివ్‌గా మాట్లాడలేదు… హుందాగా, సంస్కారయుతంగా వ్యవహరించింది…
(నరేష్, పవిత్ర బోల్డ్ ప్రేమ కథ, రమ్య రఘుపతిపై నిందలు, బజారులో పడిన కొట్లాట, మళ్లీ పెళ్లి అనే సినిమాలో దిక్కుమాలిన ప్రచారం…. ఈ క్షుద్ర కథకు ఆశిష్ విద్యార్థి ప్రేమ, పెళ్లి కథ పూర్తి భిన్నం…)
Ads
సరే, రూపాలీతో ఆశిష్ పరిచయం, ప్రేమ, పెళ్లి అనే కథను వదిలేస్తే… ఆశిష్ మొదటి పెళ్లాం పిలూ అలియాస్ రాజోషి బారువా ఏమంటోంది..? అది కదా ఇంట్రస్టింగ్… హిందుస్థాన్ టైమ్స్ ఆమెను కలిసి మాట్లాడింది… ఈమె బెంగాల్‌కు చెందిన ఓ నటి, ఓ సింగర్, థియేటర్ ఆర్టిస్ట్… గతంలో రేడియో జాకీ కూడా… ఈమె తల్లి శకుంతలా బారువా… ఆమె అప్పట్లో ఓ పాపులర్ నటి… ఆశిష్‌తో సంబంధాలు కట్టయిపోయినా సరే, తన సోషల్ మీడియా ప్రొఫైల్‌లో విద్యార్థి అనే ఆయన సర్‌నేమ్ కంటిన్యూ చేస్తోంది రాజోషి… అంతేకాదు… ఆశిష్‌పై తనకెలాంటి ఫిర్యాదూ లేదంటోంది…
ఆశిష్, రాజోషికి ఓ కొడుకు… పేరు అర్థ్… ఆస్టిన్‌లోని టెస్లాలో జాబ్ చేస్తున్నాడు… గత అక్టోబరులో ఇద్దరూ పరస్పర అంగీకార విడాకులకు దరఖాస్తు చేశారు… ‘‘ ఇది ఓ ప్రైవేటు విషయం… పత్రికలకో, ప్రజలకో చెప్పాల్సిన అవసరం లేదనిపించింది, అందుకే ఎవరికీ చెప్పలేదు… అప్పటి నుంచీ ఫ్రెండ్స్‌గానే ఉన్నాం., ఉంటాం… 22 ఏళ్లు కలిసి ఉన్నాం మేం… నాకు ఏ కంప్లియింటూ లేదు తనపై… నా జీవితంలో అత్యుత్తమ కాలం ఏదంటే అది విద్యార్థితో కలిసి ఉన్న కాలమే… బహుశా తను కూడా అదే చెబుతాడు…
కొడుకును పెంచడంలో ఓ గైడ్‌గా, ఓ ఫ్రెండ్‌గా విద్యార్థి మంచి పాత్ర పోషించాడు… అర్థ్ కూడా మంచి పరిణతి చూపించే అబ్బాయి… మా మధ్య జరిగేవి సరిగ్గా అర్థం చేసుకున్నాడు… మా ఇద్దరి భవిష్యత్తు కోరికలు వేర్వేరుగా ఉన్నాయి… అవి మామధ్య ఓ సన్నని విభజన రేఖను గీచాయి… అవి క్రమేపీ బలపడ్డాయి… తను అనుకున్నట్టు బతికే హక్కు ఆయనకు ఉంది… అందుకే పరస్పర గౌరవంతోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం… అంతేతప్ప జనం ఊహిస్తున్నట్టు మా నడుమ కొట్లాటలు, తిట్లు వగైరా లేేనేలేవు…
రెండేళ్లుగా వేర్వేరు మార్గాల్లో ప్రయాణించే పనిలోనే ఉన్నాం… కారణాలు వివరంగా చెప్పలేను కానీ నేనిప్పుడు శ్రీమతి విద్యార్థిగా ఉండలేను… అది సంపూర్ణంగా అర్థమయ్యాకే విడిపోయాం… నో రిగ్రెట్స్… నో కంప్లయింట్స్… ఆశిష్ మళ్లీ పెళ్లి చేసుకోవడం ద్వారా నాకేమీ మోసం చేయలేదు… విడిపోయాక తను వేరే పెళ్లి చేసుకుంటే నాకు అభ్యంతరం ఉండాల్సిన పనేమిటి..? ఆయనకు ఓ భాగస్వామి కావాలి, తన అవసరం… సరైన ఎంపిక చేసుకున్నాడు… నాకు ప్రస్తుతానికి వేరే పెళ్లి అక్కర్లేదు… ఇలాగే ఉంటాను…
ఇన్నేళ్లూ శకుంతల బారువా బిడ్డగా, ఆశిష్ విద్యార్థి భార్యగా ఉన్న గుర్తింపును దాటేసి… సొంత గుర్తింపు కోసం ప్రయత్నిస్తాను… నేను ఒంటరిగా నడిచే సిట్యుయేషన్ వచ్చింది జీవితంలో… ఆయన నా ఆశల్ని, నా కోరికల్ని ఎప్పుడూ తొక్కేయలేదు, అణిచేయలేదు… హుందాగా, పరిణతితో వ్యవహరించాడు… ఇప్పటికీ నా గురించి ఆయన మదిలో సదభిప్రాయమే ఉందని అనుకుంటున్నాను… సెలవు…
Share this Article