Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బీజేపీలో మోస్ట్ లక్కీ కేరక్టర్..! ఇక పొలిటికల్ కెరీర్‌కు ఫుల్లు స్టాపేనా… లేక…!?

August 9, 2022 by M S R

ఎస్… వెంకయ్యనాయుడి సుదీర్ఘ రాజకీయ జీవితానికి ఈరోజుతో ఫుల్ స్టాప్…! రాష్ట్రపతి చాన్స్ రాలేదు… ఉపరాష్ట్రపతిగా రెండుసార్లు ఉండొచ్చు, కానీ ఆ చాన్స్ కూడా రాలేదు… ఒకవేళ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తానన్నా బీజేపీ అంగీకరించదు… టీడీపీ వోకే కానీ అందులో ఏ స్థాయిలో ఇమడగలడు..? పైగా తన జీవితమంతా బీజేపీకే కమిటెడ్… అడుగు కూడా పక్కకు వేయలేదు… పార్టీ చెప్పినట్టల్లా చేశాడు… స్వరాష్ట్రంలో పార్టీకి ఏం చేశాడు అనే ప్రశ్న మాత్రం కాస్త సంక్లిష్టం… ఒక్క వ్యక్తి మాత్రమే చేయగలిగేది ఏముంటుంది..?

ఎస్, బీజేపీకన్నా తను టీడీపీ ప్రయోజనాలనే ఎక్కువ కాంక్షించాడనే విమర్శ తనపై ఉంది… పార్టీకి తను ఏం ఉపయోగపడ్డాడనేది వదిలేస్తే పార్టీ తనకు బాగా ఉపయోగపడింది… జనసంఘ్, బీజేపీల నుంచి బోలెడు మంది సమర్థులు, ప్రాణాలకు తెగించి ఏళ్లకేళ్లు కష్టపడిన నాయకులున్నారు… వాళ్లెవరికీ రాని అవకాశాలు వెంకయ్య నాయుడికి వచ్చాయి… బీజేపీ వెంకయ్యనాయుడికి ద్రోహం చేసిందని ఎవరైనా విమర్శిస్తే అంతకుమించిన మూర్ఖపు వ్యాఖ్య మరొకటి ఉండదు…

ఈనేపథ్యంలో మిత్రుడు Vaddadi Srinivasu..  రాసిన ఓ విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది… మనం మొత్తం ఏకీభవించాలని లేదు… తను ఉట్టిగా ఊరుకునే కేరక్టర్ కాదు, రేపటి నుంచి తనకు ఉపరాష్ట్రపతి అనే బంధనాలు ఉండవు… పార్టీపరమైన ఆంక్షలు ఉండవు… స్వేచ్ఛాజీవి… మరేం చేయబోతున్నాడు..? ఈ ప్రశ్నకు జవాబు ఎలా ఉన్నా… ఒక్కసారి వెంకయ్యనాయుడి రాజకీయ జీవితంపై స్థూలావలోకనం అవసరమే… అదీ ఇది…

Ads



రాజకీయ అదృష్ట జాతకుడు… వెంకయ్య నాయుడు

–––––––––––––––––––––––––––––––

ముప్పవరపు వెంకయ్య నాయుడు… సుదీర్ఘ రాజకీయ జీవితం నుంచి విశ్రమించారు. విద్యార్థి సంఘం నేత నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, ప్రజా ప్రతినిధిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి చేరుకుని, ఉప రాష్ట్రపతిగా ఐదేళ్లు పదవీ బాధ్యతలు నిర్వర్తించి, రాజకీయ యవనిక మీద నుంచి పక్కకు తప్పుకున్నారు.

రాష్ట్రపతి కావాలని ఎవరికి ఉండదు ! సుదీర్ఘ కాలం జాతీయ రాజకీయాల్లో ఉన్నవారు ప్రధానమంత్రి పదవి దక్కకపోయినా, రాష్ట్రపతిగా పదవి చేపట్టి ఢిల్లీలోని రైసినా హిల్స్‌లోని రాష్ట్రపతి భవన్‌లోకి అడుగుపెట్టాలని కోరుకోవడం సహజమే కదా. అందుకు వెంకయ్య నాయుడు కూడా మినహాయింపు కాదు. (తాను రాష్ట్రపతి కావాలని కోరుకోలేదని ఉప రాష్ట్రపతిగా వీడ్కోలు సమావేశంలో ఆయన చెప్పారు. కానీ అది సభా మర్యాద కోసం చెప్పిందే తప్ప నిజం కాదన్నది అందరికీ తెలిసిందే.)

ఒడిశాకు చెందిన ఆదివాసి మహిళ నేత ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడతో ఆయన ఆశ నెరవేరలేదు. అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత అంశం. వెంకయ్య నాయుడు దేశ అత్యున్నత పదవికి ఒక్క మెట్టు దూరంలోనే ఆగిపోయి, ప్రజా జీవితం నుంచి విశ్రమించాల్సి వచ్చింది. రాష్ట్రపతిగా అవకాశం దక్కకపోవడంపై వెంకయ్య నాయుడు హుందాగానే ప్రవర్తించారు. ఆయనలో ఆ పరిణతి ఉంది. అంతకుమించి ఆయన చేయగలిగింది కూడా ఏమీ లేదు. కానీ రాష్ట్రపతిగా అవకాశం కల్పించనంత మాత్రాన ఆయనకు బీజేపీ ఏదో అన్యాయం చేసిందనే కొందరి వాదన పూర్తిగా అసంబద్ధం. బీజేపీలో వెంకయ్య నాయుడి అంతటి అదృష్టవంతుడు మరొకరు ఉండరన్నది అసలు నిజం.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో మేలి మలుపు వంటి 1978 బ్యాచ్‌కు చెందిన నేత వెంకయ్య నాయుడు. దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితుల నేపథ్యంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ రాజకీయ చైతన్యం ఆంధ్ర ప్రదేశ్‌లోనూ బలమైన ప్రభావాన్ని చూపింది. 1978 శాసనసభ ఎన్నికలతో కాంగ్రెస్, కాంగ్రెస్‌ వ్యతిరేక భావజాలం ఉన్న ఉత్సాహవంతులైన యువకులు రాజకీయ యవనిక మీదకు వచ్చి నాలుగు దశాబ్దాలపాటు దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పదవులు చేపట్టారు.

ఆ బ్యాచ్‌కు చెందిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు ముఖ్యమంత్రులయ్యారు. ఎస్‌. జైపాల్‌ రెడ్డి, ఎం. వెంకయ్య నాయుడు జాతీయ రాజకీయాల్లో తెలుగు ముద్ర వేశారు. అశోక్‌ గజపతిరాజు, కేఈ కృష్ణమూర్తి, పి.జనార్ధన్‌ రెడ్డి, శత్రుచర్ల విజయరామరాజు మొదలైన వారు సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో కీలక పదవులు నిర్వర్తించారు. వైఎస్‌ఆర్, చంద్రబాబు, జైపాల్‌ రెడ్డి, అశోక్‌ గజపతి రాజు, కేఈ కృష్ణమూర్తి, శత్రుచర్ల విజయరామరాజు మొదలైనవారు ఉమ్మడి ఏపీలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలలో ఉన్నారు.

అశోక్‌ గజపతిరాజు వంటి కొందరు జనతా పార్టీ తరపున 1978లో ఎమ్మెల్యేలుగా గెలిచినా 1982లో టీడీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. కాబట్టి వారు 40ఏళ్లపాటు రాజకీయాల్లో కీలక పదవులు నిర్వహించే అవకాశం వచ్చింది. కానీ ఏపీలో ఏమాత్రం ప్రభావం చూపని బీజేపీలో ఉంటూ వెంకయ్య నాయుడు 40 ఏళ్ల పాటు దేశంలోనే అత్యున్నత పదవులు అధిష్టించడం ప్రాధాన్యం సంతరించుకోవడంతోపాటు అందరినీ విస్మయపరిచే అంశం కూడా…

సొంత రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఎంపీగా గెలిచే అవకాశాలు లేవని స్పష్టం కావడంతో వెంకయ్య నాయుడుకు 1998లో కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించారు. అప్పటి నుంచి ఆయన ఇతర రాష్ట్రాల నుంచే 2017 వరకూ రాజ్యసభ్యకు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటివరకు కేంద్రంలో బీజేపీ తరపున ప్రధానమంత్రుగా వ్యవహరించిన అటల్‌ బిహారీ వాజ్‌పేయి, నరేంద్ర మోదీ ఇద్దరి మంత్రివర్గాల్లోనూ ఆయన మంత్రిగా చేశారు. 2017 నుంచి 2022 వరకు ఉప రాష్ట్రపతిగా ఉన్నారు. అంటే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. 2002 నుంచి 2004 మధ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అంటే కేంద్ర మంత్రికంటే ఉన్నతమైన పదవిగానే పరిగణించాలి… ఏం తక్కువ చేసింది పార్టీ తనకు..?

పోనీ… వెంకయ్య నాయుడు క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టతకు ఏమైనా చేశారా అంటే ఇదీ అని చెప్పుకోడానికి ఏమీ లేదన్నది కూడా కాదనలేని వాస్తవం. పూర్వపు జనసంఘ్‌ పార్టీ 1980లో జనతా పార్టీగా ఆవిర్భవించిన సమయంలో వెంకయ్య నాయుడు ఆ పార్టీ ఆవిర్భావ సభ్యుడు. ఆ రోజు పార్టీ ఆవిర్భావ సభ్యులుగా ఉన్న అటల్‌ బీహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అడ్వాణీ వంటి అగ్రనేతలతోపాటు భైరాన్‌ సింగ్‌ షెకావత్, మురళీ మనోహర్‌ జోషి, సుందర్‌లాల్‌ పట్వా, విజయరాజే సింథియా, మదన్‌లాల్‌ ఖురానా, సుస్మా స్వరాజ్, కల్యాణ్‌ సింగ్, ప్రమోద్‌ మహాజన్, బీఎస్‌ యడ్యూరప్ప మొదలైన నేతలు ఈ 40 ఏళ్లలో తమ తమ రాష్ట్రాల్లో బీజేపీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేశారు.

ఆ రాష్ట్రాల్లో బీజేపీ కొన్నిసార్లు అధికారంలోకి వచ్చింది. మరికొన్ని సార్లు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కానీ ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావడమో ప్రధాన ప్రతిపక్షంగా ఉండటమో అన్నది ఆ పార్టీ కార్యకర్తలు కనీసం కలలో కూడా ఊహించడానికే లేదు. అంతేకాదు… వెంకయ్య నాయుడు జనతా పార్టీ తరపున 1978లో తొలిసారి, అనంతరం టీడీపీ మద్దతుతో బీజేపీ తరపున 1983లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉదయగిరి నియోజకవర్గంలో ఆ పార్టీ కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకునే స్థితిలో లేదు.

ఏపీలో బలపడేందుకు వచ్చిన ఒకట్రెండు అవకాశాలను బీజేపీ దుర్వినియోగం చేసుకోవడం వెనుక వెంకయ్య పాత్ర ఉందని ఆ పార్టీ నేతలే విమర్శిస్తుంటారు కూడా. అరుణ్‌ జైట్లీ, రవిశంకర్‌ ప్రసాద్‌ వంటి అగ్రనేతల మాదిరిగా పార్టీకి మేథోపరమైన సేవలు అందించే నేతా అంటే అదీ కాదు. వెంకయ్య నాయుడు మంచి వాగ్ధాటి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. ఆయన గొప్ప వక్త అంటూ తెలుగు మీడియా 30 ఏళ్లుగా రాస్తూ ఉండొచ్చు. కానీ అది పూర్తిగా వాస్తవం కాదు.

వెంకయ్య నాయుడి ప్రసంగాల్లో రాజకీయ పరమైన చమక్కులు, ఎన్టీఆర్‌ నటించిన వేటగాడు సినిమాలో రావు గోపాల్‌రావు మాట్లాడినట్టు అంత్య ప్రాసలతో చేసే కనికట్టే ఉంటుంది. ఆయనది పక్తూ రాజకీయ ప్రసంగమే. అంటే బహిరంగ సభల్లోనో, ప్రెస్‌మీట్లలోనో, కొన్నిసార్లు పార్లమెంటులోనో తమ పార్టీని సమర్థించడానికి, ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికి పనికి వచ్చే ప్రసంగం మాత్రమే. అంతేగానీ ప్రభుత్వ విధానపరమైన అంశాలు, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై నిశితంగా విశ్లేషణాత్మకంగా ఆయన ప్రసంగించిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి.

జార్జ్‌ ఫెర్నాండేజ్, మధు దండావతే, జైపాల్‌ రెడ్డి, అరుణ్‌ జైట్లీ, కపిల్‌ సిబల్‌ల నుంచి ఇటీవల లద్ధాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రసంగించిన లద్ధాఖ్‌ ఎంపీ జమ్యాంగ్‌ నగ్మ్యాల్‌ వంటి నవతరం నేతల తరహాలో వెంకయ్య ఏనాడూ పార్లమెంటులో ఒక విధానపరమైన అంశంపై ప్రశంసనీయమైన రీతిలో ప్రసంగించనే లేదు. ఇక కేంద్ర గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖల మంత్రిగా ఆ శాఖల విధాన నిర్ణయాల్లో ఆయన చెప్పుకోదగ్గ ముద్ర వేయలేకపోయారు.

ఇక ఉప రాష్ట్రపతిగా ఎన్నికైన తరువాత తెలుగు రాష్ట్రాలోని విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌లలో సన్నిహితులతో ఆయన నిర్వహించిన ఆత్మీయ సమావేశాలు ‘వర్గ’ సమావేశాలుగా ముద్రపడ్డాయి. ఆ సమావేశాల్లో వ్యక్తిగత హోదాలో మాట్లాడుతున్నానని చెప్పినప్పటికీ ఆయన మాటలు ఉప రాష్ట్రపతి స్థాయికి తగ్గట్టుగా లేవన్నది చాలా మంది గుర్తించని నిజం.

వెంకయ్య నాయుడి గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒక్కటే… ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాదు, దేశంలో కూడా బీజేపీ అధికారంలోకి కాదు కదా, కనీసం ప్రధాన ప్రతిపక్షంగానైనా నిలుస్తుందన్న నమ్మకం ఏమాత్రం లేని 1980 దశకం తొలినాళ్ల నుంచి కూడా పార్టీ మారకుండా బీజేపీలోనే కొనసాగారు. పార్టీలో కొనసాగడం అనే ఒకే ఒక్క అర్హతతో వెంకయ్య బీజేపీలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

 

1980 నుంచి 1998 వరకు ఉత్తరాది పార్టీగానే ముద్రపడిన బీజేపీకి దక్షిణాది నుంచి ఒక నేతను తప్పనిసరిగా ప్రోత్సహించాల్సిన అనివార్యతను కూడా ఆయన తనకు అనుకూలంగా మలచుకున్నారు. వెంకయ్య నాయుడు, బీజేపీ పరస్పర ప్రయోజనకర నిష్పత్తిని చెప్పాలంటే 25: 75 అనొచ్చు. అంటే పార్టీకి 25 శాతం సేవ చేసి పార్టీ నుంచి 75 శాతం ప్రయోజనం పొందిన నేత వెంకయ్య నాయుడు. చాలా తక్కువ శాతం మంది రాజకీయ నేతలు దక్కే రాజయోగం అది.

వెంకయ్య నాయుడును ఆయన సమకాలికులతో పోల్చుకుంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు ఆయన తన పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురాలేదు. సినిమా రంగంలో స్టార్‌ హోదా అనుభవించి, ఆర్థికంగా కూడా ఎంతో స్థితిమంతుడిగా ఎదిగిన శోభన్‌బాబు తన పిల్లల్ని సినిమాల్లోకి తీసుకురాలేదు. తాను ఎంతో కష్టపడి సంపాదించిన భారీ ఆస్తుల్ని తన వారసులను హాయిగా ఎంజాయ్‌ చేయమన్నారు. అదే రీతిలో రాజకీయాల్లో వెంకయ్య నాయుడు వ్యవహరించారనే చెప్పాలి. తన కొడుకు, కూతురును వ్యాపార రంగాల్లో స్థిరపరిచారు. రాజకీయ బాదరబందీ లేకుండా జీవితాన్ని హాయిగా ఆస్వాదించమన్నారు.

వెంకయ్య నాయుడి విషయంలో అందరూ ఒప్పుకోవాల్సిన విషయం మాత్రం ఒకటుంది… భవిష్యత్‌లో ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి జాతీయ రాజకీయాల్లో అంతటి స్థానానికి చేరే నేత కనుచూపు మేరలో కనిపించడం లేదన్నది వాస్తవం. తెలంగాణ నేతలకు ఆ స్థాయిలో అవకాశాలు రావచ్చు. ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉన్నాయి. భవిష్యత్‌లో మరింత బలపడే అవకాశాలూ ఉన్నాయి.

ఆంధ్ర ప్రదేశ్‌లో మాత్రం జాతీయ పార్టీల ఉనికే ప్రశ్నార్థకంలో ఉంది. కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. బీజేపీ బలపడే అవకాశాలు దాదాపు లేవు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడితే ఏపీలోని ప్రాంతీయ పార్టీల నేతలకు జాతీయ రాజకీయాల్లో అవకాశం రావచ్చు. కానీ అది తాత్కాలికమే తప్ప..శాశ్వత ప్రాతిపదికన జాతీయ రాజకీయాల్లో ఏపీ నేతలు ఎవరూ రాణించడం దాదాపు అసాధ్యం. ఆ కోణంలో ఏపీ నుంచి జాతీయ రాజకీయాల్లో వెంకయ్య నాయుడి స్థాయికి కనీసం రాబోయే రెండు దశాబ్దాల్లో ఎవరూ చేరుకునే అవకాశాలు లేవన్నది మాత్రం సుస్పష్టం.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions