.
కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయింది… యుద్ధ మృతులకు కర్మకాండలు, తదుపరి పాలకుడికి పట్టాభిషేకం కూడా జరిగిపోయాయి… యుద్ధపాపం బాపతు ఏదో అపరాధభావన తనలో కలిగిందో ఏమో గానీ… పరిహారార్థం ధర్మరాజుకు తీర్ధయాత్రలు చేయాలని కోరిక కలిగింది…
తనకు తోడు రావల్సిందిగా శ్రీకృష్ణుడిని ఆహ్వనిస్తాడు… ‘నువ్వు వెళ్లు యుధిష్టిరా… నాకు ద్వారకలో చక్కబెట్టుకునే రాచకార్యాలు బోలెడున్నాయి… చాన్నాళ్లయింది నేను లేక, నా రాజ్యం ఎలా ఉందో ఏమిటో… ఇప్పుడైతే నేను నీతో రాలేను’ అంటాడు శ్రీకృష్ణుడు… లేదు, రావాలి బావా అంటూ మొహమాటపెడతాడు ధర్మరాజు…
Ads
సరే, నేను రాలేను గానీ, నా ప్రతినిధిగా ఇదుగో దీన్ని నీతోపాటు తీసుకువెళ్లు అని ధర్మరాజుకు ఓ సొరకాయను ఇస్తాడు కృష్ణుడు… ఊరక చెప్పడుగా మహాత్ముడు అనుకుని ధర్మరాజు ఇక దాన్ని తన వెంటే తీసుకుని, తన పరివారంతోసహా తీర్థయాత్రలకు వెళ్తాడు… తను ఏ నదిలో మునిగినా, తన వెంట ఉన్న సొరకాయను శ్రీకృష్ణుడిగానే భావిస్తూ దాన్ని కూడా ముంచి తీసి, తుడిచేవాడు…
తీర్థయాత్రల నుంచి తిరిగి వచ్చాక, ఆహార సమారాధన నిర్వహించడానికి నిర్ణయించి, కనీసం దీనికైనా హాజరు కావాలని అడుగుతాడు కృష్ణుడిని… ఐనాసరే, కృష్ణుడు రాడు, ఆ సొరకాయను వండి, అందరికీ ప్రసాదంగా పెట్టాలని కోరతాడు… ధర్మరాజుకు తప్పలేదు…
తీరా వంట కటిక చేదు… తిన్న వాళ్లంతా వాంతులు చేసుకున్నారు… ఇదేం కృష్ణా, నీవిచ్చిన సొరకాయనే కదా, నేను ప్రసాదంగా పంపిణీ చేశాను, ఇలా చేశావేమిటి అని నిందాపూర్వకంగా అడుగుతాడు ధర్మరాజు…
అది చేదు సొరకాయ, నాకు ముందే తెలుసు… అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి, అన్ని తీర్థాల్లో మునిగినా దాని చేదు పోలేదా..? విచిత్రంగా ఉంది సుమా అని తనదైన ఓ మర్మగర్భిత నవ్వు విసురుతాడు కృష్ణుడు… ధర్మరాజుకి మర్మం అర్దమైంది… శ్రీకృష్ణపరమాత్మకి నమస్కరిస్తాడు…
ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా పాపాలు పోవు, కర్మ ఫలితం అనుభవించాల్సిందే అంటున్నాడా కృష్ణుడు..? ఇంకేదైనా చెప్పదలిచాడా..?
(రచయిత ఎవరో తెలియదు… పక్కా వాట్సప్ సేకరణ… పాతది కూడా… ఆ పోస్టులో ఉన్నట్టుగానే నేను అర్థంతరంగా కథను ముగించాను… ఈ కథలో నీతి ఏమిటో ఎవరికి వారే బాష్యం చెప్పుకొండి… ధర్మరాజుకు అర్థమైన ఆ మర్మం ఏమిటి..?)
Share this Article