Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

పుస్తె కట్టిన బ్రహ్మచారి Vs పుస్తె కట్టని బ్రహ్మచారి… అసలేమిటీ పుస్తెల లొల్లి…!

April 24, 2024 by M S R

మంగళసుత్రాపహరణ సూత్రీకరణ! కొంచెం డొంకతిరుగుడుగా అనిపించినా మొదట మనం కరీంనగర్ జిల్లా ధర్మపురి నరసింహస్వామి గుడి మెట్ల మీద కూర్చుని దాదాపు రెండొందల యాభై ఏళ్ల కిందట లోకరీతిని తూర్పారబట్టిన కవి శేషప్ప దగ్గరికి వెళ్లి…ఆ తరువాత మోడీ మంగసూత్రాపహరణ సూత్రీకరణ సిద్ధాంతం దగ్గరికి వద్దాం.

తెలుగు శతకసాహిత్యం అనంతం. అందులో కవి శేషప్ప నృసింహ శతకం సీస, తేటగీతి పద్యాలు తేటతెలుగుకు, భక్తి జ్ఞాన వైరాగ్యాలకు పెట్టింది పేరు. ఇప్పుడంటే తెలుగు జానీ పాపలు ఇంగ్లిష్ నోరు తెరిచి…ఇంగ్లిష్ రైమ్స్ ఈటింగ్ షుగర్ వల్ల బాల్యంలోనే ఇంగ్లిష్ ట్వింకిల్ ట్వింకిల్ మధుమేహం అంటుకుంటోంది కానీ…అర్ధ శతాబ్దం కిందటిదాకా తెలుగు పద్యం పాడని నోరు తెలుగు నోరే కాదు- ఢమ ఢమ ధ్వనితోడి ఢక్కగాక. అలాంటి ఒకానొక హృద్యమైన తెలుగు పద్యం స్వర్ణయుగపు వేళ కవి శేషప్ప పద్యాలు పల్లెల్లో పల్లకీ ఎక్కి ఊరేగాయి. రాగయుక్తంగా పాడుకోవడానికి సీస-తేటగీతి పద్యాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఏ పాదానికి ఆ పాదం చివర ఆపుకోవచ్చు. వచనంలో చెప్పినంత సరళంగా సీసంలో, తేటగీతిలో చెప్పవచ్చు. అందుకే ఆ ఛందస్సు పేరే “తేట- గీతి” అయ్యింది.

“తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు
వెళ్ళిపోయెడినాడు వెంట రాదు
లక్షాధికారైన లవణమన్నమె కాని
మెరుగు బంగారంబు మ్రింగ బోడు
విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని
కూడ బెట్టిన సొమ్ము కుడువబోడు
పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి
దాన ధర్మము లేక దాచి దాచి
తుదకు దొంగలకిత్తురో దొరలకవునో
తేనె జుంటీగ లియ్యవా తెరువరులకు”

Ads

“మాన్యంబులీయ సమర్థుఁడొక్కఁడు లేఁడు, మాన్యముల్ చెఱుప సమర్థులంత; యెండిన యూళ్ళ గోడెరిఁగింపఁ డెవ్వఁడుఁ; బండిన యూళ్ళకుఁ బ్రభువు లంత; యితడు పేద యటంచు నెఱిఁగింపఁ డెవ్వఁడు; గలవారి సిరులెన్నఁగలరు చాలఁ; దన యాలి చేష్టలఁ దప్పెన్నఁ డెవ్వఁడుఁ బెఱకాంత తప్పెన్నఁ బెద్దలంత”

“ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగఁబోదు, ధనమెప్పటికి శాశ్వతంబు గాదు, దార సుతాదులు తనవెంట రాలేరు, భృత్యులు మృతినిఁ దప్పింపలేరు, బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేరు, బలపరాక్రమ మేమి పనికిరాదు, ఘనమైన సకల భాగ్యంబెంతఁ గల్గియు గోచిమాత్రంబైనఁ గొంచుఁబోడు”

“ప్రహ్లాదుండేపాటి పైఁడి కానుకలిచ్చె? మదగజం బెన్నిచ్చె మౌక్తికములు? నారదుండెన్నిచ్చె నగలు రత్నంబు? ల హల్య నీ కే యగ్రహారమిచ్చె? నుడుత నీకేపాటి యూడిగంబులు చేసె? ఘన విభీషణుఁడేమి కట్నమిచ్చె? పంచపాండవులేమి లంచమిచ్చిరి నీకు? ద్రౌపది నీ కెంత ద్రవ్యమిచ్చె?”

“అడవిపక్షుల కెవ్వడాహారమిచ్చెను?
మృగజాతి కెవ్వడు మేతబెట్టె?
వనచరాదులకు భోజన మెవ్వడిప్పించె?
జెట్ల కెవ్వడు నీళ్ళు చేదిపోసె?
స్త్రీల గర్భంబున శిశువు నెవ్వడు పెంచె?
ఫణుల కెవ్వడు పోసె బరగబాలు?
మధుపాళి కెవ్వడు మకరంద మొనరించె?
బసులకెవ్వ డొసంగె బచ్చిపూరి?
జీవకోట్లను బోషింప నీవెకాని
వేఱె యొక దాత లేడయ్య వెదకిచూడ!”

ఇంకా అనన్యసామాన్యమైన కవి శేషప్ప నృసింహ శతకం సీసపద్యాలు, తేటగీతులు చాలా ఉన్నాయి కానీ మన సందర్భానికి మచ్చుకు ఇవి చాలు.

2024 ఎన్నికల ప్రచారోద్ధతిలో ఎందుకో అయోధ్య బాలరాముడు వెనక్కు వెళ్లి భారతీయ మహిళల మంగళ సూత్రాలు ముందుకొచ్చాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ మీదికే మోడీ ఎక్కుపెడతారని కాంగ్రెస్ ఊహించి ఉండదు. అదే మోడీ ప్రత్యేకత. ఎవరూ ఊహించని సమయంలో, ఊహించని చోట సర్జికల్ స్ట్రైక్స్ జరుగుతూ ఉంటాయి.

అదానీ, అంబానీ లాంటి ఒకరిద్దరు బి జె పి అనుకూల సంపన్నులకు బి జె పి ప్రధాని మోడీ దేశాన్ని గంపగుత్తగా అగ్గువకు రాసిచ్చేస్తున్నారని చెప్పాలన్నది కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఉద్దేశం. మాకు దేశం ఓటేస్తే…మేము అధికారంలోకి వస్తే…మోడీ హయాంలో సంపన్నులు అక్రమంగా పోగు చేసుకున్న ఆస్తిని నిరుపేదలకు పంచిపెడతామన్న విశాలమైన అర్థం వచ్చేలా ఘనంగా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పుకుంది. ప్రతిపక్షాలు విసిరే రాళ్లతోనే తన పునాదిని బలంగా నిర్మించుకోవడంలో నేర్పరి అయిన మోడీ వెంటనే దీన్ని అందిపుచ్చుకునే సరికి వివరణలు ఇచ్చుకోలేక కిందా మీదా పడుతోంది కాంగ్రెస్.

“చూశారా! కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భారతీయ మహిళల మంగళసూత్రాలను కూడా లాగేసుకుంటారట. ఒక కుటుంబానికి రెండిళ్లు ఉంటే ఒకటి ప్రభుత్వం లాగేసుకుంటుందట. దేశ సంపదపై మొదటి హక్కు ముస్లిములకే అని కాంగ్రెస్ మన్మోహన్ ప్రధాని హోదాలో బల్ల గుద్ది మరీ చెప్పారు. ఎక్కువమంది పిల్లలున్న(ముస్లిములకే) మన కష్టార్జితాన్ని దోచిపెడతారట. అధికారంలోకి వచ్చాక ప్రజల దగ్గర ఉన్న బంగారంతోపాటు సంపదనంతా సర్వే చేసి… అందరికీ సమానంగా పునఃపంపిణీ చేస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్పష్టంగా చెబుతోంది. మన సంపదను లాగేసుకుని మనల్ను రోడ్లమీద పడేసే నక్సల్ సిద్ధాంతంతో కాంగ్రెస్ వస్తోంది. జాగ్రత్త…”

నిజానికి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఏముందో పెరుమాళ్ళకే ఎరుక. మోడీ విరుచుకుపడడంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. మా ఉద్దేశం అది కాదంటే ఒక చిక్కు. అవునంటే మరో చిక్కు. “మేము హిందువులవైపు- మీరు ముస్లిములవైపు” అని కాంగ్రెస్ ను ఒక మూలకు తోయడానికి పనికివచ్చే ఏ చిన్న అవకాశాన్నీ మోడీ- అమిత్ షా వదులుకోరన్న స్పృహ కాంగ్రెస్ కు ఎందుకోగానీ ఉండదు. సరిగ్గా వారేమి కోరుకుంటారో కాంగ్రెస్ అదే చేస్తూ ఉంటుంది.

ఊరికే మాటవరసకు-
కాంగ్రెస్ వస్తే సమసమాజం ఏర్పడి సంపన్నుల ఆస్తి పేదవారికి వెళుతుందా?
అదానీలు, అంబానీలు కాంగ్రెస్ పాలన వేళల్లో పుట్టలేదా? పుట్టి పెరగలేదా?

శాస్త్రం ఆగిపోయిన చోట నమ్మకాలు మొదలవుతాయి. నమ్మకాలే సెంటిమెంట్లుగా మారతాయి. ఆ సెంటిమెంట్లనే ఎన్నికల్లో పిండుకోవాలి. అమ్ముకోవాలి. దానికి “పొలిటికల్లీ కరెక్ట్” అని అంగీకారం కూడా భాషలో అనాదిగా ఉంది.

కొన్ని సార్లు కవితా న్యాయం (పొయెటిక్ జస్టిస్) కుదరకపోయినా సందర్భం రక్తి కడుతూ ఉంటుంది. తాళి కట్టినా…విరాగిగా మారి ఏకాంత పథంలో ఉన్న మోడీ 2024 ఎన్నికల పందిట్లో మంగళసూత్రాపహరణ సూత్రం గురించి మాట్లాడుతుంటే…దానికి ఏ కాంతకు తాళే కట్టని రాహుల్ సమాధానమిస్తూ ఉన్నారు.

రెండు పరస్పర విరుద్ధ సిద్ధాంతాల మధ్యలో సామాన్యులు కవి శేషప్పను ఆశ్రయించడమే ఉత్తమం!

ఇదొక రాజకీయ సింహాసన ద్వాత్రింశిక వై’తాళి’క రుతువు!
మెడలో మంగళసూత్రం కదిలివచ్చిన ఓట్ల క్రతువు!!…… -పమిడికాల్వ మధుసూదన్              9989090018

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘హస్తరేఖలు మన పిడికిట్లో ఉన్నట్టే ఉంటాయి, కానీ మన మాట వినవు’’
  • వినేవాడు వెర్రివెంగళప్ప అయితే… చెప్పేది రష్మిక మంధానా..!!
  • పరమ నాసిరకం ఫైటర్లను ఇండియాకు అంటగట్టే యత్నం… పార్ట్-2
  • మోడీ వినక తప్పలేదు… బనకచర్ల కుట్రను చేధించిన రేవంత్‌రెడ్డి…
  • F-35 …. అడ్డగోలు లోపాల ఫైటర్… అమెరికా అంటగట్టే యత్నం… పార్ట్-1
  • దిల్ రాజు మారడు… ఎవడూ తన కళ్లకు ఆనడు… ప్రతి మాటలో అహం..!!
  • ‘సంఘ్’ నేపథ్యమే ప్రధాన అర్హతా..? చంద్రబాబు మాటే చెల్లుబాటా..?!
  • కామాఖ్య కాదు… మన ‘మహా నేతలూ’ నమ్మిన ఈ తాంత్రిక గుడి వేరు…
  • షెఫాలి – స్వేచ్ఛ … ఇద్దరి జీవితాలు… ఒకటే జీవితపాఠం… 
  • అసలెవరీ “సుండలోడు”….” సుండలాయన”….” సుండల్‌క్కారన్”….?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions