Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హఠాత్తుగా ఈ అన్నామలైని దింపేశారు… అసలేంటి బీజేపీ మర్మం..?!

April 5, 2025 by M S R

.

Siva Racharla …… అన్నామలై మరో మూపనార్ అవుతాడా..?

మొన్నటి ఎన్నికల్లో జనసేన 21 సీట్లలో పోటీ చేసి 21 గెలవటం ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి రాష్ట్రంలో) చరిత్రలో రికార్డ్ .. సిక్కింలో పవన్ కుమార్ చాంలింగ్ పార్టీ అలా 100% సీట్లు రెండుసార్లు గెలిచింది… (కంప్లీట్ స్ట్రైక్ రేట్)…

అలాంటి ఫీట్ సాధించిన మరో కాంగ్రెస్ నేత ఉన్నారు.. అది కూడా పెద్ద బలం లేని తమిళనాడులో..
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ బలం ఎంత? 80, 90 దశాబ్దాలలో కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టి విజయం సాధించిన నేతలు చాలామందే ఉన్నారు.. కానీ పదవి కోసమో పట్టుదల కోసమో కాకుండా నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ ను వీడి సొంత పార్టీ పెట్టిన వాళ్ళు చాలా తక్కువ లేదా దాదాపు ఎవరు లేరని చెప్పొచ్చు..ఒక్క జి.కే. మూపనార్ తప్ప..

Ads

మూపనార్ నిబద్దత ఉన్న కాంగ్రెస్ నేత.. కామరాజ్ శిష్యుడు.. ఆయన రాజకీయ వారసుడు కూడా.. ఏ రోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మంత్రి పదవి తీసుకోలేదు.. దేవెగౌడ తరువాత ప్రధాని పదవిని ఆఫర్ చేసినా మిత్రపక్షం అయిన డీఎంకే /కరుణానిధి వద్దన్నారని ఆ పదవిని తీసుకోలేదు..

మూపనార్ కు ప్రధాని పదవా ?అని ఆశ్చర్యపోయే ముందు ఆయనకు 20 మంది ఎంపీల బలం ఉందని గుర్తు పెట్టుకోవాలి.. ఆ రోజు అంటే 1996 ఎన్నికల్లో యునైటెడ్ ఫ్రంట్ లో కాంగ్రెస్ – 161, జనతాదళ్ – 46 , సిపిఎం – 32 తరువాత పెద్ద పార్టీ ముపనార్ తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ ) – 20 సీట్లు.. వీరి తరువాత డీఎంకే 17, సమాజ్ వాదీ పారి 17, టీడీపీ 16 సీట్ల బలం ఉండేది…

ఇప్పుడు సందర్భం… తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవటం.. 40 ఏళ్ళ యువకుడైన మాజీ IPS ఆఫీసర్ కే .అన్నామలై 2019లో ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరి అధ్యక్ష పదవి చేపట్టి తమిళనాడులో బీజేపీ బలం పెంచటం కోసం గత నాలుగేళ్లుగా ప్రయత్నం చేస్తున్నారు..

మాజీ సీఎం అన్నాదురై మీద విమర్శ చేయటానికి తమిళనాడులో ఏ పార్టీ నాయకులు ధైర్యం చేయరు.. కానీ అన్నామలై జయలలిత, స్టాలిన్ తో పాటు అన్నాదురై మీద కూడా విమర్శలు చేశారు.. ద్రవిడ సిద్ధాంతానికి భిన్నంగా హిందూ వాదంతో చాలా ప్రదర్శనలు చేశారు.. అన్నామలై తమిళనాడులో బీజేపీకి పునాదులు వేస్తాడు అనే స్థాయిలో ప్రచారం జరిగింది..

అన్నామలై మొదటి నుంచి బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకోకుండా సొంతగా పోటీ చేయాలని అధిష్టానం పెద్దలకు చెప్పేవాడు.. కర్ణాటక IPS క్యాడర్ లో పనిచేస్తున్న అన్నామలైని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన బీజేపీ స్ట్రాటజిస్ట్ బి.యల్.సంతోష్ కూడా అన్నామలై ప్రయత్నానికి మద్దతు ఇచ్చారు.. మరో మెంటార్ గుర్తుమూర్తి మద్దతు అన్నామలై కి పూర్తిగా ఉండేది కానీ జాతీయ పార్టీల ఆలోచన మరో విధంగా ఉంటుంది.. ఢిల్లీ తీరే వేరు అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ..

వచ్చే ఏప్రిల్ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.. మాజీ సీఎం అన్నాడీఎంకే నేత పళని స్వామితో బీజేపీ పెద్దలు పొత్తు కోసం చర్చలు మొదలు పెట్టారు.. పళనిస్వామి అప్రకటిత కండీషన్ అన్నామలై ని పక్కన పెట్టమనటం.. ఇక్కడ కూడా కులమే..

