మామూలు సందర్భాల్లోనే తెలుగుదేశం జెండాను, ఎజెండాను చంద్రబాబుకన్నా, తెలుగుదేశం పార్టీకన్నా ఎక్కువగా మోసే తత్వం ఆంధ్రజ్యోతిది… ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేసిన విశేష సందర్భంలో ఇక ఎలా ఊరుకుంటుంది..? రాధాకృష్ణ తన తాజా కొత్తపలుకు వ్యాసంలో దీన్నే ప్రస్తావించకుండా, జగన్‌ను తిట్టిపోయకుండా, చంద్రబాబుకు భరోసాగా ఉండకుండా ఉండలేడు కదా… అయితే ఈసారి కాస్త ఆశ్చర్యం…
జరిగిందేదో మంచికే జరిగింది… ఏం పర్లేదు, ఇదీ ఒకందుకు మంచిదే… అనే ధోరణి తీసుకోవడం విశేషమనిపించింది… ఇదేదో పాజిటివ్ వైబ్ అనుకోనక్కర్లేదు… ఇకపై నేను నిప్పు, జగన్ తుప్పు వంటి వ్యాఖ్యలు చేయకుండా చంద్రబాబుకు కూడా అవినీతి మరక అంటింది… సో, ఇప్పుడిక రాతల స్టయిల్ ఛేంజ్… అబ్బే, ప్రజలు రాజకీయ నాయకుల అవినీతిని పట్టించుకోవడం మానేశారు… అనే వింత వాదనను అందుకుంది ఆంధ్రజ్యోతి… ఇది చెబితే తెలుగుదేశం క్యాంపు చెప్పినట్టే కదా…
‘‘డబ్బులు తీసుకోకుండా పార్టీలు ఎలా నడుస్తయ్..? బరాబర్ డబ్బులు తీసుకుంటామని కేసీయార్ కూడా చెప్పాడు… జగన్ అవినీతిని ప్రజలు పట్టించుకున్నారా..? సీఎం కుర్చీ ఎక్కించారు కదా… రాజకీయ నాయకుల్లో డబ్బులు తీసుకోనివాళ్లు ఎవరున్నారు..? సో, జనం ఇవేమీ పట్టించుకోరు… అసలు ఆ కేసులో దమ్మే లేదు… ఐటీ నోటీసుల్లోనూ దమ్ము లేదు… ఇవేవీ చంద్రబాబును అడ్డుకోలేవు… పోనీ, తనను జైలులోనే ఉంచితే లోకేష్ లేడా..?’’ ఇలా సాగిపోయింది కొత్త పలుకులోని మథనం…
Ads
ఒక పత్రికాధిపతి బహిరంగంగా సమర్థిస్తున్నాడు అవినీతిని..! అంతేకాదు, కేవలం పార్టీ అవసరాలకు మాత్రమే అవినీతి తప్పడం లేదు, తప్పు కాదు అని సూత్రీకరిస్తున్నాడు… తప్పనడం లేదు… ఎస్, చంద్రబాబు అవినీతి రుజువు కాలేదు… కావడం కష్టం… జయలలిత, కనిమొళి, లాలూ వంటి కొన్ని చాలా తక్కువ కేసుల్లోనే శిక్షల దాకా వెళ్లాయి కేసులు… ఈ కేసులతో అర్జెంటుగా చంద్రబాబుకు ఏదో కఠినశిక్ష పడుతుందని ఎవరూ అనుకోవడం లేదు… కానీ ఇలాంటి కొత్త నీతుల రాతలే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటయ్… పైగా ఇందిరాగాంధీ నుంచి జగన్ దాకా అవినీతి మరకలు పడిన వారందరికీ జనం అధికారం అప్పగించారట… సో, మా చంద్రబాబుకూ ఫికర్ లేదు… ఈసారి ఎన్నికల్లో అధికారం ఖాయమే అన్నట్టుగా ఉంది కొత్తపలుకు పోకడ…
రాధాకృష్ణ పదే పదే చెప్పినా సరే చంద్రబాబు వినలేదట… రాజకీయాల్లో బెరుకు ఉండకూడదు అని చెప్పాడట… ఒకసారి జైలుకు లేదా పోలీస్ స్టేషన్‌కు వెళ్లొచ్చినవాడికి పోలీసులు, కేసులపై భయం పోయినట్టు ఇకపై చంద్రబాబు ఇంకా రాటుతేలతాడట… ఆ బెరుకు పోయి, మరింతగా గట్టి రాజకీయాలు చేస్తాడట… సో, ఇదంతా పార్టీ మంచికే అంటాడు ఆంధ్రజ్యోతి అధినేత… పోతేపోనీ, చంద్రబాబు జైలు నుంచి రాకపోతేనేం, మా లోకేష్ ఇప్పటికే పప్పు ముద్రల నుంచి బయటపడి ప్రూవ్ చేసుకుంటున్నాడు… తను అందుకుంటాడు పార్టీ పగ్గాల్ని అని కూడా సారాంశీకరించాడు రాధాకృష్ణ…
ఏం..? గతంలో జగన్ జైలుపాలయితే విజయమ్మ, షర్మిల పార్టీని నడిపించలేదా..? అవసరమైతే ఇప్పుడు చంద్రబాబు భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కూడా పార్టీ వ్యవహారాల్లోకి వస్తారని కూడా రాధాకృష్ణ తేల్చేశాడు… గుడ్… మంచిదే… కానీ జగన్ కొరడా ఎవరినీ వదిలిపెట్టదు… అది మరీ మొండి కొరడాా… మార్గదర్శి మీద పడ్డట్టుగానే హెరిటేజ్ మీద కూడా పడే ప్రమాదమైతే ఉంది… జగన్‌కు ప్రూనింగ్ (కొమ్మలు కొట్టడం) మీద పెద్ద నమ్మకం ఉండదు… వేళ్లను తవ్వుతాడు… (రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్)… మనం చూస్తున్నదీ అదే… సో, లోకేష్‌కూ అరెస్టు ప్రమాదం ఉందనే అనుకోవాలి…
ఇదే ఆంధ్రజ్యోతి ఎన్నాళ్లుగానే ఆశపడుతున్నట్టు ఒకవేళ జగన్ బెయిల్ రద్దయి తిరిగి జైలులోకి వెళ్లే పరిస్థితి ఎదురైతే..? ఏముంది..? ఈ ఇద్దరూ ప్లస్ లోకేష్ జైలులో… బయట టీడీపీ పగ్గాలు పట్టుకుని భువనేశ్వరి… వైసీపీ పగ్గాలతో విజయమ్మ లేదా భారతీరెడ్డి… బీజేపీ పగ్గాలతో పురంధేశ్వరి… ఏమో… ఇలాంటి చిత్రాల్ని కూడా చూస్తామేమో… డెస్టినీ చాలా బలమైంది చంద్రబాబు గారూ… జరిగినా జరగొచ్చు… లేదా ఈ చంద్రబాబును ఈ దేశ జైళ్లు కట్టి ఉంచలేవు, నలభై ఏళ్ల నిప్పుకు మరకలు అంటలేవు అంటారా… అదీ మంచిదే… అదే ఆశిద్దాం…
Share this Article