ఇది దిశ అనే ఈ-పేపర్‌లో ఫస్ట్ పేజీలో కనిపించిన సవరణ… (ఐనా ఇయ్యాల్రేపు చాలా చిన్న పత్రికలు పేరుకే ప్రింట్.., ఆచరణలో వెబ్, వాట్సప్ ఎడిషన్లే కదా… రాబోయే రోజుల్లో ఇక డిజిటల్ ఎడిషన్లదే రాజ్యం…) ఇంతకీ విషయం ఏమిటయ్యా అంటే… మొన్న సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ హైదరాబాద్ వచ్చాడు కదా… టీఆర్ఎస్‌కు ఓటేయొద్దు, ఆ పార్టీ బీజేపీకి బీ టీం అన్నట్టుగా ఈ పత్రిక ఓ వార్త రాసింది… కానీ నిజానికి ఆయన టీఆర్ఎస్ మీద నేరుగా ఆ విమర్శ చేయలేదు… ఇక్కడ ఓ పార్టీ బీజేపీకి బీ టీం, దాన్ని తెలంగాణ దాటి ఢిల్లీకి రానివ్వద్దని, ఇక్కడే కట్టి పడేయాలనీ అన్నాడు… ఈమధ్య కేసీయార్ ఢిల్లీ పయనాల నేపథ్యంలో ఆయన కూడా టీఆర్ఎస్‌ను విమర్శిస్తున్నాడేమో అనుకున్నారు కొందరు జర్నలిస్టులు… దాంతో అలాగే రాసేశారు… తరువాత నాలుక కర్చుకుని ఈ పత్రిక ‘‘చింతిస్తున్నాం’’ అని ఓ సవరణ పెట్టేసింది…
నిజానికి ఇక్కడ సమస్య రిపోర్టర్‌ది మాత్రమే కాదు… హైదరాబాదులో పనిచేసే చాలామంది లోకల్ రిపోర్టర్లకు హిందీ బాగానే అర్థమవుతుంది… సరే, తప్పు రాశాడే అనుకుందాం… మరి ఈ పత్రిక ఓసారి డైనమిక్ ఎడిషన్ అనీ, తెల్లవారి రెగ్యులర్ ఎడిషన్ అనీ వేస్తుంది కదా… డైనమిక్ ఎడిషన్‌లో వార్త వేశాక, రెగ్యులర్ ఎడిషన్ లోపు తప్పొప్పులు చూసుకోవాలి కదా… ఫీడ్ బ్యాక్ గమనించాలి కదా… అన్నింటికీ మించి రాకేశ్ టికాయత్ మాటలకు చాలా ప్రాధాన్యం ఉంది… ఎందుకంటే..? అంతకుముందే కేసీయార్ 700 మంది రైతు కుటుంబాలకు 3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించి ఉన్నాడు… ఇవే రైతుసంఘాలు కేసీయార్ ప్రకటనను స్వాగతించాయి… సరే, కేసీయార్ ఢిల్లీ వెళ్లినా సరే, మళ్లీ ఆ ఊసు ఎత్తలేదు, ఎవరినీ కలవలేదు, అది వేరే కథ… కానీ ఈ నేపథ్యంలో మూడు అగ్రిచట్టాల రద్దుకు కారకుడిని, మోడీ మెడలు వంచాను, ఇంకా వంచుతాను అని ఫీలవుతున్న ఓ రైతుసంఘం నేత హైదరాబాద్‌కు వచ్చీ కేసీయార్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నాడంటే అందరిలోనూ ఆశ్చర్యం…
Ads
అలాంటప్పుడు పత్రిక బాధ్యులు ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి కదా… దాదాపు అన్ని చానెళ్లలోనూ రాకేశ్ ఏం మాట్లాడాడో వచ్చింది, జాగ్రత్తగా వింటే, ఆయన ఏ పార్టీని ఉద్దేశించి విమర్శలు చేస్తున్నాడు, మన రిపోర్టర్ ఏం రాశాడు అని చూసుకోవచ్చు కదా… అదుగో అది సరిగ్గా జరక్కపోవడమే ఇలాంటి తప్పులకు కారణం… రిపోర్టర్ కొన్నిసార్లు పొరపాటు చేయొచ్చు, చేయొద్దని ఏముంది..? అన్ని పత్రికల్లోనూ ఇలాంటివి జరుగుతూనే ఉంటయ్… After all we are Humans, Not Electronic Devices… కాకపోతే తప్పులు దొర్లకుండా, ఎప్పటికప్పుడు మనం ఎన్నిరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేదే ముఖ్యం…
ఇలాంటివి ఉద్దేశపూర్వకం కాదు, కాకపోవచ్చు, కానీ హర్ట్ అయిన పార్టీ, దాని నాయకులు నెగెటివ్‌గా స్వీకరించే ప్రమాదం ఉంది… సహజం… అలాగే ‘చింతిస్తున్నాం’ అనే పదానికి తోడుగా ‘క్షమించండి’ అంటే ఇంకా బాగుండేది… తప్పును అంగీకరిస్తున్నప్పుడు క్షమాపణ అడగడం చిన్నతనమేమీ కాదు, హుందాతనమే… అంతటి మోడీయే చట్టాల్ని రద్దు చేస్తూ, జాతికి క్షమాపణలు చెప్పాడు… గుర్తుంది కదా… ‘మేం తప్పుడు కథనాలు రాయం, మేం వాస్తవం వైపే పయనిస్తాం, ఏ పార్టీకి కొమ్ముకాయం, ఏపార్టీని నిందించం’ వంటి పదాల్ని ఆంధ్రజ్యోతి భాషలో బ్లా బ్లా అచ్చేసుకోవడం కూడా అనవసరం… మనమేమిటో పాఠకులు చెప్పాలి, మనది మనమే చెప్పుకోవడం కాదు…!! (ఈ పత్రిక బాగా చింతిస్తున్నట్టు ఓ పోస్ట్ నిన్న సోషల్ మీడియాలో కాసేపు చక్కర్లు కొట్టింది, కాకపోతే డైనమిక్ ఎడిషన్లలో కూడా ఈ చింతన ఏమీ కనిపించకపోవడంతో ఫేక్ అని అందరూ వదిలేశారు…)
Share this Article