మనకంటే తమిళనాడులో కులం బలం ఎక్కువ.. కాకుంటే మన దగ్గర నాలుగైదు కులాలదే ఆధిపత్యం అయితే తమిళ నాడులో కనీసం పది పన్నెండు కులాల ఆధిపత్యం ఉంటుంది.. పళనిస్వామి, అన్నామలై ఇద్దరూ కొంగునాడు (కోయంబత్తూర్, తిరుపూర్, సేలం ప్రాంతం)కు చెందినవారే , ఇద్దరూ కూడా గౌండర్ కులస్తులే..

ఇది పళని స్వామికి రాజకీయంగా ఇబ్బంది కలిగిస్తుంది.. గత 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకొని పోటీ చేసి 75 (అన్నాడీఎంకే 66, బీజేపీ 4, పీఎంకే 5 )స్థానాలు గెలిచారు .. తమిళనాడు చరిత్రలో ఓడిపోయిన కూటమికి ఇన్నీ సీట్లు రావటం ఇదే మొదటిసారి.. 1996 ఎన్నికల్లో డీఎంకే , మూపనార్ పార్టీ 231 సీట్లు గెలవగా అన్నా డీఎంకే కేవలం మూడు సీట్లు గెలిచింది..

2021 కి ఇప్పటికి పెద్ద తేడా.. అన్నాడీఎంకే చీలిక వర్గాలు మాజీ సీఎం పన్నీరు సెల్వం, శశికళ, దినకరన్ పూర్తిగా బలహీనపడటం.. మొత్తం పార్టీ పళని స్వామికి మద్దతుగా ఉంది.. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే గెలిచే అవకాశం ఉంది లేదా బలం చాలా పెరుగుతుందనే అంచనాతో బీజేపీ ఢిల్లీ పెద్దలు మళ్ళీ అన్నా డీఎంకే తో పొత్తుకు సిద్ధమయ్యారు.. అన్నామలై బలయ్యాడు.. రాజకీయాల్లో ఇలా బలవంతపు త్యాగాలు చేయవలసి రావటం సహజం ..

నాడు మూపనార్ ఏమి చేసాడు?
రాజీవ్ గాంధీ హత్య తరువాత తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతిపాలన పెట్టారు.. 1991 జూన్ లో జరిగిన ఎన్నికల్లో అన్నా డీఎంకే , కాంగ్రెస్ కూటమి 225 సీట్లు గెలవగా డీఎంకే కూటమి కేవలం ఏడు సీట్లే గెలిచింది..

జయలలిత సీఎం అయ్యారు.. కాలక్రమంలో కాంగ్రెస్ తో విబేధాలు ఎక్కువై చివరికి కాంగ్రెస్ కూటమి నుంచి బయటకొచ్చింది. ఒక దశలో రజనీకాంత్ ను కాంగ్రెస్ లో చేర్చటానికి మూపనార్ చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కనిపించాయి. రజనీకాంత్ ఢిల్లీ వెళ్లి నాటి ప్రధాని పీవీ గారితో సమావేశం అయ్యారు.. ఆయన పార్టీలో చేరటానికి అంగీకరించారనే సమాచారంతో మద్రాస్ ఎయిర్పోర్ట్ ముందు కాంగ్రెస్ శ్రేణులు బారులు తీరాయి కానీ రజినీకాంత్ బయటకు రాలేదు కాంగ్రేస్ లో చేరలేదు..

1996 ఎన్నికల ముందు పీవీ మరోసారి అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధం అయ్యారు.. దాన్ని వ్యతిరేకిస్తూ మూపనార్, చిదంబరం కలిసి తమిళ మానీల కాంగ్రెస్ (టీఎంసీ )ని స్థాపించి డీఎంకే తో పొత్తుపెట్టుకొని అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో పోటీచేసి 39, లోక్ సభ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీచేసి మొత్తం 20 గెలిచారు..

ఇప్పుడు అన్నామలై బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవటానికి వ్యతిరేకంగా పార్టీ నుంచి బయటకొచ్చి తమిళ జనతా పార్టీ అని పార్టీ పెట్టలేరు, పెట్టినా ఒక్కసీటు గెలవలేరు.. జాతీయ పార్టీలలో ఢిల్లీ అనుకున్నదే జరుగుతుంది..

నేను సెక్యులర్ ను , బీజేపీకి మద్దతు ఇవ్వను అని 1999లో ఒక్క ఓటుతో వీగిపోయిన విశ్వాసపరీక్షలో వాజ్‌పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూపనార్ పార్టీ ఓటు వేసింది. 2014 తరువాత కాంగ్రేస్ నుంచి బయటకొచ్చి మళ్ళీ టీఎంసీని పునరుద్దించిన మూపనార్ కొడుకు జికే. వాసన్ మాత్రం 2021 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఒక్కసీటు కూడా గెలవలేకపోయాడు….

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!
  • పాకిస్థాన్‌కు కుడిఎడమల వాయింపు… చైనా అమ్మిన సరుకు తుస్సు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions